జాతీయ వార్తలు

పాక్‌ది ఉగ్ర నైజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యవత్మాల్ (మహారాష్ట్ర), ఫిబ్రవరి 16: ఉగ్రవాదానికి ప్రోత్సహమిస్తున్న పాకిస్తాన్ కుయుక్తులను చిత్తుచేస్తామని, ఈ విషయమై భద్రతా బలగాలకు స్వేచ్ఛనిచ్చామని, ప్రజలు సహనంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పుల్వామా ఉగ్రవాద దాడి ఘటన దేశ ప్రజలను కలచివేసిందని, ఈ దాడికి పాల్పడినవారిని కఠినంగా శిక్షించి తీరుతామని ఆయన అన్నారు. శనివారం ఇక్కడ యవత్మల్ జిల్లా పండకవాడా పట్టణంలో జరిగిన బ్రహ్మాండమైన ర్యాలీలో ఆయన మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి పర్యాయపదమని, దేశ విభజన తర్వాత అవతరించిన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపించడం తప్ప మరోపని లేదని అన్నారు. ఆర్థికంగా దివాళా స్థితికి చేరుకున్న పాకిస్తాన్‌ను ప్రపంచ దేశాల్లో ఏకాకిని చేస్తామన్నారు. పుల్వామా ఘటనపై దేశమంతా ముక్తకంఠంతో ఖండిస్తోందని, సీఆర్‌పీఎఫ్ బలగాల పోరాటపటిమ ఊరికేపోదని, తగిన సమయంలో ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. ఉగ్రవాద నేరాలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తిలేదని, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే శక్తులపై ఉక్కుపాదం మోపి కఠినంగా శిక్షించే బాధ్యతను ఆర్మీకి ఇచ్చామని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న శక్తులను ఎప్పుడు, ఎక్కడ, ఏ సమయంలో శిక్షించే విషయమై ఆర్మీ నిర్ణయిస్తుందని అన్నారు. అమరులైన సీఆర్‌పీఎఫ్ జవాన్ల కుటుంబానికి అండగా ఉంటామని, యావత్తు భారతావని ఈ ఘటనపై వౌనంగా రోదిస్తోందని అన్నారు. ప్రజల ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగానే నడుచుకుంటామని, ఐదేళ్లలో ఈ ప్రాంత అభివృద్ధికోసం పనిచేశామని అన్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద 1.25 కోట్ల మంది రైతు కుటుంబాలకు సాలీనా రూ.6వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని అన్నారు. ఈ సొమ్ము నేరుగా రైతు బ్యాంకు ఖాతాల్లో జమవుతుందని అన్నారు. ఈ సొమ్మును మూడు విడతల్లో చెల్లిస్తామన్నారు. తమ హయాంలో అవినీతి రహిత పాలన అందించామని, అభివృద్ధిపై మాటలకు పరిమితం కాకుండా చేతల్లో చూపిస్తున్నామని అన్నారు. ప్రజలకు ప్రధాన సేవకుడిగా పనిచేసే అవకాశం మరోమారు ఇవ్వాలని ఆయన కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య, క్రీడా రంగాల్లో వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, ఇతోధికంగా నిధులు పెంచామని అన్నారు. ఈ ర్యాలీ ప్రారంభ సమయంలో ప్రజలు రెండు నిమిషాల సేపు వౌనం పాటించి అమర జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, హన్సరాజ్ ఆహిర్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఏకలవ్య ఆదర్శ రెసిడెన్షియల్ స్కూలును ప్రధాని ప్రారంభించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద నిర్మాణం పూర్తయిన ఇండ్ల తాళం చెవులను ఎంపిక చేసిన లబ్ధిదారులకు అందచేశారు.

చిత్రం..‘ప్రధాన మంత్రి ఆవాస్ యోజన’ కింద నిర్మాణం పూర్తయిన ఇళ్ల తాళం చెవులను లబ్ధిదారులకు అందజేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