జాతీయ వార్తలు

భగీరథకు రూ.12వేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: తెలంగాణలోని ప్రతి ఇంటికీ మంచి నీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ పథకం నిర్వహణకు 12 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టీ హరీష్ రావు 15వ ఆర్థిక సంఘాన్ని డిమాండ్ చేశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు 5 వేల కోట్ల రూపాయలు కేటాయించాలని ఆయన 15వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు నంద కిశోర్ సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. 15వ ఆర్థిక సంఘం ప్రాంతీయ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తామని ఎన్‌కే సింగ్ రాష్ట్ర మంత్రి హరీష్‌తో చెప్పారు. మిషన్ భగీరథ నిర్వహణ ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించాలన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పట్ల ఎన్‌కే సింగ్ సానుకూలంగా స్పందించినట్లు హరీష్‌రావు తెలిపారు. మంగళవారం నందకిశోర్ సింగ్‌తో హరీష్ సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై లోతుగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, మిషన్ భగీరథ అద్భుతమైన ప్రాజెక్టులని ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ప్రశంసించినట్లు సమావేశానంతరం హరీష్‌రావు మీడియాకు తెలిపారు. నందకిశోర్ సింగ్ ఈ ప్రాజెక్టులను ప్రశంసించడంతో పాటు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావును అభినందించారని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి 15వ ఆర్థిక సంఘం త్వరలోనే తమ నివేదికను అందజేస్తున్నందున దీనిలో ఎత్తిపోతల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టుల నిర్వహణ కోసం నివేదికలో నిధుల సిఫారసు చేయాలని హరీష్‌రావు ఆయనకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని 80 మీటర్ల నుండి 600 మీటర్ల వరకు ఎత్తిపోతల ద్వారా ఎత్తి పంపింగ్ చేస్తున్నామని, దీని నిర్వహణకు ఆర్థిక సంఘం ప్రత్యేకంగా నిర్వహణ నిధులు కేటాయించాలని హరీష్‌రావు ప్రతిపాదించారు. జల వనరుల సమస్యను పరిష్కరించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, గత ఐదు సంవత్సరాలలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల, సీతారామ ఎత్తిపోతల పథకాలను పూర్తిచేసిందని ఆయన 15వ ఆర్థిక సంఘానికి వివరించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు కూడా హాజరయ్యారు. తెలంగాణకు సంబంధించిన వివిధ పథకాలు, అవసరాలు, ఇతర అంశాలపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు రాసిన లేఖను నందకిశోర్ సింగ్‌కు అందజేసినట్లు
హరీష్‌రావు చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు ముఖ్యంగా ఆర్థిక అంశాల గురించి ఆయనతో చర్చించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న వివిధ నీటి పారుదల ప్రాజెక్టులు, ఇతర ప్రాజెక్టుల గురించి ఆర్థిక సంఘం అధ్యక్షునికి వివరించానన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా నీటిని పంపిణీ చేసే పథకాన్ని చేపట్టాలని అనుకుంటోందన్నారు. ఇప్పటికే ఈ పథకాన్ని గుజరాత్, తెలంగాణ ప్రభుత్వాలు చేపట్టాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలుగకుండా ఈ పథకాన్ని అమలు చేసేందుకు అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించి నిధులు కేటాయించాలని మంత్రి హరీష్ రావు ఆర్థిక సంఘానికి వివరించారు.
*చిత్రం...న్యూఢిల్లీలో మంగళవారం 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్‌కే సింగ్‌కు వినతిపత్రం అందజేస్తున్న మంత్రి హరీష్‌రావు