జాతీయ వార్తలు

ఉపేక్ష వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: పుల్వామాలో హేయమయిన ఆత్మాహుతి దాడికి కారణమయిన ఉగ్రవాదుల పని పట్టాల్సిందేనని యావత్ దేశం ముక్తకంఠంతో నినదించింది. ఉగ్రవాదం అంతు చూసేదాకా వదిలేది లేదని తెగేసి చెప్పింది. ఉగ్రవాదంపై పోరులో, దేశ సమైక్యత, సమగ్రతలను కాపాడటంలో ధీరోదాత్తతను ప్రదర్శిస్తున్న భద్రతా బలగాలకు బాసటగా ఉంటానని యావద్భారతం ఒక్క గొంతుకతో చెప్పింది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో భారత్ నిబద్ధతను నొక్కిచెబుతూ దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఐక్యతను ప్రదర్శించాయి. దేశ సమైక్యత, సమగ్రతలను పరిరక్షిస్తున్న భద్రతా బలగాలకు ముక్తకంఠంతో సంఘీభావాన్ని ప్రకటించాయి. ప్రభుత్వం శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాద ఆత్మాహుతి దాడిని, ఆ దాడికి దేశం వెలుపల నుంచి అందిన మద్దతును తీవ్రంగా ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉగ్రవాద సవాలును ఎదుర్కోవడంలో ప్రభుత్వానికి ప్రతిపక్షాలకు చెందిన నాయకులంతా తమ మద్దతు ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ మాట్లాడుతూ దేశంలోని అన్ని ప్రధాన జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షుల సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరాలని హోంమంత్రికి సూచించారు. ఈ ప్రతిపాదనను తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు దెరెక్ ఒబ్రియెన్, సీపీఐ నాయకుడు డి.రాజా సమర్థించారు. ‘ఈ సవాళ్లను ఎదుర్కోవడంలో, తిప్పికొట్టడంలో భారత్ దృఢత్వాన్ని ప్రదర్శించింది. ఈ సవాళ్లకు వ్యతిరేకంగా పోరాడటంలో జాతి యావత్తు ఒక్క గొంతుకతో తన నిబద్ధతను వ్యక్తం చేసింది’ అని సుమారు రెండు గంటల సేపు సాగిన అఖిలపక్ష సమావేశంలో ఆమోదించిన తీర్మానం పేర్కొంది. ‘ఉగ్రవాదంపై పోరాడటంలో, భారతదేశ సమైక్యతను, సమగ్రతను పరిరక్షించడంలో నిమగ్నమయి ఉన్న భద్రతా బలగాలకు ఈ రోజు మేము బాసటగా ఉన్నాం. ఐక్యంగా సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాం’ అని ఆ తీర్మానం పేర్కొంది. ప్రభుత్వం ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానంలో ‘భద్రతా బలగాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషికి రాజకీయ పార్టీలు బాసటగా నిలుస్తున్నాయి’ అని ప్రతిపాదించినట్లు ప్రతిపక్షాలకు చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, ప్రతిపక్షాల సూచన మేరకు ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు’ అనే పదాలను తరువాత తొలగించినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. ఈ తీర్మానంలో ఎక్కడా పాకిస్తాన్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. అయితే, భారత్ సీమాంతర ఉగ్రవాద జాడ్యాన్ని ఎదుర్కొంటోందని, పొరుగు దేశంలోని శక్తులు ఈ ఉగ్రవాద జాడ్యాన్ని క్రియాశీలకంగా ప్రోత్సహిస్తున్నాయని తీర్మానంలో పేర్కొన్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థ జైష్ ఎ మొహమ్మద్ (జేఈఎం) గురువారం పుల్వామాలో జరిపిన ఆత్మాహుతి బాంబు దాడిలో 44 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారు.

చిత్రం.. ఢిల్లీలో శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో మాట్లాడుతున్న రాజ్‌నాథ్ సింగ్