జాతీయ వార్తలు

ప్రజా తీర్పే శిరోధార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కర్నాటక ప్రజలు శాసనసభ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాం. శాసనసభ ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించటంలో ఎలాంటి తప్పూ లేదని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. అమిత్ షా సోమవారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కర్నాటక ప్రజలు కాంగ్రెస్, జేడీ(ఎస్)ను తిరస్కరించారనేది మరిచిపోరాదన్నారు. తమ శాసన సభ్యులను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూనే తప్పుడు ఆడియో టేపులద్వారా సుప్రీం కోర్టును ప్రభావితం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేసిందని అమిత్ షా ఆరోపించారు. 104 సీట్లు వచ్చి మెజారిటీ లభించనందున బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించి ఉండాల్సింది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇది సరైన అభిప్రాయం కాదని ఆయన అన్నారు. ఏ పార్టీకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావలసినంత మెజారిటీ రాలేదు కాబట్టి మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరపాలా? అని అమిత్ షా ప్రశ్నించారు. ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఉందని, దాని ప్రకారమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించామని వివరించారు. ఎన్నికల ప్రచార సమయంలో జేడీ(ఎస్) నాయకులు కాంగ్రెస్‌ను ఆరోపణలతో ముంచెత్తారు. కాంగ్రెస్ తప్పులను ఎత్తి చూపారు. ఇప్పుడు వారిరువురే కలిసి పనిచేసేందుకు సిద్ధపడ్డారని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్, జేడీ(ఎస్) ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాయని ఆరోపించారు. కర్నాటకలో కాంగ్రెస్ దేనికోసం పండుగ చేసుకుంటోందని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి ఓడిపోయినందుకా? మెజారిటీ మంత్రులు ఓడిపోయినందుకా? 122 సీట్లనుండి 78 సీట్లకు తగ్గినందుకా? అంటూ అమిత్ షా విమర్శనాస్త్రాలు సంధించారు. 37 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జేడీ(ఎస్) పండుగ చేసుకుంటోందా? అని ఆయన నిలదీశారు.
జేడీ(ఎస్) బీజేపీకి బి-టీం అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించటం మరిచిపోయారా అని ఆయన కుమారస్వామిని ప్రశ్నించారు. కర్నాటక ప్రజలు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా కాంగ్రెస్‌తో చేతులు కలిపి జేడీ(ఎస్) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని అమిత్ షా దుయ్యబట్టారు. వారిరువురూ కలిసి కర్నాటక ప్రజలకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. కర్నాటక ప్రజలు తమకు 104 సీట్లు ఇవ్వటం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలనకు ఆమోద ముద్ర వేశారు. ఇతర దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కూడా నరేంద్ర మోదీ సుపరిపాలనకు ఓటు వేయనున్నారని అమిత్ షా చెప్పారు. కాంగ్రెస్ తదితర పార్టీలకు ఇప్పుడు ప్రజాస్వామ్యం, కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీం కోర్టుపై విశ్వాసం పెరగటం శుభపరిణామమని ఆయన ఎద్దేవా చేశారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించేందుకు ప్రయత్నించినవారే ఇప్పుడు కోర్టును అభినందిస్తున్నారని ఆయన చెప్పారు. ఇకమీదట సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించే తీర్మానం పెట్టరనే ఆశాభావాన్ని అమిత్ షా వ్యక్తం చేశారు. ఇంతకాలం ఈవీఎంలను తప్పుపట్టినవారు ఇక మీదట తమ అభిప్రాయాలను మార్చుకోవాలన్నారు. తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీలు గతంలో కూడా తమకు వ్యతిరేకంగా పోటీ చేశాయి, ఇక మీదట కూడా పోటీ చేస్తాయి. 2019లో బీజేపీ కేంద్రంలో పూర్తి మెజారిటీతో గెలిచి చూపిస్తుందని అమిత్ షా జోస్యం చెప్పారు. కాంగ్రెస్, జేడీ(ఎస్) శాసన సభ్యులను స్వేచ్ఛగా తిరగనిచ్చి ఉంటే ఫలితాలు మరోరకంగా ఉంటాయన్నారు. కాంగ్రెస్, జేడీ(ఎస్) శాసనసభ్యులు ఊరేగింపు జరిపితే ప్రజలు వారిచేత తమకు అనుకూలంగా ఓటు వేయించేవారని బీజేపీ అధ్యక్షుడు చెప్పారు. శాసనసభ్యులను కొనుగోలు చేశామని మాపై ఆరోపణలు చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ గతంలో ఏం చేసిందో తెలియదా? అని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను మొదట బీజేపీ చేసిందని ఆయన వాదించారు. బీజేపీ తమ శాసనసభ్యులను కొనుగోలు చేసేస్తోందంటూ కాంగ్రెస్ విడుదల చేసిన ఆడియో టేపులు నిజమైనవి కాదని, వాటిని కాంగ్రెస్ తయారు చేసిందని అమిత్ షా ఆరోపించారు. తాము శాననసభ్యులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించలేదు. కాంగ్రెస్, జేడీ(ఎస్) విధానాలను వ్యతిరేకించే శాసనసభ్యులు తమకు మద్దతు ఇస్తారని ఆశించామని ఆయన వివరించారు. మీడియా కూడా ఆడియో టేపుల నిజానిజాలు తెలుసుకోలేదని ఆయన విమర్శించారు. గోవా, మణిపూర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ ముందుకు రాలేదు కాబట్టే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. గతంలో దాదాపు యాభై ప్రభుత్వాలను కూల్చివేసిన కాంగ్రెస్‌కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదు. ఈ వాస్తవాన్ని రాహుల్ గాంధీ గ్రహించాలని అమిత్ షా స్పష్టం చేశారు. కాంగ్రెస్, జేడీ(ఎస్) ఈ రోజు కూడా తమ శాసనసభ్యులను హోటళ్లలో బంధించిపెట్టాయి. వారు బైటికిరాగానే నిలదీసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అమిత్ షా చెప్పారు.