జాతీయ వార్తలు

చక్రం తిప్పిన షా, గడ్కరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ, మార్చి 19: గోవాలో మనోహర్ పారికర్ మృతితో కొత్త ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీ అధినేత అమిత్ షా, కేంద్రం మంత్రి నితిన్ గడ్కరీ పావులు కదిపి విజయవంతమయ్యారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ప్రయత్నాలను వమ్ముచేస్తూ మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చాకచక్యంగా వ్యవహరించారు. ఆదివారం పారికర్ మృతి చెందగా రాష్ట్రంలో రాజకీయాలు అనేక మలుపులు తిరిగాయి. పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో అమిత్‌షా, గడ్కరీ తమకున్న అనుభవాన్ని ఉపయోగించారు. మొత్తానికి సోమవారం అర్థరాత్రి సమస్యను ఓ కొలిక్కితెచ్చారు. మంగళవారం తెల్లవారు జామున ప్రమోద్ సావంత్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని అమిత్ షా, గడ్కరీలే దగ్గరుండి చక్కబెట్టారు. 2017లోనూ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. బీజేపీకి తగిన మెజారిటీ లేదు. దీంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహాయ సహకారాలతో ఆనాడు ప్రభుత్వం ఏర్పాటైంది. చిన్నా చితక పార్టీలను కూడగట్టి ప్రభుత్వం ఏర్పాటులో గడ్కరీ కీలక పాత్ర పోషించారు. ఈ పరిస్థితి తలెత్తుతుందని బీజేపీ ముందే ఊహించింది. దానికి తగ్గటే పారికర్ చనిపోయాక ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆదివారమే రంగంలోకి దిగిన గడ్కరీ మహారాష్టవ్రాది గోమంతక్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అలాగే గోవా ఫార్వర్డ్ పార్టీ, ఇండిపెండెంట్లను చెక్కుచెదరనీయలేదు. మంత్రులు రోహంత్ ఖౌంటే, గోవింద్ గవాడే మిత్రపక్షాలతో పలుదఫాలుగా చర్చలు జరిపారు. రాష్ట్ర రాజకీయాలను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో కేంద్ర మంత్రి గడ్కరీ తనకున్న అనుభవాన్నంతా ఉపయోగించారు. బీజేపీకి మద్దతు కూడగట్టడానికి శాసన సభ్యులతో అనేక దఫాలు చర్చలు జరిపారు. సోమవారం రాత్రంగా ఆయన బిజీగానే గడిపారు. ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా మాట్లాడారు. అయితే ఏకాభిప్రాయ సాధన కొంత సంక్లిష్టంగానే మారింది. ఎంజీపీ ఎమ్మెల్యే సుదిన్ ధావాలికర్ కీలక పదవి కావాలని పట్టుబట్టారు. మరోపక్క బీజేపీ లెజిస్లేచర్ పార్టీ ప్రమోద్ సావంత్ పేరు ప్రతిపాదించగా జీఎఫ్‌పీ, తదితర ఎమ్మెల్యేలు విశ్వజిత్ రాణేను ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్ చేశారు. ఒక్కక్కరితో విడతల వారీగా చర్చించిన తరువాత సావంత్‌ను ఎంపిక చేశారు. కాగా సభలో తమకు 14 మంది సభ్యులున్నారని, ప్రభుత్వం ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. గవర్నర్ మృదులా సిన్హాను కోరి తమకే మెజారిటీ ఉందని స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం వరకూ పారికర్ అంత్యక్రియలు పూర్తికాలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రంగంలోకి దిగి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలే కాకుండా ఎంజీపీ సభ్యులతో ఓ హోటల్‌లో భేటీ అయ్యారు. చర్చలు ఫలించాయి. అర్థరాత్రి 1.30కి ఓ నిర్ణయానికి వచ్చారు. సావంత్‌ను ఎంపిక చేసిన తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని అప్పటికప్పుడే రాజ్‌భవన్‌కు వెళ్లారు. గడ్కరీ నాయకత్వంలోనే గవర్నర్ మృదులా సిన్హాను కలిశారు. తెల్లవారుజామున 2 గంటలకు సావంత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.