జాతీయ వార్తలు

ధనికులకే చౌకీదారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రయాగ్‌రాజ్, మార్చి 18: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రియాంక గాంధీ సరికొత్త మలుపు తిప్పారు. గంగానదిపై పడవ ప్రయాణం ద్వారా సోమవారం తొలి ప్రచారం మొదలుపెట్టిన ప్రియాంక ‘మై భీ చౌకీదార్’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన తాజా ప్రచారాన్ని తనదైనశైలిలో తిప్పికొట్టారు. ‘్ధనవంతులకే కాపాలాదారులుంటారు. రైతులకు కాదు’ అంటూ వ్యంగ్యోక్తి విసిరారు. ఈ పడవ ప్రయాణం ద్వారా జరిగే ప్రచారం అంతిమంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశి లోక్‌సభ స్థానానికి దారితీస్తుంది. ఎప్పుడైతే ప్రధాని మోదీ ప్రతిఒక్కరూ కాపలాదారులు కావాలంటూ పిలుపునిచ్చారో బీజేపీ నేతలందరూ తమ పేర్లముందు చౌకీదార్ అని తగిలించుకున్న నేపథ్యంలో ప్రియాంక మాట్లాడారు. మూడు రోజులపాటు సాగే ఈ పడవ ప్రచారం ద్వారా ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేయాలన్న సంకల్పంతో ఉన్న ప్రియాంక తొలిరోజు ప్రచారమే విశేష ఆదరణ చూరగొంది. తమ నాన్నమ్మ ఇందిరను తలపించేలా ప్రియాంక ప్రతిఒక్కర్నీ పలకరించారు. అక్కున చేర్చుకున్నారు. ఈ ప్రచారంలో భాగంగా అనేకచోట్ల మాట్లాడిన ప్రియాంక కేంద్ర ప్రభుత్వం పేదలను అణచివేస్తోందని ధ్వజమెత్తారు. ‘ఈ దేశం మీది. ఈ ప్రజాస్వామ్య దేశం మీది. రాజకీయాలను గుణాత్మకంగా ముందుకు సాగించే అధికారమూ మీదే. మీరున్నారు కాబట్టే మేమంతా ఉన్నాం. మీరే లేకపోతే ఈ ప్రియాంకే లేదు’ అని అన్నారు.
ఈ ప్రచారంలో భాగంగా విద్యార్థులతో కూడా ప్రియాంక మాట్లాడారు. వారిలో కొందరు తనతోపాటు బోటు ప్రచారంలో పాల్గొనాలని ఆమె ఆహ్వానించారు. గత ఎన్నికల ప్రచార సమయంలో రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన మాట ఏమైందని ప్రియాంక ప్రశ్నించారు. ప్రపంచమంతా తిరుగుతున్న ఆయన ఎప్పుడైనా మీ ప్రాంతానికి వచ్చారా? అని ప్రజలను అడిగారు. ప్రజలను తప్పుదోవ పట్టించడం ద్వారా అధికారంలో ఉండొచ్చునని ఆయన భావిస్తున్నారని, ఈ ఐదేళ్ల కాలంలో ఎన్నో వ్యవస్థలు ఉనికిని కోల్పోయాయని ఆమె అన్నారు. అసలు దేశాన్ని పరిపాలించే తీరు ఇది కాదంటూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. ‘నేను కూడా హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు. కానీ దేశం ప్రమాదంలో పడింది కాబట్టే వచ్చాను. దేశ రాజ్యాంగమూ ప్రమాదంలో పడింది. ప్రస్తుత ఎన్నికల్లో ఆలోచించి ఓటేయండి’ అని ప్రియాంక ప్రజలకు పిలుపునిచ్చారు. కేవలం మాటలతో కాలక్షేపం చేయడం తమ నైజం కాదని, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని ఆమె స్పష్టం చేశారు.
చిత్రాలు.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో సోమవారం ఎన్నికల ప్రచారం ప్రారంభం సందర్భంగా
సిర్సా ఘాట్‌లో బోటులో వెళుతున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