జాతీయ వార్తలు

సైనికుల త్యాగాలఫై రాజకీయాలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, మార్చి 23: భారత సాయుధ దళాల త్యాగాలను తామెప్పుడూ ప్రశ్నించబోమని, అదే సమయంలో ఆర్మీ దాడులను తమ స్వప్రయోజనాలకు వాడుకోవడం తగదని సమాజవాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సూచించారు. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గత నెలలో పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ జరిపిన దాడుల్లో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు అసువులు బాశారు. ఈ దాడులను తీవ్రంగా పరిగణించిన భారత్ ఆ దేశ భూభాగంలోని బాలాకోట్‌లో ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడులను బీజేపీ తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడాన్ని ప్రస్తావించిన అఖిలేష్ యాదవ్ ప్రజాస్వామ్యంలో ఏ అంశంలోనైనా రాజకీయ నాయకులను ప్రశ్నించే ప్రాథమిక హక్కు ఉంటుందన్న విషయాన్ని గమనించాలని అన్నారు. ‘తమను ఎవరూ ప్రశ్నించవద్దన్న రాజకీయ నాయకులు ప్రమాదకరమైన వ్యక్తులు’ అని సమాజవాది పార్టీ చీఫ్ పేర్కొన్నారు. పుల్వామాలో ఉగ్ర దాడుల తర్వాత ఈ అంశాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని సమాజవాది పార్టీకి చెందిన తన సహచరుడు రామ్ గోపాల్ యాదవ్ ప్రధాని మోదీపై తీవ్రంగా విరుచుకుపడిన నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ సైతం తనదైన రీతిలో ట్విట్టర్ ద్వారా విమర్శల దాడికి దిగారు.
ఇదిలావుండగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాన సలహాదారు శామ్ పిట్రోడా పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లో భారత వైమానిక దాడుల్లో ఎంతమంది టెర్రరిస్టులు హతమయ్యారో అన్న అంశంపై సమగ్ర వివరణ కావాలని ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నించిన విషయం తెలిసిందే. అదేవిధంగా తాను భారత వైమానిక దళాల దాడులను వేలెత్తి చూపడం లేదని అంటూ వైమానిక దాడుల్లో శత్రుదేశానికి ఎంతమేరకు నష్టం వాటిల్లిందో దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరాన్ని శాం పిట్రోడా ప్రశ్నించారు. ఈ ఆరోపణలపై ప్రధాని మోదీ సైతం తీవ్రంగా స్పందిస్తూ జవాన్ల త్యాగాలను విమర్శించడం ప్రతిపక్షాలకు అలవాటేనని దుయ్యబట్టారు. మోదీ నుంచి ఈ రకమైన ప్రకటన వచ్చిన గంట సమయంలోనే సమాజవాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ ‘మన సైనికుల త్యాగాలను ప్రశ్నించడంలేదు. అదే సమయంలో ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని తెలుసుకుంటే మంచిది’ అని మరో ట్వీట్ ద్వారా చురకలంటించారు. సాయుధ దళాల త్యాగాలను తమ స్వార్థ రాజకీయాలకు వాడుకోవద్దని తాము చెబుతున్నామని ఆయన అన్నారు. ఇదిలావుండగా, సమాజావాది పార్టీ నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ తమ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా ఖండించారు. రామ్ గోపాల్ యాదవ్ విమర్శలు ‘పనికిమాలిన రాజకీయ వ్యాఖ్యలకు మచ్చుతునక’గా అభివర్ణించారు. రామ్‌గోపాల్ యాదవ్ వ్యాఖ్యలు సాయుధ దళాల త్యాగాలను, వారి ధైర్యం, సాహసోపేత చర్యలను బలహీనపరచడమేనని అన్నారు. ఈ విషయంలో సమాజవాది పార్టీ నాయకుడు రామ్‌గోపాల్ యాదవ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.