జాతీయ వార్తలు

పొత్తుల ఎత్తులు ఫలిస్తాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంతాలకు అతీతంగా ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా పొత్తులు కుదరడం అన్నది దశాబ్దాలుగా వస్తున్నదే. బలహీనంగా ఉన్న పార్టీ ఆయా రాష్ట్రాల్లో లేదా నియోజకవర్గాల్లో బలంగా ఉన్న దానితో ఎన్నికల దోస్తీ కుదుర్చుకుంటే నెగ్గుకొస్తామన్న నమ్మకమే ఈ పొత్తుల కుంపట్లలో సెగ రేపింది. అందుకే 90వ దశకం నుంచి నేటివరకూ దాదాపు అన్ని ఎన్నికల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ బరిలో ఉన్న పార్టీలు సిద్ధాంతాలను పక్కనబెట్టి ఇతర పార్టీలతో సయోధ్య కుదుర్చుకోవడం అన్నది జరుగుతూ వచ్చింది. అసలు ఈ పొత్తులు ఏ కారణంగాతెరపైకి వచ్చాయి? తమ సిద్ధాంతాలను పణంగా పెట్టి మరీ ఆయా పార్టీలు ఎందుకు చేతులు కలుపుతున్నాయి? అన్నది కీలకమైన అంశమే. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దశాబ్దాలపాటు ఇటు కేంద్రంలోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. జాతీయ పార్టీగా బీజేపీ ఉన్నప్పటికీ 90వ దశకం వరకు అది జాతీయ స్థాయిలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ తన ఉనికిని గట్టిగా చాటుకున్న దాఖలాలే లేవు. అద్వానీ రథయాత్రతో బీజేపీ దశ తిరిగింది. కాంగ్రెస్ అదృష్ట రేఖలూ మారిపోయాయి. 80వ దశకంలో బలోపేతమైన ప్రాంతీయ పార్టీల సంస్కృతి 90వ దశకంలో మరింతగా వేళ్లూనుంది. నేటికీ అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలో కొనసాగుతూ జాతీయ పార్టీలకు సవాలు విసురుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, బీజేపీ వంటి కేంద్రంలో అధికారం చెలాయించిన పార్టీలు ఇటు యూపీఏగా, అటు ఏన్డీయేగా అవతరించక తప్పలేదు. సొంతంగా నెగ్గలేనప్పుడు బలమైన వారి భుజం మీద చేయివేసి అంతో ఇంతో ముందుకు నడవ వచ్చునన్నది ఈ పొత్తుల సారాంశం. అయితే 2014 లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య రీతిలో బీజేపీ సొంత బలంతోనే అధికారంలోకి వచ్చింది. అంతకుముందు కొన్ని దశాబ్దాలపాటు ఒకే పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం అన్నది లేనే లేదు. మరి తాజాగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒకే పార్టీ లేదా కూటమి అధికారంలోకి వస్తుందా? అసలు ఎన్నికల పొత్తులు ఎంతమేరకు ఆయా పార్టీల నేతల అధికార కలలను పండిస్తాయి అన్నది కచ్చితంగా చెప్పలేని పరిస్థితే. ఎందుకంటే భారత రాజకీయాలను లోతుగా పరిశీలిస్తే, పొత్తుల వల్ల లాభపడ్డ పార్టీల కంటే నష్టపోయిన పార్టీల సంఖ్యే ఎక్కువ. ఎన్నికలకు ముందు ఈ పొత్తుల ఉత్సాహం వేరు.. తీరా చేతులు కాలిన తర్వాత చింతించడం వేరు. ఎందుకు పొత్తు పెట్టుకున్నామా అని ఓడిపోయిన పార్టీలు చింతించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీ సొంతబలం కంటే కూడా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పొత్తులకే పెద్దపీట వేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు ఎన్ని సీట్లిస్తే