జాతీయ వార్తలు

రాజస్థాన్‌లో కుప్పతెప్పలుగా చిన్న పార్టీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అళ్వార్, డిసెంబర్ 2: ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజస్థాన్ రాష్ట్రంలో ప్రచారం తీవ్రస్థాయికి చేరుకుంటోంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్-బీజేపీ నువ్వానేనా అనే రీతిలో ప్రచారం సాగిస్తున్నాయి. ఈ రెండు పార్టీలతో పాటు పలు చిన్నపార్టీలు సైతం ఈసారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. రాష్టవ్య్రాప్తంగా కేవలం ఒక్క అభ్యర్థిని మాత్రమే బరిలోకి దింపిన పార్టీలు ఇక్కడ 20 వరకు ఉన్నాయి. 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్థాన్‌లో ప్రస్తుతం ఒక స్థానం ఎన్నిక వాయిదా పడగా 199 స్థానాలకు ఈనెల ఏడున ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ 33 జిల్లాలలో 4.74 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 88 పార్టీలకు చెందిన 2,294 మంది అభ్యర్థులు 200 నియోజకవర్గాల్లో పోటీలో ఉన్నారు. కొన్నిచోట్ల కేవలం తక్కువ ఖర్చే పెడుతూ పోటీలో ఉన్న కొందరు అభ్యర్థులు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పోయిస్తున్నారు. రాజస్థాన్‌లో బీజేపీ 200 స్థానాల్లో అభ్యర్థులను పోటీలో పెట్టగా కాంగ్రెస్ 195, బహుజన సమాజ్ పార్టీ 190 మందితో రంగంలో ఉంచాయి. మొత్తం 840 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 20 పార్టీలు కేవలం ఒక్క అభ్యర్థిని మాత్రమే పోటీలో ఉండగా, 15 పార్టీలు ఇద్దరిని, 34 పార్టీలు కేవలం ముగ్గురిని మాత్రమే పోటీలో ఉంచాయి. అళ్వార్ జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాలుండగా, దానిలో మూడు రిజర్వ్‌డు స్థానాలు. ఇక్కడ అత్యధికంగా 145 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మీరు పోటీ చేసినా విజయం సాధించే అవకాశాలు ఏమాత్రం లేవు కదా? మరి ఎందుకు పోటీలో ఉన్నారు అన్న ప్రశ్నకు సీపీఐకి చెందిన తేజ్‌పాల్ సైనీ సమాధానం ఇస్తూ ‘దేశంలో కేవలం బీజేపీ-కాంగ్రెస్ మాత్రమే పార్టీలు కాదు కదా? వాటికి ప్రత్యామ్నాయ పార్టీలు సైతం ఉన్నాయి అని ప్రజలకు అర్థం కావాలి. గెలుపన్నది ప్రధానం కాదు.. మా పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేయడానికి ఈ ఎన్నికలే సరైన వేదిక.. అందుకే మీము ఈ పోటీలో ఉన్నాం’ అని సైనీ తెలిపారు. రాజస్థాన్‌లో లోక్‌తాంత్రిక్ మోర్చా పేరుతో సీపీఐ, సీపీఐ (మార్క్సిస్టు), జనతాదళ్ (సెక్యులర్), సమాజ్‌వాద్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు-లెనినిస్టు), ద మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (యునైటెడ్) పార్టీలు మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. కేజ్రీవాల్ అధ్యక్షుడిగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ రాష్టవ్య్రాప్తంగా 42 మంది అభ్యర్థులను పోటీ ఉంచింది. అళ్వార్ జిల్లాలోనే నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్న ఆ పార్టీ ప్రజలకు సంబంధించిన నీరు, రోడ్లు, విద్యుత్, మరుగుదొడ్లు, రవాణా తదితర సమస్యలపై పోరాటం చేసి ప్రజలకు దగ్గర కావచ్చునని ఆశిస్తోంది. ఆప్ పార్టీ స్థాపించి కేవలం ఎనిమిది సంవత్సరాలే అయినా ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకుందని, పంజాబ్‌లో ఆదరణ పొందిందని, అలాగే దేశమంతటా తమ పార్టీ సిద్ధాంతాలను వ్యాప్తిచేసే ఉద్దేశంతోతాము పోటీ చేస్తున్నట్టు అళ్వార్ అర్బన్‌లో ఆ పార్టీ తరఫున పోటీలో ఉన్న అజయ్‌కుమార్ పునియా తెలిపారు. అళ్వార్, జైపూర్, గంగాధర్ జిల్లాల్లో ఎనిమిది స్థానాల్లో పోటీలో ఉన్న నేషనల్ యూనియనిస్టు జమిందార్ పార్టీ (ఎన్‌యూజడ్‌పీ) తమ పార్టీ ఉనికి కోసమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు తెలిపింది. తామే కాదు పలు ఇతరపార్టీలు సైతం కేవలం ఉనికి కోసమే పోటీలో ఉన్నాయని, ప్రజలకు సైతం ఆ రెండుపార్టీల కాక దేశంలో పలు ప్రత్యామ్నాయ పార్టీలు ఉన్నాయన్న విషయం తెలుసుకోవాలని ఆ పార్టీ నేత రాజేష్ సింగాల్ తెలిపారు. మిగిలిన రాష్ట్రాల మాటేమిటో తెలియదు కాని ఇక్కడ మాత్రం ప్రాంతీయ పార్టీలకు, మూడో ఫ్రంట్‌కు కచ్చితంగా ఎలాంటి ముఖ్యపాత్ర లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఇక్కడ జాతీయ పార్టీల వైపే ప్రజలు మొగ్గుచూపుతున్నారని, బీజేపీ, కాంగ్రెస్ తర్వాతే ఇక్కడి ప్రజలు మూడోస్థానాన్ని కట్టబెడతారని బీజేపీ అళ్వార్ చీఫ్ సంజయన్ సింగ్ నరూక తెలిపారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ కూడా స్పష్టం చేసింది. ఇక్కడ చిన్న పార్టీలు కేవలం కొన్ని ప్రాంతాల్లో ఓట్లను స్వల్పంగా చీల్చడానికి ఉపయోగపడతారని, అలా చీల్చడానికే వ్యూహాత్మకంగా బీజేపీ కొన్ని చోట్ల కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అలాంటి అభ్యర్థులను నిలబెడుతోందని కాంగ్రెస్ అళ్వార్ యూనిట్ అద్యక్షుడు టికారామ్ జల్లీ ఆరోపించారు. అలాగే ఎన్నికల్లో ధనం కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల వ్యయం 28 లక్షల రూపాయలని ఎన్నికల కమిషన్ నిబంధన ఉన్నా పెద్దపెద్ద పార్టీల అభ్యర్థులు కోట్ల రూపాయలను ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్న విషయం బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో చిన్న పార్టీల వారు, స్వతంత్ర అభ్యర్థులు వారితో సమానంగా ఖర్చు పెట్టి పోటీపడలేక ప్రచారంలో బాగా వెనుకబడి ఉన్నారు.