జాతీయ వార్తలు

ఆవుల ఆకలి చావులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, ఆగస్టు 6: బిజెపి అధికారంలో ఉన్న రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గో సంరక్షణ శాలలో ఆకలి బాధ తాళ లేక, ఆలనా పాలనా చూసే వాళ్లు లేక 500కు పైగా ఆవులు మృత్యువాత పడడం సంచలనం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా ఆవుల రాజకీయాలు నడుస్తున్న వేళ వెలుగు చూసిన ఈ సంఘటన అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపికి ఇబ్బందికరంగా మారింది. జైపూర్‌లోని హింగోనియా గోశాలలో 8 వేలకు పైగా గోవులను సంరక్షిస్తున్నారు. అయితే వేతనాల చెల్లింపులో జాప్యం చేస్తున్నారనే కారణంగా అక్కడ పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు గత నెలలో సమ్మెకు దిగారు. దీంతో గోశాలను శుభ్రం చేసే వారు కానీ, గోవులకు ఆహారం, నీళ్లు అందించే వారు కరువై పోయారు. దీనికి తోడు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోశాల అంతా కూడా బురదమయమై పోయింది. ఆవు పేడ కుప్పలు కుప్పలుగా పేరుకు పోవడం.. అంతా కలిసి గోశాల అంతా దుర్గంధమయమై పోయింది. ఈ పరిస్థితులకు తోడు ఆహారం అందించే వారు కూడా లేక పోవడంతో గత రెండు వారాల్లో 500కు పైగా ఆవులు చనిపోయాయి.
పరిస్థితి తెలిసి గోశాలను శుభ్రం చేయడానికి స్వచ్ఛంద సేవకులు రెండు రోజుల క్రితం రావడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఎన్ని ఆవులు చనిపోయాయో అధికారిక లెక్కలు లేవు కానీ, గత రెండు రోజుల్లో తాము 90 దాకా చనిపోయిన గోవుల శవాలను తొలగించామని, ఇంకా చాలా ఆవులే చనిపోయాయని వాళ్లు చెబుతున్నారు. చనిపోయిన ఆవుల్లో చాలా ఆవులు జబ్బుతో కాక ఆకలి కారణంగానే చనిపోయాయని ప్రభుత్వ పశు వైద్యుడు డాక్టర్ దేవేంద్ర కుమార్ కూడా చెప్తున్నారు. ‘గత మే నెలనుంచి ఇక్కడ పని చేసే కార్మికులకు జీతాలు చెల్లించకపోవడమే ఈ చావులకు ప్రధాన కారణం. కార్మికులు లేకుండా ఎవరైనా సమస్యను ఎలా పరిష్కరించగలరు’ అని ఈ గోశాల చైర్మన్ భగవత్ సింగ్ దేవల్ వాపోయారు. ఈ గోశాల నిర్వహణకు రాష్ట్ర అపభుత్వం ప్రతి ఏటా 20 కోట్లు ఖర్చు చేస్తోంది. గోశాలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరూ సమ్మెకు దిగడంతో గోవుల ఆలనా పాలనా చూసే వాళ్లే లేకపోయారు. జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు కాంట్రాక్ట కార్మికులను నియమించుకున్న సంస్థకు మధ్య వివాదం కారణంగానే కార్మికులకు జీతాలు ఆగిపోయాయి.
కాగా, ఆవుల మరణాల వార్త స్థానిక మీడియాలో రావడంతో స్పందించిన రాజస్థాన్ హైకోర్టు దీనిపై ఒక నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో కదలిక వచ్చిన రాష్ట్రప్రభుత్వం గోశాలలో పేరుకుపోయిన బురద, పేడను తొలగించడానికి భారీ యంత్రాలను రంగంలోకి దించింది. ‘ముఖ్యమంత్రి ఈ సంఘటనపై చాలా ఆందోళనగా ఉన్నారు. ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి సంఘటనపై దర్యాప్తు జరపాలని, సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు’ అని రాష్ట్ర మంత్రి రాజేంద్ర సింగ్ రాథోడ్ చెప్పారు. మరోవైపు శనివారం గోశాలను సందర్శించిన మరో మంత్రి రాజ్‌పాల్ షెకావత్ ముఖ్యమంత్రికి పరిస్థితిని తెలియజేస్తానని చెప్పారు. గోశాలను శుభ్రం చేయడానికి, మెరుగైన పరిస్థితులను కల్పించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కాగా, అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణా వైఫల్యం, సదుపాయాల కొరత కారణంగా వందలాది ఆవులు చనిపోయాయని ప్రతిపక్ష కాంగ్రెస్ ధ్వజమెత్తగా, వసుంధరా రాజె ప్రభుత్వం అమానుష ప్రవర్తన కారణంగానే ఇంత పెద్ద సంఖ్యలో ఆవులు చనిపోయాయని విశ్వ హిందూ పరిషత్ ఆరోపించింది. శనివారం గోశాల అంతా తిరిగి చూసిన రాజస్థాన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రామేశ్వర్ డుడి విలేఖరులతో మాట్లాడుతూ, ‘గోరక్షకులుగా చెప్పుకుంటున్న వాళ్లు ఇప్పుడు ఎక్కడికి పోయారు?’ అని ప్రశ్నించారు.