నెల్లూరు

ఈరోజు నాది! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం అయినందున నెల్లూరు చిల్డ్రన్స్ పార్కు సందడిగా ఉంది. అరుణోదయం అందాలు తనివితీరా చూడాలనిపిస్తోంది. పిల్లగాలులు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి.
రాధ జైంట్‌వీల్ దగ్గరగా పచ్చిక మీద కూర్చొని, కేరింతలు కొడుతూ ఆడుకొనే పిల్లల్ని, జంటలు, జంటలుగా తిరిగే భార్యాభర్తల్ని చూస్తుంది. తనూ భర్త పిల్లలతో ఆనందంగా గడపాలని కలలుగంటూ ఉండేది. కానీ మ్యాన్ ప్రపోజస్ గాడ్ డిస్పోజస్; గతాన్ని నెమరువేసుకొంటూంది. ఆలోచనలకి అంతరాయం కలిగిస్తూ కరెంట్ పోయింది. అప్పుడే ఒక తనకు కొద్దిదూరంలో కూర్చున్నారు.
‘‘నిజం డార్లింగ్, నీవంటే నాకిష్టం’’ అతనన్నాడు.
‘‘ఎదురుగా ఉంటే అందరూ అనే మాటే’’ ఆమె అంది.
‘‘నీవు ఎక్కడున్నా నా మనసులోనే ఉంటావు’’
‘‘ఊ...’’
‘‘ఆఫీసుకెళ్తే ఫైల్లో ఏముందో కనబడదు’’
‘‘ఏం’’
‘‘నీవు నావైపు చూస్తున్నట్లుగా ఉంటుంది’’
‘‘ఓ.. ఏ’’
‘‘కాదు రియల్’’
‘‘ఇంకా...’’4
‘‘క్యాంటన్‌కెళ్తే నీవు లేని లోటు’’
‘‘మస్కా కొట్టడంలో మీరు అందవేసిన చెయ్యి’’
‘‘నిజం చెప్తున్నా, నిద్రపోదామంటే కుదరదు! పిల్లో పట్టుకొని నీవని భ్రమిస్తూ ఉంటాను’’.
కిలకిలా నవ్విందామె.
అంతలో కరెంట్ వచ్చింది
ఆ వెలుగులో వాళ్లిద్దర్నీ చూసింది రాధ.
అంతే!
షాక్ తిన్నట్లయింది. అతను పార్థు.
రాధ ముఖమంతా ఎర్రగా కందిపోయింది.
పళ్లుకొరికింది. కళ్లల్లో కసి, ఏం చేయాలి!
నా మనసుకు శాంతి కలగాలంటే ఏం చేయాలి. అప్పుడే వెళ్లి అతని గొంతు నులిమి చంపేయాలనుకంది. ఊహు.. వీలుకాదు. క్యాంటీన్‌లో బాకు తీసుకుని కసితీరా పొడిచేయాలనుకొంది. కానీ తన ఆలోచన ఫెయిల్ అయితే.. తల వేడెక్కసాగింది. అంతలో..
‘‘ఓ..కే.. నీ సెల్ నెంబర్ మారిందన్నావు! చెప్పు! లాడ్జికెళ్లిన తర్వాత నీ స్పీడ్‌కి బ్రేక్ వేయటమే కష్టం! మిగతావి ఏం జ్ఞాపకముంటాయి!’’ ఆమె నవ్వుతూ అంది.
అతను సెల్ నెంబరు చెప్పాడు.
రాధ కూడా నెంబర్ నోట్ చేసుకుంది.
అప్పుడే తళుక్కున మెరిసింది ఓ ఐడియా.
పథకం పకడ్బందీగా చేయాలనుకుంది.
వాళ్లు వెళ్లిపోయారు.
తనూ బయలుదేరింది.
