జాతీయ వార్తలు

దీక్షలు.. బుజ్జగింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 15: తెలంగాణ శాసనసభకు పోటీచేసే మరో 12 మంది అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధినాయకత్వం సిద్ధం చేసింది. అధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి, తెలంగాణ ఇన్‌చార్జ్ కుంతియాతోపాటు మిగతా ముగ్గురు కార్యదర్శులతో సమావేశమై మిగతా 19 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక గురించి సమాలోచనలు జరిపారు. రెండున్నర గంటలపాటు చర్చలు జరిపిన అనంతరం మూడో జాబితా కింద 12 మంది పేర్లు ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అయితే ఈ జాబితాను ఎప్పుడు విడుదల చేస్తారనేది స్పష్టం కావటం లేదు. పలువురు ఆశావహులు ఢిల్లీలో నిరాహారదీక్షలకు దిగటంతో వీరిని బుజ్జగించిన అనంతరం మూడో జాబితాను విడుదల చేస్తే బాగుంటుందని అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ ఇంతవరకు 75 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. మిగతా 19 సీట్ల నుండి ఇప్పుడు 12 పేర్లు ప్రకటించాలనుకుంటున్నారు. మిగతా ఏడు నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ఆ తరువాత ప్రకటిస్తారని అంటున్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొత్తవారిని పోటీ చేయిస్తున్నట్లు తెలిసింది. సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ బీసీ విభాగం అధ్యక్షుడు చిత్తరంజన్‌దాస్, హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డికి మొండి చెయ్యి చూపించినట్లేనని అంటున్నారు. మర్రి శశిధర్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యను బుజ్జగించే బాధ్యతను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీసుకున్నట్లు తెలిసింది. ఆయన గురువారం రాత్రి లేదా శుక్రవారం పొన్నాల, మర్రితో చర్చలు జరుపుతారని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. రాహుల్ గాంధీని కలిసేందుకు రావాలని ఇరువురు సీనియర్ నాయకులకు పిలుపు వెళ్లిందని ఆ వర్గాలు చెబుతున్నాయి.

రాహుల్ నివాసం వద్ద ధర్నాలు
సికింద్రాబాద్, యాకుత్‌పురా శాసనసభ నియోజకవర్గాల టికెట్ల కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసం వద్ద ధర్నాకు దిగిన హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, సీనియర్ నాయకుడు కీర్తి రాజేందర్ రాజును పోలీసులు అరెస్టు చేశారు. తమకెందుకు టికెట్లు ఇవ్వలేదంటూ ధర్నాకు దిగిన కార్తీకరెడ్డి, రాజేందర్‌రాజు ప్రశ్నిస్తున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం టికెట్‌ను బయటివారికి ఇస్తున్నాం.. మీరు సహకరించాలంటూ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ కుంతియా తనకు ఫోన్ చేసి చెప్పారని బండ కార్తీకరెడ్డి విలేఖరులకు తెలిపారు. పార్టీకోసం పనిచేస్తున్న వారిని పక్కనబెట్టి బయటివారికి టికెట్ ఎలా ఇస్తారని ఆమె ఆవేశంతో ప్రశ్నించారు. పారాచూట్ వేసుకుని వచ్చేవారికి టికెట్లు లభించవని ప్రకటించిన కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పుడు సికింద్రాబాద్ టికెట్‌ను బయటినుండి వచ్చిన కొత్త వారికి ఎలా ఇస్తున్నారని ఆమె నిలదీశారు. సికింద్రాబాద్ టికెట్ కోసం తాను ఎప్పటినుంచో కృషి చేస్తున్నాను.. పార్టీకోసం అహర్నిశలు పని చేస్తున్నాను.. అధినాయకత్వం ఇప్పుడు కొత్తవారికి టికెట్ ఇవ్వాలని నిర్ణయించటం అన్యాయమని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన కొందరు నాయకులు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. న్యాయం చేసేంతవరకు పోలీస్ స్టేషన్‌లోనైనా ధర్నా కొనసాగిస్తానని ఆమె చెప్పారు. యాకుత్‌పురాలో కాంగ్రెస్‌ను పటిష్టం చేసేందుకు కృషిచేస్తున్న తనను పక్కన పెట్టి బయటివారికి టికెట్ ఎలా ఇస్తారని రాజు నిలదీశారు.
ఇలావుండగా తనకు కొల్హాపూర్ టికెట్ ఇవ్వాలంటూ తెలంగాణ భవన్‌లో నిరాహారదీక్షకు దిగిన టీపీసీసీ వెనుకబడిన కులాల విభాగం అధ్యక్షుడు చిత్తరంజన్‌దాస్, సీనియర్ నాయకుడు శ్రీనివాస్‌గౌడ్, రాములును కుంతియా బుజ్జగించి దీక్ష విరమింపజేశారు. కుంతియా తెలంగాణ భవన్‌కు వచ్చి ముగ్గురు నాయకులకు నచ్చజెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సముచిత న్యాయం చేస్తామని కుంతియా వారికి హామీ ఇచ్చారు. అధినాయకత్వం తరపున కుంతియా ఇచ్చిన హామీతో సంతృప్తి చెందిన చిత్తరంజన్‌దాస్, శ్రీనివాస్ గౌడ్, రాములు దీక్షను విరమించుకున్నారు.