జాతీయ వార్తలు

80 శాతం మందికి డిపాజిట్లు గల్లంతు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాట్నా, మార్చి 25: గత లోక్‌సభ ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలో వివిధ పార్టీల తరఫున, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన అభ్యర్థుల్లో 80 శాతానికి పైగా డిపాజిట్లు కోల్పోయారని ఎన్నికల కమిషన్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని 40 సీట్లకు తొలుత 709 మంది నామినేషన్లు వేయగా, ఉపసంహరణ తర్వాత 607 మంది రంగంలో నిలిచారు. వీరిలో 512 మంది ఎన్నికల్లో డిపాజిట్లను సైతం దక్కించుకోలేకపోయారు. ముజఫర్‌పూర్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 27 మంది అభ్యర్థులు డిపాజిట్లను కోల్పోయారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి అజయ్ సాహ్ని విజయం సాధించగా, రెండో స్థానంలో కాంగ్రెస్‌కు చెందిన అఖిలేష్ ప్రసాద్ నిలిచారు. అలాగే ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉండే కిషన్ గంజ్‌లో అతి తక్కువగా కేవలం కేవలం తొమ్మిది మందికి మాత్రమే ధరావతులు గల్లంతయ్యాయి. ఈ స్థానంలో కాంగ్రెస్‌కు చెందిన అసరుల్ హక్ విజయం సాధించగా, రెండో స్థానంలో బీజేపీకి చెందిన దిలీప్‌కుమార్ జైస్వాల్ నిలిచారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో 25 స్థానాల్లో కేవలం విజేతలు, రెండో స్థానంలో నిలిచిన వారు మాత్రమే డిపాజిట్లు దక్కించుకోవడం విశేషం. ఇక పార్టీపరంగా చూస్తే ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ నేతృత్వంలో ఉన్న జేడీ (యూ) పార్టీ 38 స్థానాల్లో పోటీ చేయగా, 23 స్థానాల్లో డిపాజిట్లను కోల్పోయింది. అలాగే ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించిన మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ గత ఎన్నికల్లో 38 సీట్లలో కనీసం డిపాజిట్లను కూడా దక్కించుకోలేకపోయింది.