***
పార్థు మూవ్‌మెంట్స్ అన్నీ గమనిస్తుంది రాధ. ఒక ఆదివారం చిల్డ్రన్స్‌పార్కు, మరో ఆదివారం దర్గామిట్ట బోటింగ్. ఒంటరిగా కనబడే లేడీస్‌కి లైన్ వేసి తనదారికి మళ్లించడం. సమయం కోసం ఎదురుచూస్తోంది రాధ.
ఒకరోజు దర్గామిట్ట బోటింగ్ కోసం గుంపులు గుంపులుగా జనాలున్నారు. వాళ్లల్లో పార్థుని చూసింది. హ్యాండ్‌బ్యాగ్‌లోంచి బురఖా తీసి ముసుగేసింది. పార్థు పక్కనే వెళ్లి నిలబడింది.
‘‘హలో! చాలాసేపటి నుండి ఉన్నారా?’’ అంది.
‘‘నో..నో.. జస్ట్‌యిప్పుడే వచ్చాను! మీరు...’’
‘‘నేనీ నగరానికి కొత్త, బోటింగ్ అయిన తర్వాత రైల్వేస్టేషన్‌కెళ్లాలి!’’.
‘‘నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను, డోన్ట్‌వర్రీ’’
‘‘్థంక్యూ సర్!’’ అంది
బోట్‌లో రాధ, పార్థు ఎక్కారు.
‘‘ఇఫ్ యు డోన్ట్‌మైండ్.. రుూ పెడల్‌బోట్ తొక్కడం నావల్ల కాదండీ!’’ అంది
‘‘మైహూనా!’’ అన్నాడు
‘‘ఫెడల్ తొక్కేందుకా లేక..’’
‘‘దైనికైనా నేను రడీ’’
‘‘మీ యిష్టం’’ అంది
పిట్టవలలో పడింది అనుకున్నాడు పార్థు!
‘‘ఈ నైట్‌కి మీకు కంపెనీ ఇవ్వనా’’, అన్నాడు
‘‘మీరు నాగైడ్ అయినప్పుడు మీరేం చెప్తే అదే’’
***
అదొక నీటైన లాడ్జి! రాధ బురఖా తీసింది. ముంగురులు మొఖం మీదికి వాలి ఉన్నాయి. మెడలో ముత్యాలహారం. బఠాని గింజంత బొట్టు! షిపాన్ చీర. అచ్చం పల్లెటూరి పిల్లలా ఉంది.
‘‘నిన్ను చూస్తుంటే యింకా యింకా చూడాలనిపిస్తోంది!’’ అన్నాడు పార్థు రాధని దగ్గరికి తీసుకుంటూ.
‘‘ఏం చూడాలనిపిస్తోంది’’
‘‘నీ కళ్లు, పెదాలు...’’ అంటుంటే -
‘‘ఊరకా కబుర్లేనా.. లేక....’’ పార్థు చేతిని తన యెదపై తాకిస్తూ అంది. టేబుల్‌పై మ్యాన్‌సన్‌హౌస్ బ్రాందీ, సోడా, కాజునట్స్! పార్థు రెండు గ్లాసుల్లో డ్రింక్ పోసి సోడా కలిపాడు. రాధ ఒక గ్లాసు తీసి పార్థుకందించింది. తనూ ఒక గ్లాస్ తీసి రాధకందించాడు.
‘‘ఇంత అందాన్ని చూస్తూ నేనాగలేను’’ గ్లాసు పూర్తయి రెండోగ్లాసు తీసుకుంటూ అన్నాడు.
రాధ పయిట జారింది.
పార్థు లైట్ ఆర్పేశాడు.
ఆవేశం కట్టలు తెంచుకుంది. పార్థు ఏదో మాట్లాడబోయాడు. రాధ పెదాలు అడ్డుపడ్డాయి.
***
లైట్ వేసింది రాధ. ఈసారి గ్లాసుల్లో తనే మందు పోసింది. పార్థు చూడకుండా ఒక గ్లాసులో పౌడర్ వేసింది. ఆ గ్లాస్ పార్థుకిచ్చి మరో గ్లాసు తను తీసుకొంది.
