జాతీయ వార్తలు

‘డిప్యూటీ’పై ఎత్తుకు పైఎత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు అధికార, ప్రతిపక్షాలు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాయి. బీజేపీ యేతర ప్రాంతీయ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడడంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడిపోయింది. కొత్త డిప్యూటీ చైర్మన్ పదవిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్‌ఆర్‌సీపీతోపాటు ఒడిశ్శాకు చెందిన బీజూ జనతా దళ్ పార్టీల మద్దతు కీలకంగా మారింది. బీజేడీని తమవైపు తిప్పుకునేందుకు ప్రతిపక్షాలు ఆ పార్టీకి డిప్యూటీ చైర్మన్ పదవిని ఎర వేసినట్లు తెలిసింది. బీజేడీకి చెందిన సీనియర్ సభ్యుడు ప్రసన్న ఆచార్యకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలో ఒక తాటిమీదికి వస్తున్న ప్రాంతీయ పార్టీల కూటమి ప్రతిపాదించినట్లు తెలిసింది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన సుఖేందురాయ్ కూడా డిప్యూటీ చైర్మన్ పదవికోసం పోటీ పడుతున్నట్లు చెబుతున్నారు. టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు కూడా డిప్యూటీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారనే మాట వినిపిస్తోంది. ప్రాంతీయ పార్టీల కూటమి తరపున టీఎంసీ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో పార్టీ పక్షం నాయకుడు డెరిక్ ఓబ్రేన్ కాంగ్రెసేతర ప్రతిపక్ష పార్టీల నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఎన్‌డీఏ అభ్యర్థి డిప్యూటీ చైర్మన్ పదవి చేపట్టాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ తమ లక్ష్య సాధనకోసం ఈ పదవిని శివసేనకు ఇచ్చేందుకు సంసిద్ధత తెలిపిందని అంటున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల ముంబాయికి వెళ్లి శివసేన అధినాయకులతో చర్చలు జరిపినప్పుడు డిప్యూటీ చైర్మన్ పదవి ప్రతిపాదన చేశారని అంటున్నారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ వద్ద 106 మంది సభ్యులు ఉంటే ప్రతిపక్షానికి 117 మంది సభ్యుల మద్దతు ఉన్నది. ఇటీవల ఎన్‌డీఏకు రాజీనామా చేసిన తెలుగుదేశం అటు వెళ్లటంతో ప్రతిపక్ష బలం 117కు చేరింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎంపికలో తాము ఎవరికి మద్దతు ఇస్తామనేది ఇంతవరకు బయటపెట్టని టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీ, బిజూ జనతాదళ్ పార్టీలది కీలకపాత్రగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని టీఆర్‌ఎస్, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీలు బీజేపీకి అనుకూలంగా ఉంటున్నాయనే అపవాదు ఉండటం తెలిసిందే. ఒడిశ్శా ముఖ్యమంత్రి, బీజూ జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ బీజేపీకి దూరమైనా ప్రతిపక్షానికి మద్దతు ప్రకటించలేదు. అందుకే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎంపికలో ఈ మూడు పార్టీలు ఎవరికి ఓటు వేస్తే ఆ అభ్యర్థి విజయం సాధిస్తారనే మాట వినిపిస్తోంది.
తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెసేతర ప్రతిపక్ష నాయకుడిని డిప్యూటీ చైర్మన్‌గా ఎంపిక చేసేందుకు చర్చలు ప్రారంభించటం కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడవేసింది. కాంగ్రేసేతర ప్రతిపక్షం నాయకుడిని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎంపిక చేసేందుకు మమతా బెనర్జీ పెద్దఎత్తున పావులు కదుపుతున్నారు. ఆమె యుపీఏ భాగస్వామ్య పార్టీల నాయకులతోపాటు బిజూ జనతాదళ్, తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి, సీపీఐ, సీపీఎం నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. మమతా బెనర్జీ డిప్యూటీ చైర్మన్ ఎంపిక గురించి కాంగ్రెస్‌తో ప్రాథమిక చర్చలు జరపకుండానే ప్రతిపక్ష పార్టీల నాయకులతో చర్చలు జరపటం కాంగ్రెస్ అధినాయకత్వానికి మింగుడు పడటం లేదు. కాంగ్రెస్ నాయకుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి చేపట్టకూడదనే ఆలోచనతో మమతా బెనర్జీ పని చేయటం ఏమిటన్నది కాంగ్రెస్ నాయకుల ఆవేదన. అందుకే సోనియా ఆదేశం మేరకు ఆమె రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ సోమవారం బంగభవన్‌లో మమతా బెనర్జీని కలిసి చర్చలు జరిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేసేందుకు మమతా బెనర్జీ ససేమిరా అంగీకరించటం లేదు. దీనితో రెండు పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆమెతో అహ్మద్ పటేల్ చర్చలు జరపటం ప్రాధాన్యత సంతరించుకున్నది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎంపిక గురించి మమతా బెనర్జీ మొదట ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో చర్చలు జరపటం కూడా కాంగ్రెస్‌ను ఇరకాటంలో పడవేసిందని అంటున్నారు. అహ్మద్ పటేల్ సోమవారం మమతా బెనర్జీతో సమావేశమైనప్పుడు ఈ అంశాలు కూడా చర్చకు వచ్చాయనే మాట వినిపిస్తోంది.
ఇదిలావుంటే తొమ్మిది మంది సభ్యులున్న బీజేడీ, ఆరుగురు సభ్యులున్న టీఆర్‌ఎస్, ఇద్దరు సభ్యులున్న వైఎస్‌ఆర్‌సీ మద్దతు సంపాదించేందుకు అధికార పక్షమైన బీజేపీతోపాటు ప్రాంతీయ పార్టీల కూటమి కూడా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పీజే కురియన్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు. కాంగ్రెస్ ఆయనకు మరోసారి రాజ్యసభ టికెట్ ఇవ్వటం లేదు. దీనితో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక జరిపించవలసిన అవసరం ఏర్పడింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభకు కొత్త డిప్యూటీ చైర్మన్‌ను ఎన్నుకుంటారు. రాజ్యసభలో మొత్తం సీట్లు 245 కాగా డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు 122 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. రాజ్యసభలో ఏకైక పెద్ద పార్టీ బీజేపీకి 69 మంది సభ్యులుంటే కాంగ్రెస్‌కు 51 మంది సభ్యులున్నారు. కూటమిగా చూస్తే యూపీఏకు 106 మంది సభ్యులుంటే ప్రతిపక్షాల కూటమికి 117 మంది సభ్యులున్నారు. బీజేడీ, టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీకి కలిపి 17 మంది సభ్యులున్నారు. ఈ పదిహేడు మంది సభ్యుల మద్దతు సంపాదించేందుకు ఇరుపక్షాలు పెద్దఎత్తున తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ అధినాయకత్వం ఈ పదిహేడు మందితోపాటు ప్రతిపక్షానికి చెందిన కొన్ని చిన్న పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది.