జాతీయ వార్తలు

చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దేందుకే పౌరసత్వ సవరణ చట్టాన్ని తెచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశ విభజన సందర్భంగా మూడు ఇస్లామిక్ దేశాలలోని మైనారిటీలకు ఇచ్చిన హామీలను పూర్తి చేసేందుకే ఈ చట్టం వచ్చిందని ప్రధాని స్పష్టం చేశారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ ముస్లిం మైనారిటీలు దేశంలోని పలు రాష్ట్రాల్లో గొడవ చేస్తున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఎన్‌సీసీ క్యాడెట్ల ర్యాలీలో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్, త్రిదళాధిపతి బిపిన్ రావత్‌తో పాటు త్రివిధ దళాల అధిపతులు, రక్షణ శాఖ సీనియర్ అధికారులు ఎన్‌సీసీ-2020 ర్యాలీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ పరిస్థితులు విషమిస్తే భారత దేశానికి రావచ్చు, భారత దేశం మీ వెంట ఉంటుందని విభజన సమయంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లో ఉండిపోయిన హిందు, సిక్కు, క్రైస్తవ, బౌద్ద, జైన మతాలకు చెందిన మైనారిటీలకు హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం ద్వారా ఈ హామీని తమ ప్రభుత్వం పూర్తి చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ కూడా ఈ అభిష్టాన్ని వ్యక్తం చేశారని మోదీ తెలిపారు. దేశం మొదటి ప్రధాని జవాహర్ లాల్ నెహ్రుకు పాకిస్తాన్‌కు చెందిన లియాకత్ అలీ ఖాన్‌తో జరిగిన ఒప్పందం కూడా ఇదే భావాన్ని వ్యక్తం చేసిందని ఆయన గుర్తు చేశాపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్గానిస్తాన్‌లో మత హింసకు గురైన వారికి శరణు ఇచ్చి భారతీయ పౌరసత్వం కల్పించాల్సిన బాధ్యత వారిపై ఉండింది కానీ వారీ బాధ్యతను నిర్వహించలేదని మోదీ ఆరోపించారు. తమ ప్రభుత్వం ఇప్పుడీ హామీని పూర్తి చేస్తోందని ఆయన ప్రకటించారు. సీఏఏను వ్యతిరేకిస్తున్న వారికి పాకిస్తాన్ తదితర దేశాల్లోని మైనారిటీలపై జరుగుతున్న అత్యాచారాలు కనిపించవా? అని ఆయన నిలదీశారు. మతం మూలంగానే హిందువులు, తదితర మైనారిటీలపై అత్యాచారాలు జరిగాయి, వారిని అపహరించి మతం మార్చడం జరిగింది, ఇవన్నీ ప్రతిపక్షాలకు కనిపించవా? అని ఆయన ప్రశ్నించారు. పాకిస్తాన్‌లోని దళితులపై జరిగే అత్యాచారాలు కనిపించవంటూ ఆయన ధ్వజమెత్తారు. దేశ ప్రజలు వౌనంగా ఉన్నారు కానీ ప్రతిపక్షం చేస్తున్న వెర్రి చేష్టలను చూస్తున్నారు, సమయం వచ్చినప్పుడు బుద్ది చెబుతారని మోదీ హెచ్చరించారు.
దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. మూడు, నాలుగు కుటుంబాలు, మూడు, నాలుగు రాజకీయ పార్టీలు ఈ సమస్యను పరిష్కరించే బదులు దీనిని పెంచి పోషించి వ్యాపించజేశాయని నరేంద్ర మోదీ ఆరోపణలు కురిపించారు. దీని ఫలితంగానే కాశ్మీర్‌ను ఉగ్రవాదులు సర్వనాశనం చేశారు, ఉగ్రవాదుల చేతుల్లో వేలాది మంది అమాయకులు బలయ్యారని ప్రధాని మోదీ అవేశంతో చెప్పారు. కాశ్మీర్‌లోని లక్షలాది మందిని ఒక్క రాత్రిలో తమ ఇళ్ళు విడిచి శాశ్వతంగా వెళ్లిపోవాలని ఆదేశిస్తే అప్పటి ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇలా వ్యవహరించినందుకే ఉగ్రవాదుల మనోధైర్యం పెరిగిపోయింది, దీంతో పరిపాలనా యంత్రాంగం బలహీనమైందని ఆయన చెప్పారు. కాశ్మీర్‌ను అలాగే వదిలి వేయవలసిందా? అని ఆయన ఎన్‌సీసీ క్యాడెట్‌లను ప్రశ్నించారు. రాజ్యాంగంలోని 370-అధికరణ తాత్కాలికమేనని చెప్పి, దశాబ్దాలు గడిచినా తొలగించే ధైర్యం చేయలేదని ఆయన విమర్శించారు. రాజకీయ పార్టీలు, ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే ఇలా చేశాయని నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. దేశానికి మకుటంలాంటిదైన కాశ్మీర్‌లోని ప్రజలను సమస్యల సుడిగుండం నుండి బయటకు తెచ్చేందుకే 370-అధికరణను రద్దు చేశామని మోదీ చెప్పారు. పొరుగు దేశం మనతో మూడు సార్లు యుద్దం చేసిందని, వారిని తరిమి కొట్టేందుకు మన సైన్యానికి వారం, పది రోజుల కంటే ఎక్కువ సమయం పట్టలేదని ఆయన అన్నారు. ప్రచ్చన్న యుద్ధంలో లక్షలాది మంది మరణించారు, ఇకమీదట ఈ స్థితి కొనసాగేందుకు వీలు లేదని, భారత మాత రక్తం ఇలా ప్రవహించేందుకు వీలు లేదని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గతంలో పొరుగు దేశానికి బుద్ది చెప్పేందుకు భయపడే వారని, ఇప్పుడలాంటి పరిస్థితి లేదని, ఇప్పుడు మెరుపు దాడులు, విమాన దాడులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల విషయంలో కూడా గత ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణిని అవలంభించాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకున్నదని ఆయన తెలిపారు. ఉగ్రవాదులు ఆదేశిస్తే దేశంలోని యువతలో క్రమశిక్షణ, పట్టుదలతో పాటు దేశం పట్ల ప్రేమాభిమానాలను పెంచేందుకు ఎన్‌సీసీ మంచి వేదిక అని ప్రధాని తెలిపారు. క్రమశిక్షణ, ధృడమైన ఇచ్చాశక్తి, నిబద్దత, పట్టుదల గల యువత ఉన్న దేశం అభివృద్దిని ప్రపంచంలోని ఏ శక్తి అపలేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని 65 శాతం మంది ప్రజలు 35 సంవత్సరాల లోపువారేనని ప్రధాని తెలిపారు. ‘సర్దుకుపోదాము, ఎలాగో బయటపడదాం, మున్ముందు చూద్దాం లే, ఇప్పుడే తొందరేమిటీ? వాయిదా వేయండి రేపు చూద్దాం’ అనే ఆలోచించే వారు యువకులు కాదని ఆయన చెప్పారు. ఈ విధంగా ఆలోచించే వారికి రేపు అనేదే ఉండదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇలాంటి వ్యక్తులకు కేవలం స్వార్థం మాత్రమే కనిపిస్తుందంటూ, మీకు ఇలాంటి వారే చాలా మంది కనిపిస్తారని నరేంద్ర మోదీ ఎన్‌సీసీ క్యాడెట్లతో చెప్పారు. మన దేశం మారాలి, పరిస్థితులు మారాలని యువత కోరుకుంటోందని ఆయన చెప్పారు. ఈ పరిస్థితులను మార్చాల్సిందేనని, వాయిదా పడరాదని యువత కోరుకుంటోందన్నారు.
దేశం చాలా సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నది యువత ఆలోచన అని ప్రధాని మోదీ చెప్పారు. దేశం తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్ తరాలకు ఉజ్వలమైన భవిష్యత్తును చూపించాలన్నారు. ఉగ్రవాదుల దాడిలో ఇంత మంది మరణించారు, నక్సల్-మావోయిస్టుల దాడిలో ఇంత మంది పోలీసులు మరణించారు, వేర్పాటువాదులు ఈ ప్రసంగం చేశారు, భారత దేశం పట్ల విషం గక్కారు, మరోసారి త్రివర్ణ జాతీయ పతాకాన్ని అవమానించారనే పరిస్థితులను ఆమోదించేందుకు దేశంలోని యువకులు, మనం, నవ భారతం సిద్ధంగా లేదని ఆయన చెప్పారు. కొన్ని సమస్యలు దేశాన్ని బలహీనం చేశాయి, మన సంపాదనలో ఎక్కువ భాగం ఈ సమస్యల పరిష్కారానికే ఖర్చైపోతోందని ఆయన అన్నారు.
*చిత్రాలు.. ఢిల్లీలో మంగళవారం జరిగిన వార్షిక ఎన్‌సీసీ కేడెట్ల ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతున్న ప్రధాని మోదీ
*ర్యాలీలో భాగంగా తమ యుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న కేడెట్లు