జాతీయ వార్తలు

‘చిన్న’చూపు చూస్తే చింతిస్తారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మార్చి 18: కొద్దిరోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారం చేపట్టబోయే పార్టీ విషయంలో నిర్ణయాత్మక పాత్ర పోషించే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీల మధ్య జరుగుతున్న పోటీలో తమ అస్థిత్వాన్ని నిలబెట్టుకోవడానికి కొన్ని చిన్నపార్టీలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. ఈ మూడు పార్టీల్లో ఏదో ఒక పార్టీతో పొత్తుపెట్టుకోవాలని కొన్ని ప్రయత్నిస్తుండగా, స్వతంత్రంగానే పోటీ చేస్తామని మరికొన్ని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. మూడు పార్టీలు తమ మద్దతు లేకుండా విజయాన్ని సాధించే పరిస్థితి లేదని, అవి తమ సహాయం తీసుకుని గెలావాల్సిందేనని ఇవి అతివిశ్వాసాన్ని సైతం వ్యక్తం చేస్తున్నాయి. దేశంలోనే అత్యధికంగా యూపీలో 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ అధిక సీట్లు గెల్చుకున్నవారే కేంద్రంలో అధికారం చేపట్టే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
యూపీలో బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు ఎస్పీ- బీఎస్పీ-ఆర్‌ఎల్‌డి కూటమి ప్రధానంగా పోటీ పడుతుండగా, నిషాద్, అప్నాదళ్ (ఎస్), సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ), పీస్ పార్టీ లాంటివి సైతం రంగంలో ఉన్నాయి. ఇవి ప్రధాన పార్టీలు ముగ్గురితో పొత్తుపెట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. ముక్కోణపు పోటీలో సొంతంగా బరిలోకి దిగి గెలవడం అంత సులభం కాకపోవచ్చునని భావిస్తున్న ఈ పార్టీలు ఆ ఆలోచనను వదిలి ఎన్నికల బరిలో ఉండటానికి కొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. తమ పార్టీలకున్న సంప్రదాయ ఓట్లను కాపాడుకుంటూ పెద్ద పార్టీలతో పొత్తుకు తహతహలాడుతున్నాయి. నిర్బల్ ఇండియన్ శోషిత్ హమారా ఆమ్ దల్ (నిషాద్) పార్టీ అధ్యక్షుడైన సంజయ్ నిషాద్ మాట్లాడుతూ తమ పార్టీ ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్‌డీ కూటమితో పొత్తు పెట్టుకుంటుందని, రాష్ట్రంలో తమకు రెండు సీట్లను కేటాయిస్తామని సమాజ్‌వాద్ పార్టీ హామీ ఇచ్చిందని తెలిపారు. ఒక సీటులో సమాజ్‌వాద్ పార్టీ గుర్తుపై తమ పార్టీ అభ్యర్థి, మరో సీటులో తమ గుర్తుపై ఎస్పీ అభ్యర్థి పోటీ చేస్తారని చెప్పారు. గోరఖ్‌పూర్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ నిషాద్ బీజేపీని ఓడించారని, మళ్లీ ఆయనే ఆ స్థానంలో పోటీ చేస్తారని ఆయన తెలిపారు. మత్య్సకారుల ఓట్లు తమ పార్టీకి ప్రధానమైన బలమని, తమ కూటమి పార్టీ విజయానికి వీరు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారని చెప్పారు. మరో చిన్న పార్టీ అయిన అప్నాదళ్ (సోనేలాల్)కు పార్టీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి అనుప్రియ పాటిల్ ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేయడానికి ఈ పార్టీ బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. రాష్ట్రంలోని 12-15 సీట్లలో ప్రత్యక్షంగా, 30 సీట్లలో పరోక్షకంగా తమ వర్గ కుర్మి ఓట్లు అభ్యర్థుల విజయాన్ని నిర్ణయిస్తారని