రాష్ట్రీయం

‘నిపా’ కోరల్లో కేరళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోజికోడ్ (కేరళ), మే 22: దక్షిణాది రాష్ట్రం కేరళను నిపా వైరస్ వణికిస్తోంది. రాష్ట్రంలోని కోజిక్కోడ్, మలప్పురం జిల్లాల్లో ఇప్పటివరకు ఈ వైరస్ బారిన పడి 10 మంది మరణించారు. చికిత్స పొందుతున్న మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నదని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె. శైలజ మంగళవారం వెల్లడించారు. ఈ సరికొత్త వైరస్ సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ)కు తెలియపరచినట్లు ఆమె విలేఖరులకు చెప్పారు. మంత్రి ఇచ్చిన సమాచారం ప్రకారం, కోజికోడ్‌లో చికిత్స పొందుతున్న రాజన్, అశోకన్ అనే ఇద్దరు వ్యక్తులు మంగళవారం మృతిచెందారు. వీరిద్దరూ నిపా వైరస్ బారిన పడినట్లు నిర్ధారించారు. ఈ రోగులకు చికిత్స నందిస్తూ వైరస్ సోకి లీనీ అనే నర్సు సోమవారం మృతిచెందింది. ఇప్పటివరకు వ్యాధి సోకిన 18 మంది నమూనాలను పరీక్ష నిమిత్తం పంపగా, 12 మందికి నిపా వైరస్ సోకినట్లు నిర్ధారించారు. కాగా ఈ నెల 20న మలప్పురంలో సింధు, సిజితా అనే ఇద్దరు నిపా వైరస్ సోకి మృతి చెందారు. వీరిద్దరూ కోజికోడ్ మెడికల్ కళాశాల ఆసుపత్రికి వచ్చారు. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ)కి చెందిన నిపుణుల బృందాన్ని ఇప్పటికే కేంద్రం కేరళకు పంపింది. వీరిలో సంస్థ డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కుమార్ సింగ్, ఎపిడమాలజీ చీఫ్ డాక్టర్ ఎస్.కె. జైన్ కూడా ఉన్నారు. ఏఐఎంఎస్‌కు చెందిన అత్యున్నత స్థాయి బృందం కూడా కేరళ చేరుకుందని మంత్రి వెల్లడించారు. కోజికోడ్‌లోని ఒక కుటుంబం నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందిందని అనుమానిస్తున్నారు. పెరంబరకు చెందిన ఒకే కుటుంబంలోని ఇద్దరు సోదరులు, ఒక మహిళ నిపా వైరస్ సోకి మే 5న మృతి చెందారు. వీరి నుంచే ఈ వైరస్ వ్యాపించినట్లు చెబుతున్నారు. వీరి ఇంటిముందు గబ్బిలాల మృత కళేబరాలు ఉన్నాయని, బహుశా వాటినుంచి ఈ వ్యాధి వీరికి సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇప్పటివరకు 94 మందిని ఇళ్లనుంచి బయటకు రావద్దని చెప్పినట్టు అధికార వర్గాలు తెలిపాయి. వివిధ ఆసుపత్రుల్లో 9 మంది చికిత్స పొందుతున్నారు.
భయపడాల్సిన అవసరం లేదు : గోవా
పనాజి: కేరళలో నిపా వైరస్ కలకలం నేపథ్యంలో, గోవా ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాధి వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. అయితే ఇప్పటివరకు రాష్ట్రంలో ఈవ్యాధి గురించి ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదు. రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌కు చెందిన సర్వైవలెన్స్ అఫీసర్ డాక్టర్. ఉత్కర్ష్ బెటోద్కర్ మాట్లాడుతూ ఈ వైరస్ పట్ల గోవా ప్రభుత్వం ఏమాత్రం అలసత్వం ప్రదర్శించడంలేదని, ఇప్పటికే మణిపాల్ సెంటర్ ఫర్ వైరస్ రీసెర్చ్ (ఎంసీవీఆర్)ను సంప్రదించిందన్నారు. కేరళనుంచి వచ్చే పర్యాటకులకు స్క్రీనింగ్ టెస్ట్‌లు చేయాల్సిన అవసరం లేదన్నారు. పండ్లు తినే గబ్బిలాలు, నిపా వైరస్‌కు ప్రాథమిక అతిథేయిలు. వీటి ద్వారా ఇతర జంతువులు, మానవులకు ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. నిజానికి ఈ వైరస్‌ను మొట్టమొదటిసారి 1998లో మలేసియాలోని కామ్‌పంగ్ సుంగై నిపాలో కనుగొన్నారు.
కన్నీరు పెట్టించిన నర్సు లేఖ
‘నేను వెళ్లిపోతున్నాను.. నువ్వు మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి’ అంటూ నిపా వైరస్ సోకి మరణశయ్యపై ఉన్న లీనీ పుథుస్సెరీ అనే నర్సు తన భర్తకు రాసిన లేఖ పలువురి హృదయాలను కలచివేసింది. 28 సంవత్సరాల ఆ నర్సు కొద్ది నిముషాల్లో మరణిస్తాననగా తన భర్త సజీష్‌కు మలయాళంలో సంక్షిప్తంగా రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోజికోడ్ జిల్లాలోని పెరంబర తాలూకా అసుపత్రిలో లీనీ నర్సుగా పనిచేస్తోంది. నిపా వైరస్ సోకిన రోగులకు చికిత్స అందించిన బృందంలో ఈమె కూడా ఒకరు. 5, 2 సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమారులున్న ఈమె భర్త బహ్రైన్‌లో పనిచేస్తున్నారు.