‘‘ఈ తృప్తి మరువలేను’’ అన్నాడు.
‘‘నన్ను!’’
‘‘నిన్ను కూడా! రాధ యిచ్చిన మందు తాగుతూ
‘‘నీ చేత్తో మందు తీసుకుంటుంటే కిక్ ఎక్కువవుతున్నట్లుంది’’ అన్నాడు మరలా..
అంతవరకూ సౌమ్యంగా మాట్లాడిన రాధ..
‘‘నీకు నేను గుర్తురాలేదా?’’ ఆమె కంఠంలో కరకుదనం కనిపించింది. రాధ మరో గ్లాసు డ్రింక్ తీసుకుంది. పార్థుకి కూడా యిచ్చింది. పార్థు కళ్లు మత్తుగా మూతలు పడుతున్నాయి.
‘‘రేయ్... నేనెవరో తెలుసా!’’ ఒక్కసారిగా రాధ ఉచ్ఛారణ మారిపోయింది. ‘‘ఎవరు?’’ ముద్దముద్దగా మాట్లాడాడు.
‘‘నేను.. నేను..’’
‘‘..ఊ.. నువ్వు..’’
‘‘ఆరోజు గుర్తుందా! తిరుపతిలో సాయంత్రం కాలేజి నుండి వస్తున్నప్పుడు.. నీవు.. నీ ఫ్రెండ్!’’
‘‘నువ్వు...నువ్వు..!’’
‘‘అవును! నేనే! చేతులెత్తి దణ్ణం పెట్టాను! కాళ్లు పట్టుకున్నాను! కొంచెమయినా కనికరం లేకుండా నీవు నీతో మరొకడు నా నిండు జీవితాన్ని నాశనం చేశారుకదరా!’’ గాద్గికంగా మాట్లాడుతూ...
‘‘అయినా ఆ రోజు నీది! ఈ రోజు నాది’’
‘‘అవునురా! నీ కోసం ఎంతోకాలంగా తిరుపతిలో ఎదురుచూశాను! చాలాచోట్ల వెదికాను! ఇప్పటికి నా ఆశ నెరవేరింది!’’
‘‘ఏం చేస్తావ్! పోలీసులకి ఫోన్ చేస్తే ఇద్దర్ని బొక్కలో తోస్తారు’’
రాధ పెద్దగా నవ్వింది.
‘‘నో..నో.. పోలీసుల వరకు అవసరం లే! కొంచెంసేపట్లో నీ జీవితం అంతం కాబోతోంది’’ అంది.
‘‘ఏం మాట్లాడుతున్నావ్! నీకేమయినా పిచ్చి పట్టిందా! లేక మందు పనిచేస్తోందా!’’
‘‘మందు ఎక్కువయి కాలుకింద పెట్టలేని స్థితిలో నీవున్నావ్! నీకు నేను సుఖాన్ని అందించాననుకుంటున్నావ్ కదూ! సుఖం అందించి నీ లైఫ్‌ని అంతం చేశాను. అవునురా.. నీలాంటి కామాంధులు చట్టానికి భయపడరు. కారాగార శిక్ష అంటే కాఫీ హోటల్‌కెళ్లి వచ్చినంత ఫ్రీగా ఫీలవుతున్నారు. నీలాంటి వాళ్లు నైతిక విలువలను పట్టించుకోరు! అందుకే సరైన శిక్ష విధించాను. నీకిచ్చిన మందులో పాయిజన్ కలిపాను. ఇక ఎంతోసేపు బతకవు’’ అంటూ పెద్దగా నవ్వసాగింది.
బెడ్‌మీద నుంచి లేచి నిలబడబోయి పడిపోయాడు.
బురఖా వేసుకొని లాడ్జి నుండి బయటికి వచ్చింది రాధ.
ఈరోజు నాది!