ఈ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. తమకు కేటాయించిన సీట్లు రెండే అయినా తమ వర్గం ఓట్లతో తమ మిత్రపక్ష పార్టీలకు చెందిన పలు సీట్లలో ప్రధాన పాత్ర పోషిస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి అరవింద్ శర్మ తెలిపారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ కారణంగానే బీజేపీకి యూపీలోని తూర్పు ప్రాంతంలో గణనీయంగా కుర్మి ఓట్లు పడిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీ మరో మిత్రపక్ష పార్టీ అయిన ఎస్‌బీఎస్‌పీ అధ్యక్షుడు ఓంప్రకాష్ రాజ్‌భర్ సైతం ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఈయన తమ పార్టీతో పొత్తుపెట్టుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ, మహాకూటమి పార్టీలకు ద్వారాలు తెరచి సిద్ధంగా ఉంచారు. దాదాపు 50 లోక్‌సభ నియోజకవర్గాల్లో తమ పార్టీ గెలుపును నిర్ణయించే స్థితిలో ఉందని, ఎవరైతే తమ పార్టీకి ఐదు సీట్లను కేటాయిస్తారో వారితో తాము పొత్తుపెట్టుకుంటామని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరవింద్ రాజ్‌భర్ ప్రకటించారు. నిన్నమొన్నటి వరకు ఎస్పీ-బిఎస్పీ పార్టీలతో కలిసి ఉన్న పీస్ పార్టీ సైతం తన వైఖరిని మార్చుకుని ప్రత్యామ్నాయాలను అనే్వషిస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్‌డిలు తమతో వస్తాయో లేదో అవే నిర్ణయించుకోవాలని, వారు వచ్చినా రాకున్నా తాము పోటీ చేయడం ఖాయమని ఆ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో తాము మొత్తం 50 సీట్లలో పోటీ చేశామని, పొత్తులేమీ లేకపోతే ఇప్పుడు సైతం అదే సంఖ్య సీట్లలో పోటీకి దిగుతామని ఆయన తెలిపారు.
ఓటర్లపై ప్రియాంక ప్రభావం
ఈ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ సైతం కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్తగా ఉండటం ఆ పార్టీకి మేలు చేసే అంశం. ఆ పార్టీ సంప్రదాయ ఓటర్లలో ఆమె రాకతో మరింత ఉత్సాహం వచ్చిందని, కచ్చితంగా ఇది ఆ పార్టీకి ఉపయోగపడుతుందని, అందువల్ల ఈసారి రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఖాయమని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్, రాజకీయ విశే్లషకుడు సంజయ్ కె పాండే పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నపార్టీలకు ఉన్న సంప్రదాయ ఓట్లు చాలా కీలకపాత్ర పోషిస్తాయని, ఈ నేపథ్యంలో అలాంటి పార్టీలను నిర్లక్ష్యం చేసే పెద్దపార్టీలకు మూల్యం తప్పదని అన్నారు. చిన్న పార్టీలయినా వాటి నుంచి పెద్ద ఉపయోగం పొందే అవకాశం వీటికి ఉన్నందున, వాటిని తగిన విధంగా ఉపయోగించుకున్న పార్టీయే ఈ ఎన్నికల్లో అధిక సీట్లను కైవసం చేసుకుంటుందని ఆయన విశే్లషించారు. ఇప్పటికే రాష్ట్రంలోని 35 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు తాము మోహన్ దాల్, అప్నాదళ్ (కృష్ణ పాటిల్ ఫాక్షన్)లతో పొత్తు ఏర్పర్చుకున్నట్టు ప్రకటించగా, ఎస్పీ-బీఎస్పీ-లోక్‌దళ్ కూటమిలో ఎస్పీ 37, బిఎస్పీ 38, అజిత్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌కు మూడు సీట్లను కేటాయించారు. సోనియా గాంధీ పోటీ చేసి రాయ్‌బరీలి, రాహుల్‌గాంధీ పోటీలో ఉండే అమేథీ నియోజకవర్గాల్లో ఈ కూటమి తమ అభ్యర్థులను పోటీలో ఉంచదు.