జాతీయ వార్తలు

కారుదే జోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 18: అసెంబ్లీ ఎన్నికల్లో కనబరచిన ప్రభంజనాన్ని లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కూడా తెలంగాణలోని అధికార టీఆర్‌ఎస్ పార్టీ కనబరచబోతోందని టైమ్స్ నౌ సర్వే అంచనా వేసింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో 13 సీట్లను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని, కాంగ్రెస్ పార్టీకి ఒక్కసీటు మాత్రమే దక్కే అవకాశం ఉంటుందని తెలిపింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి రెండు సీట్లను గెల్చుకునే అవకాశం ఉందని, అలాగే మజ్లిస్ పార్టీ ఒక సీటు కైవశం చేసుకుంటుందని వెల్లడించింది. టైమ్స్ నౌ, వీఎమ్మార్ సంస్థలు ఈనెలలో ఈ సర్వే నిర్వహించాయి. ఇందులో 16,931 పాల్గొన్నారని, అంతిమ ఫలితాలు ప్లస్ ఆర్ మైనస్ త్రీగా ఉండొచ్చునని తెలిపాయి. ఈసారి కూడా కేంద్రంలో బీజేపీ స్వంత బలంతోనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సీట్ల కంటే కూడా 10 సీట్లు ఎక్కువగానే బీజేపీ గెల్చుకుంటుందని, 282 లోక్‌సభ స్థానాలను దేశవ్యాప్తంగా కైవశం చేసుకుంటుందని ఈ సర్వే వెల్లడించింది. అలాగే కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కూటమికి 136 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అలాగే సమాజ్‌వాది పార్టీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ, బీజేడీ, టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీ పార్టీలకు కలసి 136 సీట్లు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయని ఈ సర్వే పేర్కొంది. మొత్తమీద ఎన్డీయేకు 2014లో వచ్చిన సీట్ల కంటే 54 సీట్లు తగ్గే అవకాశం ఉందని ఆ సర్వే తెలిపింది. అలాగే 2014 ఎన్నికల కంటే కూడా కాంగ్రెస్ కూటమి, బీజేపీయేతర పార్టీలు మెరుగైన ఫలితాలు కనబరిచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అయినప్పటికీ రెండోసారి నరేంద్ర మోదీ ప్రధాని కాకుండా నిలువరించే స్థాయిలో ఈ పార్టీల పనితీరు ఉండకపోవచ్చునని తెలిపింది. దేశంలో అతి పెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లో కలిసి పోటీ చేస్తున్న సమాజవాది పార్టీ, బీఎస్పీలకు 36 సీట్లు వచ్చే అవకాశం ఉందని, అలాగే గత ఎన్నికల్లో 73 సీట్లను గెల్చుకున్న బీజేపీ కూటమికి 42 సీట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. మహారాష్టల్రో శివసేన, బీజేపీ కూటమికి 39 సీట్లు వచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి బలం 9 సీట్లకు పెరగవచ్చునని తెలిపింది. బీహార్‌లో బీజేపీ, జేడీయూ కూటమి 27 సీట్లను, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి 13 సీట్లను గెల్చుకునే అవకాశం ఉందని వెల్లడించింది. పశ్చిమబెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ 31 సీట్లను గెల్చుకుంటుందని పేర్కొన్న ఈ సర్వే బీజేపీ కూడా తన బలాన్ని 11 సీట్లకు పెంచుకునే అవకాశం ఉందని వెల్లడించింది. తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి 5 సీట్లు వచ్చే అవకాశం ఉందని, మిగతా అన్ని స్థానాల్లోనూ డీఎంకే, కాంగ్రెస్ దూసుకుపోయే అవకాశం ఉందని తెలిపింది. కర్నాటక విషయానికొస్తే బీజేపీకి 15, కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి 13 లోక్‌సభ స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. కేరళలో తొలిసారిగా బీజేపీ ఒక ఎంపీ సీటును గెల్చుకునే అవకాశం ఉందని వెల్లడించింది. గుజరాత్‌లో 24, మధ్యప్రదేశ్‌లో 22, రాజస్తాన్‌లో 20, ఢిల్లీలో 7, చత్తీస్‌గఢ్‌లో 6 లోక్‌సభ సీట్లను బీజేపీ గెల్చుకోవచ్చునని వెల్లడించింది.