జాతీయ వార్తలు

అట్టుడికిన శబరిమల....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* తెరచుకున్న ఆలయం.. పోటెత్తిన భక్తులు
నీలక్కల్/పంబ (కేరళ), అక్టోబర్ 17: శబరిమల ఆలయం వద్ద బుధవారం యుద్ధవాతావరణం నెలకొంది. రోజంతా నిరసన కార్యక్రమాలతో అట్టుడికిపోయింది. లాఠీచార్జీలు, దాడుల మధ్య అయ్యప్ప స్వామి ఆలయాన్ని తెరిచారు. మహిళలు ఆలయ ప్రవేశాన్ని అడ్డుకునేందుకు హిందూ సంస్థల కార్యకర్తలు, నిరసనకారులు పెద్దఎత్తున శబరిమల చేరుకున్నారు. కవరేజీకి వెళ్లిన పాత్రికేయులపై దాడులు జరిగాయి. అయ్యప్ప భక్తులు ముఖ్యంగా యువతులు ఆందోళనలో పాల్గొన్నారు. శబరిమల వెళ్లే రహదారుపై బైఠాయించారు. అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తూ సుప్రీం కోర్టు తీర్పునివ్వడం, దాన్ని తూ.చ తప్పకుండా అమలుచేస్తామని కేరళ వామపక్ష ప్రభుత్వం ప్రకటించడంతో రాష్టమ్రంతటా హిందూ సంస్థలు ఆందోళన చేపట్టాయి. కేరళ ప్రభుత్వం దీనిపై రివ్యూ పిటిషన్ వేయకపోవడం అయ్యప్ప భక్తుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 28 తీర్పు వెలువడినప్పటి నుంచీ హిందూ సంస్థలు ఏదో రూపంలో ఆందోళన తెలుపుతూనే ఉన్నాయి. నీలక్కల్‌లో బుధవారం ఉదయం నుంచే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెచ్చిపోయిన నిరసనకారులు మహిళా జర్నలిస్టులపై దాడులకు దిగారు. పోలీసులపైనా రాళ్లవర్షం కురిపించారు. బారికేడ్లు ఏర్పాటు చేసినా ఫలితం కనిపించలేదు. నాలుగు జాతీయ వార్తా చానళ్ల వాహనాలను ధ్వంసం చేశారు. కాషాయ దుస్తులు ధరించిన నిరసన కారులు చానళ్ల వాహనాల వెంటబడి మరీ దాడులు చేశారు. పంబా నుంచి నీక్కల్ వెళ్లే దారిపై యుద్ధవాతావరణం కనిపించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 40 ఏళ్ల మాధవి అనే మహిళ అయ్యప్ప దర్శనం చేసుకోడానికి విఫలయత్నం చేశారు. నెల రోజుల పూజల కోసం బుధవారం ఆలయం తెరుచుకుంటుందని తెలిసి కుటుంబ సభ్యులతో కలసి ఆమె శబరిమల మెట్లపై వెళ్లారు. అయితే నిరసన కారులు వారిని వెనక్కి లాగేశారు. పోలీసు భద్రత నడుమ ఆమె పంబ చేరుకున్నారు. ఊహించినట్టుగానే భారీగా అయ్యప్ప భక్తులు శబరిమల చేరుకున్నారు. పోలీసులు వందలాది మంది మోహరించారు. కీలక ప్రాంతాలైన నీలక్కల్, పంబ, ఇరుమేలీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కేరళలోని అలప్పుజాకు చెందిన లిబే అనే మహిళ శబరిమల ఆలయ ప్రవేశానికి విఫలయత్నం చేశారు. ఆమెను పాతానమ్‌తిట్ట బస్ టెర్మినల్ వద్ద ఆపేశారు. అతి కష్టంమీద పోలీసులు ఆమెను వెనక్కి పంపేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ఆందోళనకారులకు మద్దతుగా నిలిచారు. బీజేపీ నేతలు పంబలో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కే సుందరేశన్, ఎంటీ రమేష్, ఓభా సురేంద్రన్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నీలక్కల్‌లో అయ్యప్ప భక్తుల ఆందోళన కార్యక్రమాలకు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కే సుధాకరన్ సంఘీభావం తెలిపారు. ప్రతిపక్షాలు రాజకీయ ప్రయోజనాలను ఆశించి భక్తులను రెచ్చగొడుతున్నారని రాష్ట్ర దేవాదాయ మంత్రి కే సురేంద్రన్ ఆరోపించారు. మూడు నెలలపాటు జరిగే మండలం-మకరవిలక్కు ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. నవంబర్ 17న శబరిమల ఆలయ ప్రాంగణంలోని సన్నిధానంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ లబ్ధికోసం రాష్ట్రంలో శాంతికి విఘాతం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయని, ప్రభుత్వం కూడా రాజకీయంగానే దాన్ని ఎదుర్కొంటుందని మంత్రి ప్రకటించారు. కాగా బుధవారం పలువురు నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. అహింస, కుల, రాజకీయ రహితంగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం అణచివేస్తోందని అయ్యప్ప ధర్మసేన అధ్యక్షుడు ఈశ్వర్ ఆరోపించారు. పోలీసులు ఈశ్వర్‌నూ అరెస్టు చేసి పంబ పోలీసు స్టేషన్‌కు తరలించారు.