- గుర్రాల రమణయ్య
చరవాణి : 9963921943

స్పందన

వాస్తవానికి దగ్గరగా
శత్రు కవుల సమ్మేళనం
గత వారం మెరుపులో ప్రచురితమైన శత్రుకవుల సమ్మేళనం కథ చాలా బాగుంది. ఈరోజుల్లో రచయితలు, కవుల తీరుతెన్నులను ఎండగట్టింది. ముఖ్యంగా పబ్లిసిటీ కోసం పాకులాడే రచయితలు నేడు ఎక్కువయ్యారు. అలాంటి వారే వేదికలు ఏర్పాటు చేసి బాజా వాయించుకుంటున్నారు. కథ మొత్తం సరదాగా సాగింది. కథలో ఇంకొంచెం హాస్యం ఉంటే బాగుండేది. రచయిత్రి అనురాధ రామకృష్ణ గారి గత కథ ఈడు-జోడుతో పోలిస్తే ఈ కథలో కొంచెం హాస్యం తక్కువే. మరిన్ని వినోదాత్మక కథలు రాయాలని కోరుతూ రచయిత్రికి మా అభినందనలు.
- పమిడి రాఘవేంద్రరావు, కావలి
- శైలజ, నెల్లూరు
- సత్తిబాబు, బివి నగర్, నెల్లూరు

అమరావతి కవిత బాగుంది
గత వారం మెరుపులో ప్రచురితమైన అమరావతి కవిత బాగుంది. అమరావతి వైభవాన్ని వర్ణించిన తీరు బాగుంది.
- సరళ, మార్కాపురం
- ఒమ్మిన సత్యనారాయణ, చిత్తూరు

సాధ్యమా! సాధ్యమేనా?
సూపర్
మెరుపులో యర్రాబత్తిన మునీంద్ర గారు రాసిన కవిత సాధ్యమా! సాధ్యమేనా చాలా బాగుంది. కవిత మొత్తం వినూత్నంగా సాగింది. నేటి సమాజంలో ప్రజల్ని మోసం చేసే కొన్ని వర్గాలను ఎండిగట్టిన తీరు బాగుంది. యువత మేల్కొంటేనే దేనికైనా పరిష్కారం లభిస్తుంది. కవితలో వాడిన పదాల అరమరిక పొందికగా కుదిరింది. కవితను అర్ధవంతంగా తీర్చిదిద్దిన రచయితకు ధన్యవాదములు.
- బాలచంద్ర, నెల్లూరు
- సుబ్బు రత్నాకర్, అద్దంకి

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

మనోగీతికలు

సామాన్యుడి గోడు
సగటు మనిషి
బ్రతుకు నేడు
కుక్క చించిన
విస్తరవుతున్నది చూడు
పిరంలోనే ఆదాయం
అధికం అన్నట్టు
వ్యాపారస్తులు సరుకులను దాచి
పేద బిక్కి దగ్గర ధనం దోచుకుంటూ
సర్వభోగాలు అనుభవిస్తున్నారు
పేదవారు ఏదీ తినలేక
ఏమీ కొనలేక
నోరు కట్టుకుని
పైకి చూచి పెడుతున్నాడు గావుకేక
చేరువులో వుంది మీకు
ప్రమాదం రాక
అధికారులకు కనిపించలేదా
మీకు మనసు లేదా
ఏది కొనబోయినా నిప్పు
తాకితే కాలుతుంది పప్పు
ప్రభుత్వం ఆదమరచి
చేస్తున్నది తప్పు
ముందున్నది పెనుముప్పు
చేయండి కనువిప్పు

- జంజం కోదండరామయ్య
చరవాణి : 8785938861

పసిపాదాలకు
పారాణి వద్దు
పుస్తకాల సంచి పక్కనబెట్టి
పుస్తెలతాడు పలుపుతాడులా
మెడలో వేశారు

