జాతీయ వార్తలు

సంక్లిష్ట దశలో జర్నలిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: ప్రస్తుతం జర్నలిజం సంక్లిష్ట దశలో కొనసాగుతున్నదని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ న్యూస్ అన్నది ర్యాగింగ్ చేస్తున్నదని దీని సృష్టికర్తలు పవిత్రమైన పాత్రికేయ వృత్తికే కళంకం తెస్తున్నారని ఆయన అన్నారు. జర్నలిజంలో అసమాన ప్రతిభ సాధించిన వారికి ఇచ్చే రాంనాథ్ గోయెంకా అవార్డుల ప్రదానం సందర్భంగా సోమవారం నాడిక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సామాజిక, ఆర్థిక అసమానతలను ఎండగట్టె కథనాలు కొరవడ్డాయని, సంయమనం, బాధ్యత అన్న ప్రాథమిక అంశాలు మరుగున పడిపోయాయని అన్నారు. బ్రేకింగ్ న్యూస్ అన్నది ఇప్పుడు మీడియాను మింగేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ కథనం వార్తగా అర్హత పొందేందుకు అవసరమైన వౌలిక లక్షణాలు అడుగంటిపోయాయని, ఫేక్ న్యూసే కొత్త భూతంగా తెరపైకి వచ్చిందన్నారు. ఈ రకమైన వార్తలను ప్రసారం చేసే వారే పాత్రికేయులుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాత్రికేయ వృత్తి పవిత్రతను రాంనాథ్ గోయెంకా కాపాడుకుంటూ వచ్చారని దానిని సన్మార్గంలో పెట్టేందుకు ప్రయత్నించారని ఆయన తెలిపారు. ప్రస్తుతం జర్నలిజం సంక్లిష్ట దశలో ఉందనడనడంలో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్న రాష్ట్రపతి ‘పాత్రికేయులు తమ వృత్తి నిర్వహణలో భాగంగా అనేక పాత్రలు పోషిస్తున్నారు. పరిశోధకులుగా, ప్రాసిక్యూటర్లుగా, చివరకు న్యాయ నిర్ణేతలుగా వారే నిర్వహిస్తున్నారు..’ అని అన్నారు. ఓ వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చేందుకు అనేక భూమికలను ఏకకాలంలో పోషించాలంటే పాత్రికేయులకు అసమాన శక్తితో పాటు దానికి అవసరమైన నిబద్ధత కూడా కావాలని ఆయన తెలిపారు. ఈ విషయంలో వారు కనబరుస్తున్న ప్రతిభాపాటవాలు ప్రశంసనీయమని పేర్కొన్న రాష్ట్రపతి ‘దీనికి తగ్గట్టుగా నిజమైన జవాబుదారీతనం ఉందా?’ అంటూ ప్రశ్నించారు. నిజాన్ని వెలికి తీయడం అన్నది అనుకున్నంత తేలిక కాదని, అంత మాత్రాన దానిని వెలుగులోకి తేకుండా వదలడానికి వీల్లేదని అన్నారు. ప్రజలకు వాస్తవాలతో కూడిన సమాచారం అందించినప్పుడే ప్రజాస్వామ్యం అర్థవంతమవుతుందని పేర్కొన్న ఆయన ఆధునిక టెక్నాలజీ వల్ల కొత్తతరం జర్నలిజం పుట్టుకుని వచ్చిందన్నారు. దీనికి సాంప్రదాయ జర్నలిజానికి ఏ విధంగానూ పొంతన లేదని తెలిపారు. అయితే పాత్రికేయ వృత్తికి నిజాయితే గీటురాయి అని, ఒక అంశానికి చెందిన వాస్తవాలను అంతే నిజాయితీతో తెరపైకి తేవాలన్నారు. సోషల్ మీడియా సర్వత్రా ఆవహించిన నేటి పరిస్థితుల్లో పాత్రికేయ వృత్తి ప్రమాణాలను మరింతగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక మీడియా వల్ల ప్రజలకు తెలిసే సమాచారం కంటే వారిని రెచ్చగొట్టే ధోరణే ఎక్కువగా ఉంటున్నదని రాష్టప్రతి చురక వేశారు.
'చిత్రం...రాంనాథ్ గోయెంకా అవార్డుల ప్రదానం సందర్భంగా సోమవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతున్న రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్