జాతీయ వార్తలు

అర్బన్ మావోలకు కాంగ్రెస్ ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదల్‌పూర్: అర్బన్ మావోయిస్టులను కాంగ్రెస్ వెనుక ఉండి ప్రోత్సహిస్తూ ఆదివాసీల జీవితాలను నాశనం చేస్తోందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. చత్తీస్‌గఢ్‌లో జరిగే ఎన్నికలను పురస్కరించుకుని శుక్రవారం ఆయన రాష్ట్రంలో మొదటిసారిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీలను కాంగ్రెస్ ఎందుకు ఎగతాళి చేస్తోందో అర్థం కావడం లేదని అన్నారు. ఈశాన్య ప్రాంతంలో ఆదివాసీలు చేపట్టిన ఒక కార్యక్రమంలో తాను ఆదివాసీల సంప్రదాయ కిరీటాన్ని ధరించానని, దానిని కాంగ్రెస్ నేతలు ఎగతాళి చేశారని విమర్శించారు. ఇది ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను కించబర్చడమేనని ఆయన అన్నారు. చత్తీస్‌గఢ్‌ను సంపన్న రాష్ట్రంగా మార్చాలన్న దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆశయం నెరవేరే వరకు తాను విశ్రమించనని మోదీ పేర్కొన్నారు. నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉండే బస్తర్ ప్రాంతంలో అభివృద్ధిని కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని ఆయన ఆరోపించారు. పైగా ఇక్కడ మావోయిస్టుల కార్యకలాపాలను ఆ పార్టీ ప్రోత్సహించిందని అన్నారు. నగరాల్లోని ఏసీ రూముల్లో అర్బన్ మావోయిస్టులు ఉంటున్నారని, వారి పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారని, వారు అక్కడ కూర్చుని ఇక్కడ నివసిస్తున్న ఆదివాసీల పిల్లలను నియంత్రిస్తున్నారని ఆరోపించారు. ఒక పక్క తాము మావోయిస్టులను అణచివేయడానికి ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ అర్బన్ మావోలను ఎందుకు ప్రోత్సహిస్తోందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ వారికే కనుక దమ్ముంటే బస్తర్ వచ్చి నక్సల్స్‌కు వ్యతిరేకంగా మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మావోలను ‘పిశాచి ఆలోచనలున్న రాక్షసులు’గా పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు బస్తర్ లాంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. అలాంటి వారిని ప్రజలు క్షమిస్తారా? వారు ఇక్కడ విజయం సాధిస్తారా? అని ఆయన ప్రశ్నించారు. బస్తర్ ప్రాంతంలోని సీట్లన్నీ బీజేపీ గెలుచుకుంటుందని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. తాము కాక వేరెవరు విజయం సాధించినా బస్తర్ వాసుల కలలు కల్ల చేసినట్టేనని వ్యాఖ్యానించారు. తాను చేసిన విధంగా ఇంతవరకు ఏ ప్రధాని బస్తర్ ప్రాంతాన్ని ఇన్నిసార్లు సందర్శించలేదని ఆయన అన్నారు. తాను ఎప్పుడూ రిక్తహస్తాలతో ఇక్కడకు రాలేదని, ప్రజలకు ఉపయోగపడే ఎన్నో పథకాలను తన వెంట తెచ్చానని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్రంలోని పేదరికాన్ని, నిరుద్యోగాన్ని, ఆకలి బాధలను తప్పించడానికి తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని ఆయన అన్నారు. ఇక్కడ వనరులున్నా అభివృద్ధి మాత్రం శూన్యమని అన్నారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడి 18 సంవత్సరాలైందని, అభివృద్ధిపై ఎన్నో ఆశలు, ఆశయాలు, కలలు ఈ రాష్ట్రానికి ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ దళితులు, గిరిజనులు, వెనుకబడిన వారి కోసం నిత్యం జపం చేస్తుందే తప్ప వారి అభివృద్ధికి ఇంతవరకు చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. ఇంతవరకు వారిని కనీసం మనుషులుగా కూడా గుర్తించకుండా ఆ పార్టీ కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటోందని అన్నారు. అభివృద్ధిని నిత్యం అడ్డుకుంటున్న పార్టీ కావాలా? అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న పార్టీ కావాలా అని ఆయన ఈ సందర్భంగా ఓటర్లను ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు చేసిన విధంగా తాము ప్రజలపై ఎలాంటి వివక్షను ప్రదర్శించమని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం పాటుపడుతోందని మోదీ చెప్పారు. కాగా 90 స్థానాలున్న చత్తీస్‌గఢ్ ఎన్నికలు ఈనెల 12, 20 తేదీలలో నిర్వహించనున్నారు.