జాతీయ వార్తలు

కడసారి చూసేందుకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: తమ ప్రియతమ నేతను ఆఖరిసారి చూడాలి.. ఎలాగైనా ఢిల్లీ చేరుకోవాలి.. అదే వారి లక్ష్యం.. అక్కడికి వెళ్లడానికి ఏం ప్రయాణ సాధనాలను ఆశ్రయించాలి.. ఎలా వెళ్లాలి అని చూసుకోలేదు.. రైలు, బస్సు, స్కూటర్, ఆటో, ట్రాక్టర్ ఇలా ఏదిపడితే అది ఎక్కారు. గమ్యం చేరాలి.. తమ అభిమాన నేతను దర్శించి కడసారి వీడ్కోలు పలకాలి.. అదే వారి ముందున్న ఆలోచన.. భారతరత్న, మాజీ ప్రధాని వాజపేయి మృతి వార్త తెలుసుకున్న పలువురు అభిమానుల ఆత్రుత ఇది. గురువారం ఆయన మరణవార్త తెలుసుకున్న వివిధ రాష్ట్రాల్లోని అభిమానులు, నేతలు, కార్యకర్తలు ఎలాగైనా వాజపేయి పార్థివ దేహాన్ని దర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉన్నఫళాన వారు బయలుదేరారు. తమకు అందుబాటులో ఉన్న వాహనాలను ఆశ్రయించారు. ఎలాగైనా శుక్రవారానికి ఢిల్లీ చేరుకోవాలన్నదే వారి ఆత్రుత. ఇలా ఢిల్లీకి చేరుకున్న పలువురి అనుభవాలను ఒకసారి పరిశీలిస్తే...
యూపీలోని భాగపట్‌కు చెందిన ఆకాశ్‌కుమార్ (25) తన ప్రియతమ నేతను చూడటానికి 70 కిలోమీటర్ల దూరం నుంచి స్కూటర్‌పై వచ్చినట్టు తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మూడో, నాలుగో తరగతి చదువుతున్నప్పుడు వాజపేయి ప్రసంగం విన్నానని, ఆయన కవితలు తననెంతో ఆకట్టుకున్నాయని, అప్పటి నుంచి ఆయనపై అభిమానాన్ని పెంచుకున్నానని చెప్పాడు.
చెన్నై నుంచి తన స్నేహితునితో విమానంలో ఢిల్లీకి చేరుకున్న చిన్నయ్య నదేశం (45), గణేశన్ (38) నేరుగా విమానాశ్రయం నుంచి వాజపేయి నివాసానికి చేరుకుని అంతిమ నివాళి అర్పించారు.
వేలాదిమంది వాతావరణ పరిస్థితిని సైతం లెక్క చేయకుండా కాలికి జోళ్లు కూడా లేకుండా వట్టికాళ్లతో బీపీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌కు కాలినడకన రావడం కన్పించింది. ఈ సందర్భంగా పలువురు పూలు, ఇతర వస్తువులు తీసుకువచ్చారు.
బిజేపీ హెడ్‌క్వార్టర్స్ బయట వేచి చూస్తున్న ఆకాశ్ కుమార్ మాట్లాడుతూ వాజపేయిని చివరిసారిగా దర్శించడానికి తాను వేచి చూస్తున్నానని, ఆయనకోసం గంగోత్రి నుంచి గంగాజలం తెచ్చానని, తన వెంట భార్య కూడా వచ్చిందని చెప్పారు.
యోగేష్ కుమార్ నేతృత్వంలోని బృందం సుమారు 500 కిలోమీటర్ల దూరంలోని ఉత్తరకాశీ నుంచి రాత్రికి రాత్రే బయలుదేరి వచ్చారు. తాను 1986లో ఉత్తరకాశీలో వాజపేయి పర్యటించినప్పుడు ఆయనను కలుసుకున్నానని చెబుతూ అప్పుడు వాజపేయితో తీసుకున్న ఫొటోను చూపించాడు.
సోనుగుప్తా (32) అనే ఆటోడ్రైవర్ తాను పటేల్ నగర్ నుంచి ఆటోలో వచ్చానని చెప్పాడు.
సివిల్స్‌కు ప్రిపేర్ అవుతూ ఢిల్లీలోని ముఖర్జీనగర్‌లో నివసిస్తున్న శివశక్తి సింగ్ (23) నీరు నిండిన కళ్లతో వాజపేయిని గుర్తుకుచేసుకుంటూ కన్పించాడు.
వాజపేయిని చివరిసారి దర్శించుకునేందుకు లైన్‌లో నాలుగుగంటల నుంచి వేచిచూస్తున్న యూపీ ఆజంగర్‌కు చెందిన ఒక మధ్యవయస్కుడు మాట్లాడుతూ ప్రధానిగా వాజపేయి అందించిన పాలన వ్యక్తిగతంగా తనను ముగ్ధుడిని చేసిందన్నారు.
మధ్యప్రదేశ్‌లోని దేవాస్ నుంచి తన స్నేహితుడు చంద్రశేఖర్ మాల్వియా (36)తో కలిసి వచ్చిన శ్రీవాస్తవ మాట్లాడుతూ తొలుత తాము రైలులో ఇక్కడకు వద్దామని అనుకున్నామని, కాని రిజర్వేషన్ దొరకనందున ఎలాగైనా ఇక్కడకు రావాలన్న ఉద్దేశంతో విమానంలో ఇక్కడకు చేరుకున్నట్టు చెప్పాడు. అతని స్నేహితుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం తాను టీనేజర్‌గా ఉన్నప్పుడు మొదటిసారి వాజపేయి ప్రసంగం విని ముగ్ధుడినయ్యానని, అప్పటి నుంచి ఆయన భోపాల్, ఇండోర్, ఉజ్జయినీ ఇలా ఎక్కడ సభలు నిర్వహించినా వెళ్లి ఆయన ప్రసంగాలు ఆలకించేవాడినని చెప్పాడు.
బిహార్ నుంచి వచ్చిన 20 ఏళ్ల యువకుడు మాట్లాడుతూ వాజపేయికి నివాళి అర్పించాలని వచ్చానని, మన దేశం ఒక గొప్ప నేతను కోల్పోయిందని తెలిపాడు.

చిత్రం: జన సందోహం నడుమ వాజపేయ అంతిమయాత్ర