జాతీయ వార్తలు

మిజోరంలో ప్రచార హోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికలభూమి
==========
ఐజ్వాల్, నవంబర్ 15: మిజోరంలో ఎన్నికల ప్రచారం తారస్థాయి చేరుకుంది. 40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీకి ఈనెల 28 ఎన్నికలు జరుగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్క మిజోరంలోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈసారి అధికారం నిలబెట్టుకునేందుకు కసరత్తు చేస్తోంది. క్రైస్తవుల ఎక్కువగా ఉండే మిజోరంలో ప్రధాన పార్టీలు రెండూ హోరాహోరీ ప్రచారం చేస్తున్నాయి. మిజోరం పీసీసీ(ఎంపీసీసీ) అధ్యక్షుడు లాల్హ్‌రౌత్‌లుంగా కనీ బహిరంగ సభలు, ఇంటింటికీ ప్రచారంలో నిమగ్నమయ్యారు. గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఓటర్లను ఆకట్టుకుంటున్నారు.
2013, 2008 ఎన్నికల్లో ఎన్నికల పొత్తుపెట్టుకున్న అభ్యర్థులందరూ ఒకే వేదికపై నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చర్చి మద్దతుతో పనిచేసే ‘వాచ్‌డాగ్’ మిజోరం పీపుల్స్ ఫోరం(ఎంపీఎఫ్) ఆధ్వర్యంలో ప్రచారం నడుస్తోంది. అభ్యర్థుల ప్రచారానికి ఎంపీఎఫ్ మార్గనిర్దేశన చేస్తోంది. అయితే ఈసారి భాగస్వామ్య పక్షాలన్నీ ఒకే వేదికపై ప్రచారం చేయాలన్న నిబంధనను ఎంపీఎఫ్ సడలించింది. అన్ని రాజకీయ పక్షాలతో సంప్రదించిన తరువాత అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసుకునే అవకాశం కల్పించినట్టు ఎంపీఎఫ్ నేత ఒకరు తెలిపారు. అయితే ఎవరికి వారు విడిగా కాకుండా స్థానిక ఎంపీఎఫ్ ప్రతినిధిని వెంటబెట్టుకుని ఇంటింటి ప్రచారం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడా డబ్బు పంపిణీ జరగడానికి వీల్లేదని ఆయన తెలిపారు. అభ్యర్థులతోపాటు ఎంపీఎఫ్ నేతలు ప్రచారంలో పాల్గొనడం,సభల్లో ప్రసంగించడం జరుగుతుంది. ఎన్నికల పరిశీలకులు, నిఘా బృందాలు రంగంలోకి దిగాయి. వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు.
పార్టీ జెండాలు, పోస్టర్లు విచ్చలివిడగా ప్రదర్శించకుండా ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించారు. ఎంపీఎఫ్ బృందాలు కూడా నిఘా ఉంచాయి. అభ్యర్థుల బయోడేటాలు, ఓటర్లకు ఇచ్చే హామీలకు సంబంధించి వివరాలన్నీ ఎంపీఎఫ్ సేకరిస్తుంది. వాటిని కింది స్థాయి సభ్యులకు అందజేసి ప్రతి ఇంటికి చేరేలా చూస్తున్నారు. చర్చ్‌ల పత్రికల్లో వాటిని ప్రచురిస్తున్నారు. ప్రతిపక్ష మిజోరం నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) కార్యదర్శి లాలెన్‌మావియా జోంగ్టే మీడియాతో మాట్లాడుతూ ఈసారి ఒకటి రెండు గ్రామాల్లో తప్ప బహిరంగ సభలు నిర్వహించడంలేదని వెల్లడించారు. పార్టీ బ్లాక్ కాన్ఫరెన్స్‌లు, శాఖా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అభ్యర్థులు, వారి ప్రచార సారధులు ప్రసంగిస్తారని అన్నారు. ఎంపీఎఫ్ ఆధ్వర్యంలోనే ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా ప్రచారం సందర్భంగా మత సంబంధమైన విందు సమావేశాలను ఎంపీఎఫ్ నిషేధించింది. ఏదైనా అలాంటి సమావేశాలు నిర్వహిస్తే బహిరంగంగానే ఖండిస్తారు. ఎంపీఎఫ్ ఎన్నికల ప్రచార అధికారులు ప్రతి గ్రామంలోనూ కార్యాలయం ఏర్పాటు చేశారు. పెద్ద గ్రామాలు, పట్టణాల్లోనూ ఎన్నికల కార్యాలయాలు వెలిశాయి. ఇలా ఉండగా ఆసారి సామాజిక మాద్యమాల్లోనూ అభ్యర్థులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఫేస్‌బుక్, వాట్సప్‌ను వాడుకుంటున్నారు. రేడియో, టీవీలు ఎలాగూ ఉన్నాయి. అధికార కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో కొత్త హామీలతో ప్రజల ముందుకొచ్చింది. న్యూ లాండ్ యూజ్ పాలసీ(ఎన్‌ఎల్‌యూపీ) అమలుచేస్తామని ప్రకటించింది. అలాగే నూతన ఆర్థిక అభివృద్ధి కార్యక్రమం(ఎన్‌ఈడీపీ) అనే కొత్త విధానాన్ని పార్టీ ప్రకటించింది. ఎన్‌ఎల్‌యూపీ కింద సంబంధిత కుటుంబానికి లక్ష రూపాయల ప్రయోజనం చేకూరుతుంది.
అలాగే ప్రతిపక్ష ఎంఎన్‌ఎఫ్ కూడా సామాజిక ఆర్థిక అభివృద్ధి విధానం తీసుకొస్తామని ప్రకటించింది. దీనికింద కుటుంబానికి 3 లక్షల రూపాయలు అందజేస్తామని జోంగ్టే వెల్లడించారు. చర్చి కోరుకుంటున్నట్టు మద్య నిషేధాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. తాము అధికారంలోకి వస్తే పంటల బీమా, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని కొత్తగా ఏర్పాటైన జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ హామీ ఇచ్చింది.