జాతీయ వార్తలు

ధనికుల జేబులే నిండాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలోడ బజార్, మహాసముంద్, నవంబర్ 13: కాకులను కొట్టి గద్దలకు వేసిన చందంగా మన ప్రధాని నరేంద్ర మోదీ నోట్ల రద్దు పేరుతో పేదల జేబుల నుంచి కొట్టేసిన డబ్బును నీరవ్‌మోదీ, విజయ్‌మాల్యా లాంటి పెద్ద పారిశ్రామికవేత్తల చేతుల్లో పోసారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ విమర్శించారు.
మంగళవారం చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. పేదలను ఎన్నో బాధలు పెట్టిన నోట్ల రద్దు వ్యవహారం పెద్ద పారిశ్రామికవేత్తలకు మాత్రం చాలా మేలు చేసిందని ఆయన విమర్శించారు. భారత్‌లోని బడా దొంగలు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి మోదీ సహాయపడ్డారని ఘాటుగా విమర్శించారు. నోట్ల రద్దు సమయంలో సూటూ బూటూ వేసుకున్న గొప్పవారెవరైనా డబ్బు కోసం క్యూలైన్లలో నిల్చోవడం మీరు చూశారా అని ఆయన ప్రజల్ని ప్రశ్నించారు. అలాగే రాఫెల్ డీల్ పేరుతో 30 వేల కోట్ల ప్రజాధనాన్ని అనీల్ అంబానీకి ధారపోసారని ఆయన విమర్శించారు. దేశ అభివృద్ధి విషయంలో ప్రధాని మోదీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. దేశంలో జరిగిన అభివృద్ధి అంతా తాను ప్రధాని అయిన తర్వాతే జరిగిందని చెప్పుకుంటున్నారని అన్నారు. ‘దేశం ప్రజల చేతుల్లో నడుస్తుందని, ఒక వ్యక్తి చేతుల్లో ఎప్పుడూ నడవదన్న కనీస విషయం కూడా ఆయనకు (మోదీకి) తెలియదా? తనవల్లే దేశం అభివృద్ధి చెందిందని చెప్పుకుంటున్న మోడీ మిమ్నల్ని అవమానిస్తున్నారు’ అని అని రాహుల్ పేర్కొన్నారు. మోదీ ప్రవేశపెట్టిన నోట్ల రద్దు, జీఎస్టీ పన్ను విధానం వల్ల చిన్న, మధ్య తరగతి వ్యాపారుల వెన్నువిరిగిందని అన్నారు. తాము కనుక అధికారంలోకి వస్తే యువత వ్యాపారాలు చేసుకోవడానికి బ్యాంకుల నుంచి రుణం ఇచ్చి వారిని ప్రోత్సహిస్తామని ఆయన హామీనిచ్చారు. బడా పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, అయితే వారికి తగిన ప్రోత్సాహం అందిస్తూ చిన్న, మధ్య తరగతి వ్యాపారులను నిర్లక్ష్యం చేయరాదని అన్నారు. ప్రజలకు చెందిన వేల కోట్ల సొమ్ముతో నీరవ్ మోదీ, మెహల్ ఛోక్సీ, విజయ్‌మాల్యా విదేశాలకు పరారయ్యారని ఆయన విమర్శించారు. అయితే వారిని వెనక్కి రప్పించడానికి, వారి నుంచి ఆ సొమ్ము రాబట్టడానికి మోదీ ప్రభుత్వం వీసమెత్తు చర్య అయినా తీసుకోలేదని రాహుల్ విమర్శించారు.
రాఫెల్ కుంభకోణంపై దర్యాప్తును ఆపుచేయడానికే మోదీ ప్రభుత్వం అర్థరాత్రి ఒంటిగంటకు సీబీఐ డైరెక్టర్‌ని హఠాత్తుగా తొలగించిందని, రాఫెల్ డీల్‌పై కనుక దర్యాప్తు జరిపితే రెండు పేర్లు మాత్రమే బయటకు వస్తాయని, వారు ఒకరు నరేంద్ర మోదీ అయితే రెండో వారు అనీల్ అంబానీ అని ఆయన విమర్శించారు. దీనిపై దర్యాప్తు అంటేనే మోదీ వణికిపోతున్నారని అన్నారు. ఎయిర్ క్రాఫ్ట్‌ల తయారీలో 70 సంవత్సరాల విశేష అనుభవం ఉన్న హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)ను కాదని మోదీ ఎలాంటి అనుభవం లేని అనిల్ అంబానీ కంపెనీకి రాఫెల్ కాంట్రాక్టును అప్పగించడం వెనుక వేలకోట్ల కుంభకోణం దాగి ఉందని ఆయన పేర్కొన్నారు. అనిల్ అంబానీ కంపెనీకి విమానాల తయారీ మాట దేవుడెరుగు కనీసం పేపర్ విమానం కూడా తయారు చేసిన అనుభవం లేదని ఆయన విమర్శించారు.

అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌దే విజయం
సోమవారం ఛత్తీస్‌గఢ్‌లో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా పోలింగ్ జరిగిందని రాహుల్‌గాంధీ చెప్పారు. ఇక్కడ తాము విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు జరిగే చత్తీస్‌గఢ్‌తో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో సైతం కాంగ్రెస్ గెలుపు సాధిస్తుందని ఆయన చెప్పారు.
చత్తీస్‌గఢ్‌లో అస్తవ్యస్త పాలన జరిపిన బీజేపీ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని, త్వరలో ఇక్కడ అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ ప్రజాపాలనను అందిస్తుందని ఆయన హామీనిచ్చారు. ఒక పక్క మన్‌కి బాత్ అంటూ కొద్దిమంది పారిశ్రామికవేత్తల ప్రయోజనాలకు మాత్రమే పాటుపడుతున్న బీజేపీ కంటే వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కాంగ్రెస్‌నే ప్రజలు ఎన్నుకుని ఓటు వేయాలని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు.
చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే రైతుల రుణాలను పది రోజుల్లో మాఫీ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ హామీనిచ్చారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆయన అన్నారు.