జాతీయ వార్తలు

నియామకాల్లో అన్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బంది నియామకంలో అమలుచేస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేన్ల విధానాన్ని యథాతథంగా కొనసాగించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, దీనిని అమలు చేయించేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం కోర్టులో మరోసారి అప్పీల్ చేయనున్నదని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ గురువారం రాజ్యసభలో హామీ ఇచ్చారు. రాజ్యసభ జీరో అవర్‌లో ఎస్పీ, బీఎస్పీ, ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు విశ్వవిద్యాలయాల బోధనా సిబ్బంది నియామకంలో 200 పాయింట్ల రోస్టర్ విధానానికి బదులు 16 పాయింట్ల రోస్టర్ విధానాన్ని అవలంభించటం వలన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందంటూ పెద్దఎత్తున గొడవ చేశారు. రాంగోపాల్ యాదవ్, సతీష్‌చంద్ర తదితర ప్రతిపక్ష నాయకులు ప్రస్తావించిన ఈ అంశంపై ప్రకాశ్ జావడేకర్ స్పందిస్తూ బోధనా సిబ్బందిని నియమించే విషయంలో విశ్వవిద్యాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలన్నదే ఎన్‌డీఏ ప్రభుత్వ విధానమని అన్నారు. అలహాబాద్ హైకోర్టు తమ ఆదేశంలో విశ్వవిద్యాలయంలోని ఒక విభాగాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని బోధనా సిబ్బందిని ఎంపిక చేయాలని సూచించటం వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. ఒక విభాగాన్ని యూనిట్‌గా తీసుకుని సిబ్బందిని ఎంపిక చేయటం వలన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జరుగుతున్న అన్యాయానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నాం.. ఈ మొత్తం వివరాలను కోర్టు ముందు పెడతాం.. కోర్టు ఈ వివరాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందనే పూర్తి విశ్వాసం తనకు ఉన్నదని జావడేకర్ తెలిపారు. ఒక విభాగాన్ని కాకుండా విశ్వవిద్యాలయాన్ని యూనిట్‌గా తీసుకోవడంతోపాటు 200 పాయింట్ పద్ధతిలోనే బోధనా సిబ్బందిని ఎంపిక చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానమని ఆయన మరోసారి ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని దాదాపు నలభై విశ్వవిద్యాలయాల్లో విభాగాన్ని యూనిట్‌గా తీసుకుని బోధనా సిబ్బందిని ఎంపిక చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జరిగే నష్టంపై అధ్యయనం జరిపింది.. ఈ వివరాలన్నింటిని కోర్టు ముందు పెడుతున్నామని ఆయన చెప్పారు. రిజర్వేషన్ల విధానాన్ని బలపరుస్తున్నాం కాబట్టే ఈ మేరకు యూజీసీ ద్వారా ప్రత్యేక ఆదేశాలు జారీ చేయించామని జావడేకర్ తెలిపారు. ప్రభుత్వం దాఖలు చేస్తున్న రివ్యూ పిటిషన్ విజయం సాధిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పూర్తి న్యాయం జరుగుతుందని జావడేకర్ తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ పక్షం నాయకుడు రాంగోపాల్ యాదవ్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయానికి బదులు విభాగాన్ని (డిపార్ట్‌మెంట్)ను ఒక యూనిట్‌గా తీసుకోవటం వలన బోధనా సిబ్బంది నియామకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని చెప్పారు. ఈ విధానం ఇలాగే కొనసాగితే రెండు వందల సంవత్సరాలు గడిచినా ఈ వర్గాల వారు విశ్వవిద్యాలయాల్లో బోధనా సిబ్బందిగా ఎంపిక కారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అన్యాయం జరుగకుండా చూస్తానని మంత్రి హామీ ఇచ్చినా.. విశ్వవిద్యాలయాల్లో మాత్రం నియామకాలు జరిగిపోతున్నాయి.. ఇది అన్యాయం కాదా? అని రాంగోపాల్ యాదవ్ ప్రశ్నించారు. నియామకాలను వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. బోధనా సిబ్బంది నియామకంలో రిజర్వేషన్లు అమలు చేసేందుకు వెంటనే పార్లమెంటులో బిల్లు ప్రతిపాదించాలని యాదవ్ డిమాండ్ చేశారు. రివ్యూ పిటిషన్ల వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేసేందుకు వెంటనే బిల్లు ప్రతిపాదించాలని బీఎస్పీ పక్షం నాయకుడు సతీష్ చంద్ర డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ జారీచేయాలని మనోజ్ కుమార్ ఝా డిమాండ్ చేశారు. ఉన్నత వర్గాల్లోని ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చూపించిన చొరవ దీనిలో ఎందుకు చూపించటం లేదని ఆయన ప్రశ్నించారు. వీరి అభిప్రాయాలతో మొత్తం ప్రతిపక్షం ఏకీభవించింది. విశ్వవిద్యాలయాల బోధనా సిబ్బంది ఎంపికను వెంటనే నిలిపివేయాలంటూ ప్రతిపక్షం గొడవ చేయటంతో సభాధ్యక్షుడు వెంకయ్య నాయుడు సభను శుక్రవారానికి వాయిదా వేయకతప్పలేదు. అంతకుముందు ఇదే అంశంపై సభ రెండుసార్లు వాయిదా పడింది.

చిత్రం..బడ్జెట్ సెషన్‌కు హాజరైన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్ జావడేకర్