వాటితో సర్దుకుపోయే రాజీ ఎన్నికల వ్యూహాన్ని అనుసరిస్తోంది. పార్టీల మధ్య పొత్తు కుదిరినప్పటికీ అట్టడుగు స్థాయి కార్యకర్తలు అంతకుముందు వరకు తమ మధ్య కొనసాగిన విభేదాలను మరచిపోయి కలసికట్టుగా పనిచేయగలుగుతారా? ఏళ్ల తరబడి నువ్వా నేనా అనుకున్న పరిస్థితిని పక్కనబెట్టి ఎన్నికల్లో విజయమే ధ్యేయంగా సయోధ్య కుదుర్చుకున్న పార్టీల అభ్యర్థుల విజయం కోసం పనిచేయ గలుగుతారా అన్నది కూడా ప్రశ్నార్థకమే. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాజకీయాలే ఇందుకు నిదర్శనం. అక్కడ ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్నా ప్రాంతీయంగా బలంగా ఉన్నవి సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌వాది పార్టీలే. ఈ రెండింటిమధ్య పొత్తు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ దూకుడుకు ఏ మేరకు కళ్లెం వేయగలుగుతుంది? అన్నదీ ప్రశ్నార్థకమే. ప్రత్యర్థులు స్నేహితులు కావడం, అవకాశ రాజకీయాలే పునాదిగా ఎన్నికల్లో జత కట్టడం, అవసరాన్ని బట్టి రాజీపడడం వంటి దేశ రాజకీయాల్లో రోజువారీగా చూస్తూ ఉన్న పరిణామాలే. ఇంతగా గతాన్ని మరచి చేతులు కలిపిన ఆయా కూటములు ఎంతమేరకు అధికారాన్ని సంతరించుకుంటాయో చెప్పలేని పరిస్థితి. ఒకవేళ పొత్తు పెట్టుకున్నా కొన్ని నియోజకవర్గాల్లో ఆయా పార్టీల ఓట్లు మరో పార్టీకి కచ్చితంగా బదిలీ అవుతాయని చెప్పే పరిస్థితి లేదు. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలే చేతులు కలుపుతున్నాయి. ఇందుకు బిహార్ మరో ఉదాహరణ. మహాఘటబంధన్ పేరుతో 2015లో బిహార్‌లో తెరపైకి వచ్చిన కూటమి ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీల మధ్య బలమైన పొత్తుకు తెరతీసింది. అంటే తమ రాష్ట్రంలోని జాతీయ పార్టీలకు ఏ కోశానా విజయావకాశాలు లేకుండా చేయడమే వీటి ఉద్దేశం. ఈ ప్రాంతీయ పొత్తులు కొంతమేర ఫలించే అవకాశం ఉన్నా లోక్‌సభ ఎన్నికలు అన్నవి దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జరిగేవి కాబట్టి ఆ కోణంలోనే ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో రాష్టస్థ్రాయిలో ప్రాంతీయ పార్టీల మధ్య కుదిరిన పొత్తు ఆయా రాష్ట్రాల్లో జాతీయ పార్టీలను నిలువరించగలుగుతుందా? మళ్లీ 2014 ఫలితాలను సాధిస్తామన్న ధీమాతో ఉన్న బీజేపీ ఈ ప్రాంతీయ పొత్తుల అవరోధాలను ఎంతమేరకు అధిగమించగలుగుతుంది. సొంతంగా బలం తగ్గడంతో ప్రాంతీయ పొత్తులపైనే నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ వీటి ఆలంబనగా అందలానికి ఏ మేరకు చేరువ అవుతుంది అన్నదీ ఆసక్తి కలిగించే అంశమే. పొత్తులు ఫలించాలంటే నేతల మధ్య కుదిరిన సయోధ్య ఆయా పార్టీల కేడర్ మధ్య కూడా ఏర్పడాల్సిన అవసరం ఉంటుంది. లేనిపక్షంలో పొత్తు దారి పొత్తుదే.. ఓటు దారి ఓటుదే అన్న పరిస్థితీ తలెత్తక మానదు. ప్రస్తుత ఎన్నికల్లో పొత్తులే కీలకమవుతాయా లేక 2014 మాదిరిగా ప్రజలు తీర్పును ఇవ్వబోతున్నారా అన్నది వేచిచూడాల్సిందే.
యూపీలో పొత్తు పెట్టుకున్న ఎస్పీ, బీఎస్పీ నేతలు మాయావతి, అఖిలేష్ (పాతచిత్రం)