జాతీయ వార్తలు

ప్రజా హక్కులను కాపాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 27: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తర్ ప్రదేశ్‌లో ఆందోళన చేసిన ప్రజలపై ఆ రాష్ట్ర పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని కాంగ్రెస్ పార్టీ జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందు స్పష్టం చేసింది. బాధితులనే నిందితులుగా మారుస్తూ ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇంతగా ఆందోళనకారులను అణచివేసినప్పటికీ కూడా యూపీ ప్రభుత్వం ఏ ఒక్క పోలీసు అధికారిపై కూడా చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక సారథ్యంలోని ప్రతినిధుల బృందం ఎన్‌హెచ్‌ఆర్‌సీకి వివరించింది. వీడియోల్లో ఫొటోలు సహా మొత్తం 31 పేజీల అభియోగ పత్రాన్ని కాంగ్రెస్ బృందం అందించింది. యూపీలో ఆందోళనకారులపై దాడులు, మానవ హక్కుల ఉల్లంఘనలు తీవ్ర స్థాయిలో జరిగాయని ఇందులో వివరించింది. తన సొంత ప్రజలపైనే యూపీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించినట్లుగా పరిస్థితులు దిగజారాయని తెలిపింది. పౌరుల రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు వెంటనే నిర్ణయాత్మకంగా చర్యలు చేపట్టాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీని కోరింది. ప్రజలపై యూపీ పోలీసులు అటవికంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించారని, ఈ చర్యలన్నింటిపైనా నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని రాహుల్ సారథ్యంలోని బృందం ఎన్‌హెచ్‌ఆర్‌సీని కోరిందని ప్రియాంక తెలిపారు. ‘నీ భవిష్యత్తును నాశనం చేస్తాం’ అంటూ డీహెచ్‌ఏ వర్సిటీ విద్యార్థులను సైతం బెదిరించిందని, పోలీసులు జరిపిన దాడుల్లో అనేక మంది మరణించారని ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేసినట్లు ప్రియాంక తెలిపారు. దేశ వ్యాప్తంగా ఇదే తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయని పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజల హక్కులను అణచి వేసే చర్యలు జరుగుతున్నాయని రాహుల్ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి తెలియజేసినట్లు ప్రియాంక తెలిపారు. భారత రాజ్యాంగంపైనా, భారతీయత అనే భావనపైనే దాడులు జరుగుతున్నాయని కూడా రాహుల్ తెలియజేశారన్నారు. మానవ హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర పోషించే ఎన్‌హెచ్‌ఆర్‌సీ వెంటనే రంగంలోకి దిగి, ప్రజలకు తగిన న్యాయం చేయాలని రాహుల్ కోరారు. కాంగ్రెస్ తన మెమోరాండంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై ప్రభుత్వం వ్యవహారించిన తీరును వివరించారు. యూపీ ప్రభుత్వం తన సొంత ప్రజలనే నేరస్థులుగా పరిగణిస్తున్నదని పేర్కొన్నారు. ఈ సమావేశ వివరాలను కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ సింఘ్వి మీడియాకు తెలిపారు.

*చిత్రం... జాతీయ మానవ హక్కుల సభ్యులను సోమవారం ఢిల్లీలో కలుసుకున్న
కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక, అభిషేక్ సింఘ్వీ