కళ్లు తుడవకుండా
సంసార సాగరాన్ని
దాటమన్నారు
చెడ్డీల ప్రాయంలో
బతుకు చెరసాలయ్యింది
శిక్ష జీవితకాలం
బాల్యానికి ఇంకో బాల్యం తోడై
ఆటబొమ్మలను పక్కనబెట్టి
జోలపాట నేర్చుకుంది

అచ్చులు, హల్లులు తెలియని బాల్యానికి
పెద్దబాలశిక్ష వేశారు
బతుకు పుస్తకాన్ని బట్టీ
వేయమన్నారు
ముక్కుపచ్చలారని వయస్సు
ముత్తయిదవ అయ్యింది

నిలువ నీడ లేదు
నిరుద్యోగం చేదోడు
సంతానం చేంతాడు

అమ్మమ్మ చెప్పిన
నాయకురాలు నాగమ్మ కథలు
బిడ్డలకు వీరత్వం ఉగ్గుపాలు నేర్పింది

చందమామ రావే
జాబిల్లి రావే అంటూ
బిడ్డలకు గోరుముద్దలు లేవు
అయినా అక్షరాలు
తరగతి గదులు దాటి
పరిశోధనా ప్రపంచంలో
పట్టుగొమ్మలు అయినారు
పాలు మరవని పాపాయికి
పెళ్లి తంతులు వద్దు

- దుగ్గినపల్లి ఎజ్రాశాస్ర్తీ
ఒంగోలు
చరవాణి : 80962 25974

పచ్చని హత్య
పర్యావరణమనే
ప్రకృతికాంతను
స్వార్థపరుడైన మనిషి
పట్టపగలు పచ్చిగా హత్యచేస్తున్నాడు
వాడి ఉనికిని, ఊపిరినీ కాపాడే
ఉన్నతవనరుల్ని
ఊహకందని రీతిగా ఊడ్చేస్తున్నాడు
ప్రాణభిక్ష పెట్టే ప్రాణమిత్రుల్ని
పాపపు సొమ్ము కోసం
పతనం చేస్తున్నాడు..పరాజయం పొందుతున్నాడు
నీరు, గాలి, ఆహారాలను
నిర్దాక్షిణ్యంగా నిర్జీవం చేస్తున్నాడు
పరిసరాల పరిశుభ్రతను
పాపకార్యంగా ప్రక్కకు నెట్టేస్తున్నాడు
ప్రపంచమేమైనా ఫరవాలేదు
ప్రతీ పనిలో ‘డబ్బు’ ప్రత్యక్షమైతే
చాలనుకుంటున్నాడు
డబ్బనే జబ్బుకు వీడు కాసె్తైనా దూరం గాకపోతే
లబ్బు డబ్బని కొట్టుకొనే ఎన్నో గుండెలు
ఆగిపోగలవు
పట్టుబట్టి పచ్చదనానికి, పరిశుభ్రతకు
వీడు పాటుపడకపోతే
తెలిసీ తెలిసీ ఉదాసీనత వహిస్తే
మనిషి మనుగడ మంట గలుస్తుంది
మానవలోకం మారణ హోమం అవుతుంది
అందుకే అందరం చేరుూ చేరుూ కలిపి
అందమైన సమాజాన్ని నిర్మిద్దాం
ఆహ్లాదంగా జీవిద్దాం

