జాతీయ వార్తలు

వంద కోట్లు.. మంత్రి పదవి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 16: సంపూర్ణ ప్రజా విశ్వాసాన్ని సాధించలేకపోయిన బీజేపీ, అధికారం కోసం అడ్డదారులు తొక్కుతోందంటూ జేడీ(ఎస్), కాంగ్రెస్ కూటమి సీఎం అభ్యర్థి కుమారస్వామి ఆరోపణల బాంబు పేల్చారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒకొక్కరికీ వంద కోట్ల లంచం ఆశచూపిందని, మంత్రి పదవులు సైతం ఆశచూపుతోందని ఆరోపణలు గుప్పించారు.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో, ప్రభుత్వ ఏర్పాటుకు ఎత్తుకు పైఎత్తులు సాగుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం నెలకొల్పడం కోసం అటు బీజేపీ, ఇటు జేడీ(ఎస్), కాంగ్రెస్ కూటమి ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఈ తరుణంలో జేడీ(ఎస్) శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన కుమారస్వామి బీజేపీపై ‘వంద కోట్ల’ బాంబు పేల్చారు. ‘మా బలాన్ని చీల్చడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఒక్కో ఎమ్మెల్యేకు వంద కోట్లు ఆఫర్ చేసింది. అయితే, ఆ సొమ్ము వైట్ మనీనా? బ్లాక్ మనీనా? వాళ్లే చెప్పాలి?’ అంటూ మీడియా ముందు ఆరోపణలు చేశారు. ‘జేడీ(ఎస్), కాంగ్రెస్ కూటమికి 116మంది ఎమ్మెల్యేల బలముంది. సంపూర్ణ ప్రజా మద్దతు సాధించలేకపోయిన బీజేపీ మాత్రం, కేంద్రం నుంచి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ‘పవర్’ ఎరవేసి మా బలాన్ని చీల్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది’ అంటూ కుమారస్వామి ఆరోపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ముందు పిలవాలన్నది గవర్నర్ పరిశీలనలో ఉన్న అంశమని అంటూనే, ‘సంఖ్యాబలం లేని బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది?’ అని ప్రశ్నించారు. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచన ఏమైనా ఉందా? అన్న మీడియా ప్రశ్నకు కొట్టిపారేశారు. ‘రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడితో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సమ్మతి తెలుపుతూ గవర్నర్‌ను కలుస్తాం’ అని కుమారస్వామి స్పష్టం చేశారు. జేడీ(ఎస్) ఆరోపణలకు కాంగ్రెస్ నేతలు సైతం మద్దతు పలికారు. ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ, కర్నాటకలో అధికారాన్ని చేజిక్కించుకోడానికి అడ్డదారులను ప్రోత్సహిస్తున్నారంటూ దిగపోనున్న సీఎం సిద్ధరామయ్య సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పించారు. ‘ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు పదవులను ఎర చూపడాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రోత్సహిస్తున్నారు. ఇది దారుణం. ఏదేమైనా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ మమ్మల్నే ముందు ఆహ్వానిస్తారని అనుకుంటున్నాం’ అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టారా? అన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ ‘మేమంతా ఐక్యంగా ఉన్నాం’ అన్నారు. రాజ్యసభ ఎన్నికల సమయంలో బీజేపీ ప్రలోభాల నుంచి గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రక్షించుకునేందుకు కర్నాటక రిసార్ట్‌లో క్యాంపు నిర్వహించిన కీలక సూత్రధారి, సిద్ధరామయ్య సర్కారులోని కీలక మంత్రి డికె శివకుమార్ మాట్లాడుతూ ‘కాంగ్రెస్‌కు ఇద్దరు ఎమ్మెల్యేలు అందుబాటులో లేరంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు’ అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాగేంద్ర, ఆనంద్ సింగ్‌లు తమతోనే ఉన్నారని, 78 ఎమ్మెల్యేల బలంలో ఎలాంటి మార్పూ లేదన్నారు. ‘ఇప్పుడు మేం ఐక్యంగా లేకపోతే, రేపు ప్రజలు తంతారు’ అంటూ ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే, ఎన్నికల్లో 104 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా బిఎస్ యెడ్యూరప్ప ఎన్నికయ్యారు. హుటాహుటిన రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ను కలిశారు. ‘సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి అనుమతించాలని గవర్నర్‌ను కోరాం. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో నూరుశాతం నమ్మకంతో ఉన్నాం’ అని మీడియాకు వెల్లడించారు. మరోపక్క కాలం కలిసొచ్చి కేవలం 37మంది ఎమ్మెల్యేల బలంతో సీఎం రేస్‌లోకి వచ్చిన జేడీ(ఎస్) నేత కుమారస్వామి ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ ‘ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ బేషరతు మద్దతు ప్రకటించింది. ఐదేళ్ల కాలాన్ని స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలం’ అన్నారు. అలాగే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు జి పరమేశ్వర నాయకత్వాన సమావేశమై ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలన్న అంశాన్ని విస్తృతంగా చర్చించారు. పార్టీ కార్యాలయంలో సమావేశం అనంతరం సీనియర్ కాంగ్రెస్ నేత, ప్రచార కమిటీ చైర్మన్ డికె శివకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి ఎలా సహకరించాలి, ఏ విధానాన్ని అనుసరించాలన్న అంశంపై సమాలోచనలు జరిపామన్నారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఎవరిని ఎంపిక చేసుకోవాలన్న అంశంపై ఎలాంటి చర్చా జరగలేదని వివరించారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు చేజారిపోయారన్న వార్తలను ఖండిస్తూ ‘మా ఎమ్మెల్యేలు మా దగ్గరే ఉన్నారు. మేమంతా ఐక్యంగా ఉన్నాం’ అని స్పష్టం చేశారు. మరో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అఖిల భారత వీరశివ మహాసభ నాయకుడు షామనూర్ శివశంకరప్ప మాట్లాడుతూ ‘లింగాయత్/ వీరశివ కమ్యూనిటీ నుంచి ఎన్నికైన ఏ ఎమ్మెల్యే కూడా పార్టీనుంచి చేజారిపోలేదు. వాళ్లంతా మాతోనే ఉన్నారు’ అని స్పష్టం చేశారు. బీజేపీ నుంచి ఎమ్మెల్యేలను రక్షించుకునేందుకు క్యాంపు నిర్వహణకు కాంగ్రెస్ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.