జాతీయ వార్తలు

ఢిల్లీ అల్లర్ల వెనుక కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 11: ఢిల్లీ అల్లర్ల వెనక పెద్ద కుట్ర ఉన్నదని, దేశాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొన్ని అరాచక శక్తులు వీటిని సృష్టించాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ధ్వజమెత్తారు. అల్లర్లకు బాధ్యులైన ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బాధ్యులైన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకునేందుకు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలు పని చేస్తున్నాయని అన్నారు. అల్లర్లలో పాల్గొన వారిని పట్టుకునేందుకు నలభై పోలీసు బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయని అమిత్ షా ప్రకటించారు. ఢిల్లీలో హింసాత్మక సంఘటనలకు పాల్పడిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక సాంకేతిక పరిజానాన్ని కూడా ఉపయోగిస్తున్నామని ఆయన తెలిపారు. ఢిల్లీ అల్లర్లపై పార్లమెంటులో జరిగిన చర్చకు బదులిస్తుండగానే కాంగ్రెస్, ఎంఐఎం మరి కొన్ని ప్రతిపక్ష పార్టీల సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సభ నుండి వాకౌట్ చేశారు. హోం శాఖ మంత్రి సరైన సమాధానం ఇవ్వటం లేదని, ఆయన తన పదవికి వెంటనే రాజీనామా చేయాలనే నినాదాలు ఇస్తూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షం సభ్యులు సభ నుండి బయటకు వెళ్లారు. ఈ వ్యవహారంపై ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ ప్రతిపక్షం తాము చెప్పదలచుకున్నదంతా చెప్పిన తరువాత, హోం మంత్రి సమాధానం వినకుండా సభ నుండి వెళ్లిపోవటం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన స్పీకర్ ఓం బిర్లాను కోరారు. అంతకు ముందు, అమిత్ షా బుధవారం లోక్‌సభలో ఢిల్లీ అల్లర్లపై జరిగిన సుధీర్ఘ చర్చకు బదులిస్తూ ఉత్తర ప్రదేశ్ నుండి దాదాపు మూడు వందల మంది వచ్చి అల్లర్లు సృష్టించారని వెళ్లడించారు. ముఖం గుర్తించే సాఫ్ట్‌వేర్ ద్వారా ఇంత వరకూ పదకొండు వందల మంది అల్లరి మూకలను గుర్తించామని అన్నారు. వీరిని అరెస్టు చేసేందుకు నలభై పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని అమిత్ షా వివరించారు. ఫేస్ రికగ్నైజింగ్ సాఫ్ట్‌వేర్‌కు మతం, ప్రాంతం ఉండదని, అది కేవలం ముఖాలను మాత్రమే గుర్తింస్తుంది కాబట్టి మతపరమైన వివక్ష అనేదేదీ ఉండదని ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీకి అమిత్ షా భరోసా ఇచ్చారు. మతలకలహాలలో పాల్గొన్న వారు ఏ మతానికి చెందిన వారైనా కఠినంగా శిక్షిస్తామని ఆయన తేల్చిచెప్పారు. ‘ఇది అస్తిత్వ యుద్ధం... అటోఇటో తేల్చుకోవలసిన సమయం’ అంటూ కొందరు నాయకులు చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలు పరిస్థితిని మరింత చెడగొట్టాయని ఆయన ఆరోపించారు. ఎంఐఎం శాసన సభ్యుడు వారిస్ పఠాన్ మహారాష్టల్రో మాట్లాడుతూ ‘మేము పదిహేను కోట్ల మందిమి వంద కోట్ల మందిని సునాయసంగా దెమ్బతీస్తాం’ అంటూ ప్రసంగించిన తరువాత ఢిల్లీలో మతకలహాలు జరిగాయని అమిత్ షా గుర్తుచేశారు. వారిస్ పఠాన్ తన మాటలను ఉపసంహరించుకున్నారుకదా అని ఒవైసీ చెప్పగా ‘మాటలు ఉపసంహరించుకున్నంత మాత్రాన సరిపోతుందా?’ అని అమిత్ షా ఆయనను నిలదీశారు. సామాజిక మాధ్యమాలలో దాదాపు అరవై ఖాతాల ద్వారా మూడు రోజుల పాటు హింసను రెచ్చగొట్టే సందేశాలు పంపించారని, వీటిపై దర్యాప్తు జరుగుతోందని ఆయన అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లను అరికట్టేందుకు తాను రాత్రింబగళ్లు కృషి చేశానని, ఎప్పటికప్పుడు ఢిల్లీ పోలీసులతో పరిస్థితిని సమీక్షించానని అమిత్ షా అన్నారు. తన విజప్తి మేరకే జాతీయ భద్రతా సలహాదారు అజీత్ దోవల్ అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పర్యటించారని చెప్పారు. తాను స్వయంగా పర్యటిస్తే పోలీసులు తన వెంట రావటం వల్ల పరిస్థితి మరింత క్షీణిస్తుందనే ఉద్దేశంతోనే తాను వెళ్లలేదన్నారు. అమెరికా అధ్యక్షుడు భారత్ పర్యటనకు వచ్చిప్పుడు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గానికి వెళ్లినప్పటికీ, తాను మాత్రం ఢిల్లీలోనే ఉండి, అల్లర్లను అదుపు చేసే ప్రక్రియలో మునిగిపోయానని చెప్పారు. అల్లర్లకు కారకులైన వారిని, అల్లర్లలో పాల్గొన్న వారిని పోలీసులు, ప్రజలు పంపించిన వీడియోల ద్వారా గుర్తిస్తున్నామన్నారు. ఐబీ ఉద్యోగి అంకిత్ శర్మను హత్య చేసిన వారిని కూడా ప్రజలు పంపించిన వీడియో ద్వారా గుర్తించనున్నట్లు అమిత్ షా వెల్లడించారు. అల్లర్లు సృష్టించిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని, తద్వారా అల్లరు సృష్టించే వారికి గుణ పాఠం నేర్పిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. అల్లర్లకు పాల్పడేవారు ఏ మతానికి చెందినా, పార్టీకి చెందినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 49 ఆర్మ్స్ చట్టం ప్రకారం కేసులు పెట్టామని, 153 తుపాకులు, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని ఆయన చెప్పారు. ఢిల్లీ అల్లర్లపై దాదాపు ఏడు వందల ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. ఈ సంఘటనలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవడానికి ప్రయత్నించారని ఆయన ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించారు. ప్రజలు పంపించిన వేలాది అల్లరి మూకల వీడియోలు దర్యాప్తులో పోలీసులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఆయన తెలిపారు.

*చిత్రం... లోక్‌సభలో మాట్లాడుతున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా