జాతీయ వార్తలు

కాంగ్రెస్‌ను విమర్శించడం సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం వ్యవసాయం, ఉపాధి కల్పన, అవినీతిని అదుపు చేయటం తదితర రంగాల్లో ఘోరంగా విఫలమైందని లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే ఆరోపించారు. గురువారం లోక్‌సభలో రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు. అరవైయేళ్ల కాంగ్రెస్ పాలనలోనే దేశం గణనీయమైన పురోగతి సాధించిందని అన్నారు.
ఎన్‌డీఏ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచిందని ఖర్గే ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను కూడా ఈ ప్రభుత్వం దెబ్బతీస్తోందని ఖర్గే దుయ్యబట్టారు. ఈ సమస్యను పరిష్కరించాలని తాము నాలుగు నెలల నుండి పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఖర్గే అన్నారు. ఉన్నత వర్గాల్లోని ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్లను రాత్రికి రాత్రి కల్పించిన మీరు బోధనా సిబ్బంది నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని నాలుగు నెలలైనా సరిదిద్దలేరా? అని నిలదీశారు. కాంగ్రెస్ పాలన వల్లే దేశంలో అక్షరాస్యతా శాతం పెరిగిందని చెప్పారు. కాంగ్రెస్ మూలంగానే దేశంలో నీటి పారుదల సౌకర్యం, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరిగాయంటూ వివరాలను సభముందు పెట్టారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి కృషిచేసిన కాంగ్రెస్‌ను మీరు మాటమాటకు విమర్శించటం ఎంతమాత్రం తగదని ఖర్గే స్పష్టం చేశారు. మొదటి ప్రధాన మంత్రి పండిత్ నెహ్రు దేశంలో పెద్ద పెద్ద సంస్థలు, పరిశ్రమలను స్థాపించారని ఖర్గే వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశాభివృద్ధికి అమలు చేసిన పథకాలు, ఇతర కార్యక్రమాలను ఆయన సభ ముందు పెడుతూ 60 ఏళ్లలో మేము ఏమీ చేయలేదని ఆరోపించటం తగదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలే దేశం జీడీపీని పెంచాయన్నారు.
మోదీ ప్రభుత్వం వైఫల్యాల మూలంగానే దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోంది, అభివృద్ధి కుంటుపడుతోందని ఖర్గే ఆరోపించారు. పెద్దనోట్ల రద్దు ద్వారా ఈ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని దుయ్యబట్టారు. పెద్దనోట్ల రద్దు వల్ల గ్రామీణ ప్రాంతాలోని బడుగు, బలహీన వర్గాలకు నష్టం కలిగింది తప్ప.. ధనికులు, బీజేపీ మిత్రులకు ఎలాంటి నష్టం జరగలేదని ఖర్గే ఆరోపించారు. రైతులు దెబ్బతిన్నారు.. చిన్న వ్యాపారస్తులు, కార్మికులకు ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయని ఖర్గే చెప్పారు. నల్లధనాన్ని వెలికి తీయటంలో ఈ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ప్రతి పౌరుడి జేబులో 15లక్షల రూపాయలు వేస్తామన్న హామీ ఏమైంది? ప్రతి సంవత్సరం ఒక కోటి మంది యువకులకు ఉపాధి కల్పిస్తామన్న హామీ ఏమైందని ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నిలదీశారు. అబద్దాలు చెప్పటం మోదీకి అలవాటుగా మారిందంటూ ఖర్గే వ్యంగ్య బాణాలు విసిరారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై తమతో ఒక గంటపాటు చర్చ జరిపేందుకు ప్రధాన మంత్రి సిద్ధమా? అని ఖర్గే సవాల్ చేశారు. దివాళా తీస్తున్న రిలయన్స్ సంస్థకు రాఫెల్ యుద్ధ విమానాల కాంట్రాక్టు ఇస్తారా? బోల్టు కూడా తయారు చేయని సంస్థ యుద్ధ విమానాలు తయారు చేస్తుందా? అని ఖర్గే ప్రశ్నించారు. రాఫెల్‌పై దర్యాప్తుకు జేపీసీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్న హామీని ఎందుకు నిలబెట్టుకోలేకపోయారని ఆయన మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వేలాది గ్రామాలకు ఇంకా విద్యుత్ సరఫరా జరగటం లేదని విమర్శించారు. మోదీ పాలనలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. మూకుమ్మడి దాడులు ఎందుకు జరుగుతున్నాయని ఖర్గే ప్రధానిని నిలదీశారు.