జాతీయ వార్తలు

నిబద్ధతగల నేత ఏబీ వాజపేయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశ రాజకీయాలకు కేంద్ర బిందువులాంటిదైన పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో దివంగత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి తైలవర్ణ చిత్రాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఉదయం ఆవిష్కరించారు. ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ తోపాటు పలువురు మంత్రులు, ఎంపీలు కార్యక్రమానికి హాజరయ్యారు. అధికారం కోసం సిద్ధాంతాలు, ప్రజాస్వామ్యం విలువలతో ఎప్పుడు రాజీ పడలేదని రాష్ట్రపతి కోవింద్ శ్లాఘించారు. వాజపేయి మహా నాయకుడంటూ దేశాభివృద్ధికి ఆయన ఎంతో చేశారని ఆయన అన్నారు. తొలుత వాజపేయి తైలవర్ణ చిత్రాన్ని వేసిన కిషన్ కన్హాయిని శాలువ కప్పి సన్మానించారు. వాజపేయి తన వౌనం ద్వారా చెప్పదలచుకున్నది చెప్పేవారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చాలాకాలం ప్రతిపక్షంలో గడిపిన ఆయన తన సిద్ధాంతాల విషయంలో ఎప్పుడూ రాజీపడలేదని ప్రధాని అన్నారు. వాజపేయి ఇక మీదట పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో శాశ్వతంగా ఉండిపోతారని ఆయన స్పష్టం చేశారు. వాజపేయి గురించి ఎంత చెప్పినా తరగదని, ఆయనో గొప్ప వక్త అంటూ మోదీ ప్రశంసించారు. తన రాజకీయ జీవితమంతా ప్రజల సమస్యలు పరిష్కరించడానికే వెచ్చించారని ఆయన అన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు తప్ప శతృవులు ఉండరన్నది వాజపేయి సిద్ధాంతమని ఆయన తెలిపారు. ఏబీ వాజపేయి నుంచి తమలాంటి నాయకులు ఎంతో నేర్చుకున్నారని స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. దివంగత నేతకు శతృవులనేవారే లేరని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చెప్పారు. లౌకికవాదంలేని భారత దేశం దేశమే కాదని వాజపేయి అనేవారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ అన్నారు. వాజపేయి ఏనాడూ తన రాజకీయ ప్రత్యర్థులను పరుష పదజాలంతో విమర్శించలేదని ఆయన గుర్తుచేశారు.

చిత్రం.. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో దివంగత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి తైలవర్ణ చిత్రాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుమిత్రా మహాజన్, గులాం నబీ ఆజాద్ తదితరులు