జాతీయ వార్తలు

వ్యవస్థలను నిర్వీర్యం చేసిన కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 20: దేశాన్ని కొన్ని దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలు వ్యవస్థలను నాశనం చేశాయని, పార్లమెంటు, న్యాయవ్యవస్థ, మీడియా, సాయుధ దళాలను కూడా నిర్వీర్యం చేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ఏప్రిల్ 11న దేశవ్యాప్తంగా లోక్‌సభకు తొలివిడత ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రజలు ఎవరికి ఓటు వేయాలో తెలివిగా ఆలోచించి ముందుకు సాగడం వల్ల దేశ దశ, దిశల్లో ఎన్నో మార్పులు రావడానికి ఆస్కారం ఉంటుందని బుధవారం తన బ్లాగ్‌లో మోదీ పేర్కొన్నారు. అవినీతి, ఆశ్రీత పక్షపాతం, బంధుప్రీతి వంటి అనేక రుగ్మలతో విసిగిపోయిన జనం కాంగ్రెస్‌ను దూరంగా ఉంచారని, మెరుగైన పాలన కోసం, మంచి మార్పు కోసం బీజేపీని ఆదరించారని పేర్కొన్నారు. కేంద్రంలో ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగిన బీజేపీ ప్రభుత్వం ఎన్నో సంచలనాత్మక, విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ముందుకు సాగిన విషయాన్ని ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో ఓటు ఎవరికి వేయాలన్న విషయం గురించి మోదీ ‘ఓటు వేయడానికి సిద్ధమవుతున్నారా? గతాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. అధికారంపై దురాశతో ఒకే కుటుంబం దేశాన్ని పాలించడం వల్ల ఎంత నష్టపోయిందో అందరికీ తెలుసు. మళ్లీ ఇపుడు అదే కుటుంబం గతంలో చేసిన తప్పులనే మళ్లీ చేస్తుంది’ అని తన బ్లాగులో పేర్కొన్నారు. ‘మీడియా నుంచి పార్లమెంటు వరకు, సైనికులు, చట్టాలు, కోర్టులతోపాటు పలు వ్యవస్థలు వంశపారంపర్య పాలనలో బలహీనపడ్డాయని ఆయన పేర్కొన్నారు. ‘ప్రతిఒక్కరూ తప్పు చేస్తున్నారని..కానీ తామే నిజాయితీపరులం’ అనే ధోరణి కాంగ్రెస్ సిద్ధాంతమని మోదీ వ్యంగ్యంగా అన్నారు. వంశపారంపర్యంగా కొనసాగుతున్న పార్టీ వల్ల దేశంలోని ఎన్నో వ్యవస్థలు దెబ్బతిన్నాయో తెలిసిందేనని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు ఉభయసభల్లోనూ కాంగ్రెసేతర పార్టీలు అధికారాన్ని చెలాయించినపుడు దేశం ఎంతగానో అభివృద్ధి చెందిందని, కొన్ని దశాబ్దాలపాటు దేశాన్ని ఏలిన వంశపారంపర్య పార్టీతో వ్యవస్థలు నిర్వీర్యం అయిన విషయాన్ని మోదీ ప్రస్తావించారు. దేశాన్ని ఎంతోకాలం పాలించిన ఒకే కుటుంబం మీడియా స్వేచ్ఛను కూడా హరించిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తొలుత అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ప్రజల వాక్‌స్వాతంత్య్రం, భావస్వేచ్ఛను హరించివేసిందని ప్రధాని ధ్వజమెత్తారు. ఇదే సందర్భంలో తమను వేలెత్తిచూపేవారిని ఎన్నోరకాలుగా ఇబ్బందులకు గురిచేసిన విషయాలను ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకం లేకుండా యూపీఏ ప్రభుత్వం వహరించిందని ఆయన పేర్కొన్నారు. యూపీఏ హయాంలోని ఒక మంత్రి ఒకరు భూవివాదం కేసులో అమాయక పౌరులను జైలుకు పంపారని, ఇటీవల కర్నాటకలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో తన భావాలను వ్యక్తీకరించిన పలువురు యువకులను అరెస్టు చేశారని ఇలాంటి ఎన్నో దారుణాలకు పాల్పడుతున్న వారిని ప్రజలు గమనిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. వాస్తవాలను దాచలేరని, దేశాన్ని ఏదో ఉద్ధరిస్తామంటూ అమాయక, పేద ప్రజలను ఇక మభ్యపెట్టలేరని మోదీ వ్యాఖ్యానించారు. దేశంలో ఎమర్జన్సీని ప్రవేశపెట్టిన విషయాన్ని సైతం ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ ఆర్టికల్ 356ను దాదాపు వందసార్లు వినియోగించారని, ఇందిరాగాంధీ హయాంలోనే దాదాపు 50సార్లు ఈ ఆర్టికల్‌ను ఉపయోగించారని అన్నారు. న్యాయవ్యవస్థపై కాంగ్రెస్‌కు ఏమాత్రం నమ్మకం లేదని, కోర్టు తీర్పులను గౌరవించిన దాఖలాలు సైతం లేవన్నారు. కోర్టు తీర్పులు తమకు అనుకూలంగా రాకపోతే న్యాయమూర్తులను అవమానించేవారని అన్నారు. అదేవిధంగా న్యాయమూర్తుల నియామకాల్లో అవకవతవకలకు పాల్పడడం వారికి అలవాటేనని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థను తమ చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు ప్రయత్నించేవారని, తమ మాట వినని న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాలు తీసుకువచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని మోదీ తన బ్లాగులో పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా అప్పటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా వ్యవహారాన్ని మోదీ పేర్కొన్నారు. కాగ్‌తోపాటు ప్రణాళికా సంఘం వంటి వ్యవస్థలను సైతం కాంగ్రెస్ సముచిత రీతిన గౌరవించిన దాఖలాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ప్లానింగ్ కమిషన్‌కు ఎదురైన పరిస్థితులను మోదీ పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ హయాంలో సీబీఐ ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్’గా మారిందని, మళ్లీ ఇపుడు అదే తీరుగా వ్యవహరించేందుకు ఆ పార్టీ ఎన్నికలకు ప్రజల ముందుకు వచ్చిందని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదన్న మోదీ ఐదేళ్ల తమ కాలంలో తీసుకున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోదాహరణంగా పేర్కొన్నారు.