జాతీయ వార్తలు

తెలుగు అసెంబ్లీలకు మరిన్ని సీట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని సవరించటం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల్లో సీట్ల సంఖ్యను పెంచాలని కేంద్ర హోం శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు మంగళవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌నాథ్ సింగ్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వెంకయ్య నాయుడుతో పాటు హోం శాఖ కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, లెజిస్లేచర్ శాఖ కార్యదర్శి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల సంఖ్యను 175 నుండి 225కు, తెలంగాణ సభ్యుల సంఖ్యను 119 నుండి 153కు పెంచాలన్న ప్రతిపాదనను కేంద్ర హోం శాఖ బుధవారం న్యాయ శాఖకు పంపిస్తుంది. దీనిపై న్యాయ శాఖ అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని తీసుకుంటుంది. భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా చూసేందుకు ఈ ప్రక్రియను చేపడుతున్నారు. అటార్నీ జనరల్ అభిప్రాయం తెలిపిన వెంటనే న్యాయ శాఖ రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభ్యుల సంఖ్యను పెంచేందుకు సానుకూలత వ్యక్తం చేస్తూ ఇందుకు సంబంధించిన ఫైలును హోం శాఖకు పంపిస్తుంది. ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో శాసన సభ్యుల సంఖ్యను పెంచేందుకు సవరణ బిల్లును రూపొందించే ప్రక్రియ ప్రారంభమవుతుందని వెంకయ్య నాయుడు తెలిపారు. పార్లమెంట్‌లో జరిగే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రతిపాదిస్తారు. బడ్జెట్ సమావేశాల్లో ఇది సాధ్యం కాకపోతే ఆ తర్వాత జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు తప్పకుండా వస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అధికారులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ్యుల సంఖ్యను పెంచే అంశంపై భిన్నాభిప్రాయాలున్నాయి. రెండు రాష్ట్రాల్లో శాసనసభ్యుల సంఖ్యను పెంచాలని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని 25 సెక్షన్ ప్రతిపాదించింది. అయితే రాజ్యాంగంలోని 170 అధికరణ ప్రకారం 2026 సంవత్సరం వరకు ఈ సంఖ్య పెంచేందుకు వీల్లేదు. అలాగైతే రెండు రాష్ట్రాల్లో శాసనసభ్యుల సంఖ్య పెంచాల్సిందిగా ఏపి విభజన చట్టంలోని 21వ సెక్షన్‌లో ఎందుకు ప్రతిపాదించారని వెంకయ్య నాయుడు ప్రశ్నించారు. రాజ్యాంగంలోని 170 అధికరణ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ్యుల సంఖ్య పెంచేందుకు వీల్లేదనే వాదన సరైంది కాదని, అందుకే ఏపి విభజన చట్టంలోని 21వ సెక్షన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభల్లో సీట్ల సంఖ్య పెంచాలని కేంద్రం నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. రాజ్‌నాథ్ సింగ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సంబంధిత శాఖల కార్యదర్శులందరితో కూలంకషంగా సమీక్ష జరిపిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఏపి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇదివరకే తమ రాష్ట్రాల శాసన సభల్లో సీట్ల సంఖ్యను పెంచాలని కోరారని, ఈ అంశంతో తనకు సంబంధం లేకపోయినప్పటికీ సీనియర్ నాయకుడిగా ఈ బాధ్యత తీసుకున్నానని ఆయన తెలిపారు. విభజన చట్టంలోని 371(డి) సెక్షన్‌ను అమలు చేయాలని చంద్రబాబు కోరుతున్నారు కదా? అని ఒక విలేఖరి ప్రశ్నించగా, నేటి సమావేశంలో కేవలం శాసన సభల్లో సీట్ల సంఖ్య పెంపు గురించే చర్చించామని ఆయన స్పష్టం చేశారు. శాసనసభల్లో సీట్ల సంఖ్య పెంపు పూర్తయిన తర్వాత రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణను పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపారు.
రాష్ట్ర హైకోర్టు విభజనను ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నారనే ఆరోపణలు వస్తన్నాయని ఒక విలేఖరి ప్రస్తావించగా, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎవరు ఏమైనా చెప్పుకోవచ్చని, ఇక్కడ స్వేచ్ఛ ఉందే తప్ప ఎమర్జెన్సీ లేదని అన్నారు. సాధ్యమైనంత త్వరగా హైకోర్టు విభజనను కూడా పూర్తిచేయాలని కేంద్రం భావిస్తోందని, ఇందుకు సంబంధించిన పాలనాపరమైన సమస్యలను న్యాయ శాఖ పరిశీలిస్తోదని వెంకయ్య నాయుడు చెప్పారు.

చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపునకు సంబంధించిన అంశంపై చర్చించేందుకు హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైన వెంకయ్య నాయుడు