జాతీయ వార్తలు

దేశ ప్రతిష్టకే కళంకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జనవరి 28: శాంతి, సామరస్యాలు పరిఢవిల్లిన దేశంగా భారత్‌కు ఉన్న ఖ్యాతిని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వంసం చేశారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తమ గళమెత్తిన యువత ఎంతమాత్రం వెనక్కి తగ్గకూడదని, అణచివేత విధానాలపై సంఘటితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఇక్కడ జరిగిన యువజన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడిన రాహుల్ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి తలెత్తిందని అన్నారు. రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇస్తే, గత ఏడాది కాలంలోనే కోటి మంది ఉపాధి కోల్పోయారని ఆయన అన్నారు. యూపీఏ హయాంలో 9 శాతానికి చేరుకున్న వృద్ధి రేటు ఇప్పుడు 5 శాతానికి పడిపోయిందని అన్నారు. యూపీఏ కాలంలో అనుసరించిన ప్రమాణాల ప్రకారం లెక్క కడితే వృద్ధి రేటు 2.5 శాతమే ఉన్నట్టు లెక్క అని రాహుల్ తెలిపారు. అసలు అర్థశాస్త్రం అంటేనే ప్రధాని మోదీకి తెలియదని విమర్శించిన రాహుల్ జీఎస్టీ విధానంపైనా ఆయనకు అవగాహన లేదని అన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన తప్పుపట్టారు. ప్రభుత్వ ప్రతికూల విధానాలపై యువత ఎంతమాత్రం వెనక్కి తగ్గకూడదని పిలుపునిచ్చిన రాహుల్ ఉపాధి అవకాశాలపైన, దేశ భవితవ్యంపైన ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. మోదీ ఎక్కడికి వెళ్లినా కూడా సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ల గురించే మాట్లాడతారని, నిరుద్యోగం వంటి వాస్తవ అంశాల జోలికి పోరని రాహుల్ దుయ్యబట్టారు. దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగంపై యువత ఆగ్రహాన్ని చాటిచెప్పడానికే కాంగ్రెస్ పార్టీ ఈ యువ ఆక్రోష్ ర్యాలీని నిర్వహించింది. మోదీ విధానాల వల్ల దేశ కీర్తిప్రతిష్టలు అడుగంటిపోయాయని, ఇప్పుడు భారత్ అత్యాచారాల రాజధానిగా మారిపోయిందని రాహుల్ అన్నారు. అయినప్పటికీ కూడా ప్రధాని మోదీ వీటిపై నోరు విప్పడం లేదని తెలిపారు. నిరుద్యోగం, దేశ ఆర్థిక పరిస్థితి గురించి యువత ఎప్పుడు మాట్లాడినా బుల్లెట్లతోనే వారికి సమాధానం చెబుతారని తెలిపారు. చైనాను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఉన్న దేశ యువతను మోదీ ప్రభుత్వం నిస్సారంగా మారుస్తోందని ఆయన విమర్శించారు. చైనాను కట్టడి చేయడానికి అమెరికా, ఐరోపా తదితర దేశాలు భారతవైపే చూస్తున్నాయని, అందుకు కారణం ఇక్కడి యువత సామర్థ్యంపై వాటికున్న నమ్మకమేనని రాహుల్ అన్నారు. గతంలో శాంతియుత పరిస్థితులు ఉన్నపుడు ఇతర దేశాల నుంచి భారీ ఎత్తున పెట్టుబడులు తరలివచ్చాయని పేర్కొన్న రాహుల్ ‘రేపటి గురించి ఎలాంటి ధీమా లేనపుడు ఏవిధంగా పెట్టుబడులు పెడతాం’ అని విదేశీ పెట్టుబడిదారులు ప్రశ్నిస్తున్నారని అన్నారు. మోదీ హయాంలో రైతులు, యువత నష్టపోయారని, బాగుపడింది పారిశ్రామికవేత్తలేనని అన్నారు.

*చిత్రం... జైపూర్‌లో మంగళవారం జరిగిన యువ ఆక్రోష్ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గజమాల వేస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు