జాతీయ వార్తలు

నైతిక బాధ్యత మీదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. సోనియా గాంధీ బుధవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ డిమాండ్ చేశారు. ఢిల్లీలో నెలకొన్న భయానక పరిస్థితులకు కేంద్రంతో పాటు ఢిల్లీ ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఢిల్లీలో అల్లర్లు జరుగుతుంటే అమిత్ షా గత ఆదివారం నుండి ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అని సోనియా గాంధీ ప్రశ్నించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి గత ఆదివారం నుండి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని ఆమె నిలదీశారు. ఢిల్లీ ఎన్నికల అనంతరం పరిణామాలపై ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం సమాచారం ఇచ్చింది? దానిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారు. గత ఆదివారం నుండి అల్లర్లు జరిగిన ప్రాంతంలో ఎంత మంది పోలీసులను మోహరించారు? అల్లర్లు మరింత జరుగుతాయి, విస్తరిస్తాయనేది తెలిసి కూడా మీరు ఎందుకు అదనపు చర్యలు తీసుకోలేదు? అని అమె ప్రశ్నించారు. ఢిల్లీలో పరిస్థితి అదుపు తప్పినప్పుడు సెంట్రల్ పారామిలిటరీ దళాలను ఎందుకు మోహరించలేదని ఆమె అడిగారు. ఢిల్లీలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అదనపు పోలీసులను వెంటనే మోహరించాలి, శాంతి సంఘాల సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. సీనియర్ అధికారులను అన్ని ప్రాంతాల్లో
నియమించి పరిస్థితిని అదుపు చేయాలని ఆమె సూచించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అల్లర్లు జరిగిన ప్రాంతాల్లోని ప్రజల వద్దకు వెళ్లాలన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజ్యసభలో ప్రతిపక్షం నాయకుడు గులాం నబీ ఆజాద్, సీనియర్ నాయకులు అహ్మద్ పటేల్, పి.చిదంబరం, పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా హాజరయ్యారు. బీజేపీ నాయకులు రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం ద్వారా భయానక వాతావరణాన్ని సృష్టించారని సోనియా గాంధీ ఆరోపించారు. బీజేపీ నాయకుడొకరు ఢిల్లీ పోలీసులకు హెచ్చరిక చేస్తూ మూడు రోజుల వరకు ఓపిక పడతారు, ఆ తరువాత జరిగే దానికి తాము బాధ్యులము కామంటూ ప్రకటించడం అల్లర్లకు దారి తీసిందని ఆమె దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం కావాలనే గత 72 గంటల్లో ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు, అందుకే ఇరవై కంటే ఎక్కువ మంది మరణించారు, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించిందని సోనియా గాంధీ ఆరోపించారు. ఢిల్లీలో కానిస్టేబుల్ మరణించగా ఒక జర్నలిస్టుతోపాటు ఎంతో మంది గాయపడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈశాన్య ఢిల్లీలో అన్ని చోట్ల హింస చోటు చేసుకున్నదంటూ దాడుల్లో మరణించిన వారి కుటుంబాల వారికి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఢిల్లీలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా హోం శాఖ మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలి, ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఢిల్లీలో శాంతి, సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పడంలో ఢిల్లీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తమ బాధ్యతలను నిర్వహించడంలో విఫలమైనందుకే దేశ రాజధానిలో ఈ పరిస్థితి నెలకొన్నదని ఆమె చెప్పారు. ఢిల్లీ ప్రజలు శాంతియుతంగా ఉండాలని సోనియా గాంధీ పిలుపు ఇచ్చారు. మాజీ ప్రధాని వాజపేయి ఎప్పుడు సంక్షోభం నెలకొన్నా అన్ని పక్షాల నాయకులతో సమావేశం జరిపేవారని, అయితే నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సంప్రదాయానికి తెర దించారని సోనియా విమర్శించారు. అల్లర్లు అకస్మాత్తుగా జరిగాయని అమిత్ షా చెబితే ఇదొక కుట్ర అని హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఆంటున్నారు, అల్లరు ఎలా జరిగాయనేది వారు మొదట తేల్చుకోవాలని రణదీప్ సింగ్ సుర్జేవాలా చెప్పారు. భారత దేశంలో మత స్వేచ్చ ఉన్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ చెప్పడంపై మీ అభిప్రాయం ఎమిటని ఒక విలేకరి అడుగగా మన దేశానికి వచ్చిన అతిథి వ్యాఖ్యలపై వ్యాఖ్యానించటం గౌరవం కాదని సోనియా గాంధీ చెప్పారు.

*చిత్రం... కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షురాలు సోనియా గాంధీ