జాతీయ వార్తలు

మోదీది దేశద్రోహమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశారు. రక్షణ రహస్యాలను పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి పది రోజుల ముందే వెల్లడించడం ద్వారా దేశ ద్రోహానికి పాల్పడ్డారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా ఆరోపించారు. నరేంద్ర మోదీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఎంఓ యూ గురించి అనిల్ అంబానికి ముందే తెలియజేశారంటూ ఇందుకు సంబంధించిన ఒక ఈ- మెయిల్ గురించి రాహుల్ గాంధీ వివరించారు. నరేంద్ర మోదీ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ తరపున మధ్యవర్తిగా పని చేస్తున్నారని ఆయన విమర్శించారు. మోదీ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి రూ.30 కోట్ల ప్రజల సొమ్మును దోచిపెట్టారన్నారు. మంగళవారం ఏఐసీసీలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడుతూ రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం కుదరకముందే అనిల్ అంబానీ ఫ్రాన్స్ రక్షణ శాఖ కార్యాలయానికి వెళ్లి పది రోజుల తరువాత కుదిరే ఒప్పందం గురించి చర్చలు జరిపి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని వెల్లడించారు. దీనికి సంబంధించి వివరాలు ఈ-మెయిల్‌లో ఉన్నాయని రాహుల్ చెప్పారు. రాహుల్ గాంధీ సదరు ఈ-మెయిల్‌ను చదివి వినిపించారు. నరేంద్ర మోదీ రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డాడనేందుకు ఇంతకంటే వేరే సాక్ష్యాం కావాలా? అని ఆయన ప్రశ్నించారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఫ్రా న్స్‌తో ఎంఓయూ కుదుర్చుకుంటున్న విషయాన్ని అనిల్ అంబానికి చెప్పటం ద్వారా నరేంద్ర మోదీ దేశ రహస్యాలు బయటపెట్టారని విమర్శించారు. రాఫెల్‌పై దర్యాప్తు జరిపేందుకు జెపీసీని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ఆయన నరేంద్ర మోదీ ని ప్రశ్నించారు. ‘ప్రతిపక్ష నాయకులపై ఎన్ని దర్యాప్తులకు ఆదేశించినా మేం అభ్యంతరం చెప్పం. దీంతో పాటు రాఫెల్ ఒప్పందంపై కూడా దర్యాప్తు జరిపించాలి’అని కాంగ్రెస్ అధినేత స్పష్టం చేశారు.
ఇలా ఉండగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆరోపణలను బీజేపీ కొట్టిపారేసింది. రాహుల్ చెబుతున్న ఈ-మెయిల్ అభూతకల్పనగా పార్టీ పేర్కొంది. ఎయిర్‌బస్ ఎగ్జిక్యూటివ్ ఈ-మెయిల్ హెలీకాప్టర్ల ఒప్పందానికి సంబంధించిందని, రాఫెల్ యుద్ధ విమానాలది కాదని బీజేపీ వివరణ ఇచ్చింది. 2015 మార్చి 28న ఎయిర్‌బస్ ఎగ్జిక్యూటివ్ నికోలస్ ఛముస్సే నుంచి వచ్చిన ఈ-మెయిల్స్‌లో మూడు సార్లు అంబానీ పేరు ప్రస్తావించారు. అందులో అంశాలనే మీడియా సమావేశంలో రాహుల్ వెల్లడించారు. అలాగే ఫ్రాన్స్ రక్షణ మంత్రి జీన్ ఎవెస్ లీ డ్రియాన్ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కలిశారని ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం గురించి అనిల్‌కు ముందే తెలియకపోతే ఫ్రాన్స్ రక్షణ మంత్రిని ఎలాకలిశారని కాంగ్రెస్ చీఫ్ ప్రశ్నించారు. రక్షణ మంత్రి మనోహర్ పారికర్, విదేశాంగశాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్‌కు కనీస సమాచారం లేదని ఆయన తీవ్రంగా ఆరోపించారు.‘ రక్షణ వ్యవహారాలు బహిర్గతం చేయడం ద్వారా మోదీ దేశ ద్రోహానికి పాల్పడ్డారు. అనిల్ అంబానీకి మోదీ మధ్యవర్తిగా వ్యవహరించారు’అని రాహుల్ నిప్పులు చెరిగారు. ఈ వ్యవహారంపై నేర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. రాఫెల్‌పై రాహుల్ ఇంతకు ముందు చేసిన ఆరోపణలను ప్రభుత్వం, అనిల్ అంబానీ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. అవినీతికి పాల్పడ్డారని ఇప్పటి వరకూ విమర్శిస్తూ వచ్చిన కాంగ్రెస్ అధినేత మంగళవారం నాటి విలేఖరుల సమావేశంలో దేశ రహస్యాలను చేరవేశారని తీవ్రంగా ధ్వజమెత్తారు. అధికార రహస్యాల చట్ట ఉల్లంఘనకు ప్రధాని మోదీ పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కాగా రాహుల్ ఆరోపణలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. కేంద్రంపై బురదజల్లడం మానుకోవాలని ఆయన అన్నారు. మోదీ లాంటి మచ్చలేని ప్రధానిపై ఆరోపణలు చేయడం కాంగ్రెస్‌కు అలవాటైపోయిందని, రాహుల్ అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ప్రసాద్ వెల్లడించారు.