- పచ్చా పెంచలయ్య, మహమ్మదాపురం, పొదలకూరు, చరవాణి : 9912822341

డబల్ ధమాకా!
ఆదివారం -
ఉదయం నాలుగింటికే నానిగాడి అలారం మోత
నలభైసార్లు దుప్పటిలాగితేనే..
వాడికి మేలుకొలుపు పాడితే కానీ
ట్యూషన్‌కి వెళ్లడు
అయిదింటికే .. శ్రీవారు అపర ‘‘టెండూల్కర్’’ వేషంలో
క్రికెట్‌కి తయారు, బ్యాట్‌తో
మరి నాకు ‘‘కాఫీ’’ అంటూ వెంటబడతారు
ఆదివారం నన్ను లేపే ప్రయత్నం మానండి అంటూ
గారాల పట్టి ‘గది’ తలుపులు బిగించేస్తుంది
ఒక మెసేజ్‌తో పనిమనిషి సెలవు పెట్టేస్తుంది
వారం అంతా గడిచింది అనడానికి
ఇల్లంతా చిన్న ‘యుద్ధ్భూమి’ తలపిస్తుంది
ఎక్కడవక్కడ సర్దేసి.. ఎక్కడవక్కడవి తోసేస్తే
ఒక చిన్న ‘సీజ్‌ఫయిర్’ కనిపిస్తుంది
చీర కుచ్చెళ్లు దోపి రంగంలోకి దిగితే
భరతనాట్యం, కథాకళి చివరికి వలయాలు వలయాలు
తిరుగుతూ - కథక్ నృత్యం చేసేస్తే
ఇల్లు ఓ కొలిక్కి వస్తుంది
శనివారం+ ఆదివారం వెరసి బండెడు అంట్లు
తోముతుంటే..రాజస్థాన్ వాయిద్యాల మోత
ఆపైన ఆదివారం పిల్లల ‘ఫర్‌మాయిషీ’ వంటలు
శ్రీవారికి సాంప్రదాయ వంటలు
హమ్మయ్య... ముగిసింది అనుకునే లోపలే
ఎక్కడి నుంచో ఎగిరి వచ్చిన చుట్టాలు
‘మీవాళ్లే’ అంటూ శ్రీవారి ‘దెప్పిపొడుపులు’
లేని.. శరీరానికి శక్తి ఎక్కించి,
ఏడవలేని ముఖానికి..నవ్వులు పులిమి
మళ్లీ.. ‘ వంటయింటి’లోకి అడుగు పెట్టాల్సిందే
అప్పుడే పెళ్లి చేసి అలసిపోయిన పెద్దమనిషిలా
వంటింటి గట్టు పక్కనే నిలబెట్టిన పెద్ద కుక్కర్‌ని
పోయిమీదకి ఎక్కిస్తే..
అలిగి.. ఆలస్యంగా కూతలు కూస్తుంది అది.
భోజనాలు అయ్యాక విశ్రాంతికి..నడుం వాల్చాలంటే..
కాలింగ్ బెల్ మోత..
మాకెవరికీ సంబంధం లేదన్నట్టు అందరూ నటిస్తారు
పేపర్ బిల్, డిష్‌బిల్, వగయిరాలు
అంతలోనే ‘‘టీ టైమ్’’
చుట్టాలని ‘ఎంగేజ్’ చేయమంటే
మాకు ‘బోర్’ అంటూ .. పిల్లల నిరసనలు
అస్తమానమూ మొబైల్ మీద ఒంటి చేత్తో
హార్మోని వాయించే వాళ్లకి -
మనిషి మాటలు, ఊసులెందుకు..
ఎపుడయిందో.. ఇట్టే ‘పది’ మీదకి చేరింది
కాలం ముల్లు
అలసటగా మంచం మీదకి చేరినపుడు
ఆలోచనలు
ఇవన్నీ.. కాలచక్రంలో కలిపేస్తూ
ఏమైనా పొందడానికా..
ఏమైనా పోగొట్టుకోవడానికా.. అని
అది వందడాలర్ల ప్రశ్న. ప్రతి గృహిణీ వేసుకునే
జవాబు లేని ప్రశ్న?
నిన్న.. రేపులో కలిసి పోకముందే...
నా ఒడిలోకి రా.. అంటూ
నిద్రాదేవి కౌగిలించుకుంటుంది.
(ఉద్యోగస్తురాలైన గృహిణి
ఆదివారం పడే పాట్లు)

- గోవిందరాజు సుభద్రాదేవి, 9848627158

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

email: merupunlr@andhrabhoomi.net

- గుర్రాల రమణయ్య