జాతీయ వార్తలు

కుమార సంభవం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, మే 23: కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా హెచ్‌డి కుమారస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. విధానసౌధ మెట్ల వద్ద ఏర్పాటు చేసిన భారీ వేదికపై కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. కుమారస్వామి చేత రాష్ట్ర గవర్నర్ వజుభాయ్ వాలా పదవీ ప్రమాణం, గోప్యతా ప్రమాణం చేయించారు. కుమారస్వామితో పాటు మంత్రిగా కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేశారు. పరమేశ్వర్‌కు
ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించారు. ఈనెల 25న అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. కన్నడ సంప్రదాయం ప్రకారం ధోతి, తెల్ల చొక్కా ధరించి కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. కన్నడనాడు ప్రజలు, దేవుడి సాక్షిగా ఆయన ప్రమాణం చేశారు. వేలాదిమంది జేడీ(ఎస్), కాంగ్రెస్ కార్యకర్తల కరతాళధ్వనులు, కోలాహలం మధ్య సాగిన కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి దేశవ్యాప్తంగా బీజేపియేతర పక్షాల నేతలు హాజరయ్యారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు, యూపీ మాజీ సీఎం, బిఎస్పీ సుప్రీం మాయావతి, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్, జేడీ(యూ) చీలికపక్షం నేత శరద్‌యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బీహార్ ఆర్జేడీ నేత తేజస్వియావద్, కేరళ సీఎం పినరయి విజయన్, సిపిఐ నేత రాజా తదితరులు హాజరయ్యారు.
2014 ఎన్నికల్లో సాధించిన సంపూర్ణ మెజార్టీతో కేంద్రంలో అధికారం చేపట్టి అప్రతిహతంగా బీజేపీ సాగిపోతున్న తరుణంలో, కర్నాటక పరిణామాలు బిజేయేతర శక్తులకు కొత్త ఊపిరి పోసింది. కర్నాటకలో ఉత్కంఠ పరిణామాల మధ్య జేడీ(ఎస్)-కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానం పంపడంతో, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా కార్యక్రమానికి హాజరుకావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ వ్యతిరేక పునాదిగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరు కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్డీయే కూటమిలో భాగస్వామిగావున్న చంద్రబాబు బీజేపీతో ఇటీవల తెగతెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్‌తో కలిసి ఒక వేదికను చంద్రబాబు పంచుకోవడం ఇదే తొలిసారి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విషయమై ముందు జాగ్రత్తపడి ఒక రోజుముందు మంగళవారమే బెంగళూరుకు వచ్చి కుమారస్వామిని కలిసివెళ్లారు. తెలంగాణలో ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ కావడంతో, కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొంటున్న వేదికను వారితో కలిసి పంచుకోవడం రాజకీయంగా తెరాసకు కలిసివచ్చే అంశం కాదు. రాజకీయ చతురుడైన కేసీఆర్ ఈ విషయంలో ముందుగా జాగ్రత్తపడ్డారు.
గుర్రాన్ని కట్టేశాం: కుమారస్వామి
ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కుమారస్వామి మీడియాతో ముచ్చటిస్తూ దేశాన్ని బీజేపి ఆధీనంలోకి తెచ్చుకోవాలన్న ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఆకాంక్షకు కర్నాటక అడ్డుకట్ట వేసిందన్నారు. ‘అశ్వమేధ యాగం చేసి దేశాన్ని జయించాలనుకున్నారు. కానీ వారి అశ్వాన్ని కర్నాటకలో జేడీ(ఎస్)-కాంగ్రెస్ బంధించింది’ అని చమత్కారంగా వ్యాఖ్యానించారు.
కుమారస్వామికి మోదీ ఫోన్
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కుమారస్వామికి ప్రధాని మోదీ మర్యాద పూర్వకంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. సీఎంగా కుమారస్వామి, డిప్యూటీ సీఎంగా పరమేశ్వర బాధ్యతలు స్వీకరించడాన్ని అభినందిస్తూ ట్వీట్ చేశారు. కొత్త బాధ్యతల్లో రాణించాలని మోదీ ఆకాంక్షించారు.
అవకాశవాద పొత్తు: బీజేపీ
కర్నాటకలో ప్రజల చేతిలో పరాజితులైన జేడీ(ఎస్)-కాంగ్రెస్ పార్టీలు అవకాశవాద పొత్తుగా గద్దె నెక్కాయని కేంద్ర న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారం నుంచి దింపగలమని విపక్షాలు పగటి కలలు కంటున్నాయన్నారు. వీరి పొత్తును ప్రజలు క్షమించరన్నారు. కర్నాటకలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించిందని రవిశంకర్ గుర్తు చేశారు.