జాతీయ వార్తలు

పొత్తుల వ్యూహంపై కసరత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ కోర్ కమిటీ మంగళవారం ఉన్నత స్థాయిలో చర్చ జరిపింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏకే ఆంటోని అధ్యక్షతన జరిగిన కోర్ కమిటీ సమావేశానికి రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, లోక్‌సభలో ప్రతిపక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే, అహ్మద్ పటేల్, అశోక్ గెహ్లాట్, జైరామ్ రమేష్ హాజరయ్యారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత కే జానారెడ్డి, రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ కుంతియా పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు అనుసరించవలసిన వ్యూహం, భావసారూప్యత గల పార్టీలతో సీట్ల సర్దుబాటు, ప్రచార వ్యూహం, అభ్యర్థుల ఎంపికకు అనుసరించవలసిన మార్గదర్శక సూత్రాలు తదితర అంశాలపై చర్చించినట్టు నేతలు వెల్లడించారు. సమావేశానంతరం కుంతియా, ఉత్తమ్, జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల వ్యూహం, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై సాధారణ స్థాయిలో చర్చలు జరిగాయి. మరో నాలుగు రాష్ట్రాల నాయకులతో కలిపి జరిపిన మంగళవారం భేటీ జరిగింది’అని వారు తెలిపారు. పొత్తులు, సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై తుది నిర్ణయం తీసుకున్న వెంటనే మీడియాకు తెలియజేస్తామని కుంతియా, ఉత్తమ్ వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు తెలంగాణ కాంగ్రెస్ ఏ మేరకు సంసిద్ధంగా ఉన్నదనేది సమావేశంలో సమీక్షించినట్లు వారు తెలిపారు. పొత్తులు, సీట్ల సర్దుబాటు గురించి చర్చించినా, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కుంతియా స్పష్టం చేశారు. కొండా సురేఖ, కొండా మురళితోపాటు పలువురు నాయకులు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. వీరంతా బేషరతుగా కాంగ్రెస్‌లో చేరాల్సి ఉందని ఆయన అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షోకాజ్ నోటీసు గురించి అడుగగా ‘ఎవరూ లక్ష్మణరేఖ దాటినా క్రమ శిక్షణ చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది’ అని బదులిచ్చారు. రాష్ట్రానికి చెందిన చిన్నాపెద్దా నేతలందరూ సమష్టిగా పార్టీ విజయం కోసం కృషి చేయాలని చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిపై వేటు తప్పదని కుంతియా హెచ్చరించారు.
ఒక కుటుంబానికి ఒక్క సీటు అంశంపై కూడా చర్చ జరిగిందా? అని ఒక విలేఖరి అడగ్గా ‘అవన్నీ అంతర్గత విషయాలు. వాటి గురించి బయట మాట్లాడవలసిన అవసరం లేదు’ అని ఉత్తమ్ సమాధానం ఇచ్చారు.
జానారెడ్డి వివరణ
తన కుమారుడి సీటు గురించి చర్చించేందుకు తాము సోమవారం ఢిల్లీకి రాలేదని కే జానారెడ్డి వివరించారు. సొంత పనులపై రాజధానికి వచ్చి వెంటనే వెంటనే వెళ్లిపోయామని ఆయన పేర్కొన్నారు. ‘మేం వ్యాపార పనులపై ఢిల్లీకి వచ్చివెళితే మీరు మాత్రం ఏవేవో ఊహించుకుని వార్తలు రాశారు’అని ఆయన ఆవేదన చెందారు. పార్టీ అధినాయకత్వం పిలుపు మేరకు శాసన సభ ఎన్నికల ఏర్పాట్ల గురించి చర్చించేందుకు మంగళవారం మళ్లీ ఢిల్లీకి వచ్చామని ఆయన తెలిపారు. ఒక కుటుంబానికి ఒకే సీటు అనే మాట వినిపిస్తోందని, మరి మీ కుమారుడి సీటు సంగతి ఏమిటని ఒక విలేఖరి అడుగగా జానారెడ్డి సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.