శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా కొవ్వొత్తుల ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోట, జనవరి 28: ప్రత్యేక హోదా కోరుతూ వైకాపా నాయకుడు పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 1000 మందితో కోటలో శనివారం సాయంత్రం భారీగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రత్యేక హోదాను సాధించి తీరుతామని అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హోదాను మరచి, ప్యాకేజీలతో సరిపెట్టుకోవడం దారుణమన్నారు. ప్యాకేజీల వల్ల రాష్ట్రానికి ఒరిగేది ఏమీలేదన్నారు. తమ నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణను చూసి ఓర్వలేకనే దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రజా సమస్యలపై తాము ఎప్పుడూ పోరాటం చేస్తామన్నారు. కోట గాంధీబొమ్మ వద్ద నుంచి సాగిన కొవ్వొత్తుల ప్రదర్శన విద్యానగర్ గాంధీబొమ్మ వద్ద వరకు సాగింది. ప్రదర్శన అనంతరం హోదా కోరుతూ నిరసనగా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ప్రదర్శనలో వైసిపి నాయకులు పాదర్తి రాధాకృష్ణారెడ్డి, టింకర్ రవి, శ్రీకాంత్, హరిరెడ్డి, వెంకటాద్రితో పాటు సుమారు వెయ్యి మంది వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అదుపులో స్వైన్‌ఫ్లూ
ఇద్దరు చిన్నారులు క్షేమం
తడ, జనవరి 28: మండలంలోని రామాపురం పిహెచ్‌సి పరిధి పూడి గ్రామంలో స్వైన్‌ఫ్లూ సోకిన చిన్నారుల పరిస్థితి అదుపులోకి రాగా మరో చిన్నారికి చికిత్స అందిస్తున్నారు. చెన్నై మెహతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇద్దరు చిన్నారులైన కావ్యశ్రీ, దర్శినీల పరిస్థితి మెరుగుపడిందని, హేమవర్షిణి మాత్రం ఇంకా చికిత్స పొందుతున్నట్టు వైద్యులు తెలిపారు. ఈక్రమంలో పూడి గ్రామంలో రామాపురం వైద్యాదికారిణి దేదీప్య గ్రామంలోని ఇంటింటికి వైద్య సిబ్బందితో వెళ్లి మందులను పంపిణీ చేశారు. గ్రామంలో పారిశుద్ధ్యంపై గ్రామస్థులు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. గ్రామంలో తాగునీటి కొళాయిల వద్ద మురుగునీరు నిల్వ ఉండటాన్ని గుర్తించి వాటిని శుభ్రం చేయించాలని సర్పంచ్‌ని కోరారు.
‘ఓజిలిలో స్వైన్‌ఫ్లూ లేదు’
ఓజిలి: ఓజిలి మండలంలో ఎలాంటి స్వైన్‌ఫ్లూ కేసు నమోదు కాలేదని శనివారం ప్రోగ్రామింగ్ అధికారిణి రమాదేవి తెలిపారు. ఏదేమైనప్పటికీ స్వైన్‌ఫ్లూ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని మండల ప్రజలకు సూచించారు. ముఖ్యంగా పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకొనాలన్నారు. ఓజిలి మండలంలో ఇద్దరికి స్వైన్‌ఫ్లూ వ్యాధి సోకినట్టు ఓ దినపత్రికలో వచ్చిన వార్త అవాస్తమని అన్నారు. దీనిపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె సూచించారు.

నెల్లూరు ఖజానాలో నగదు గోల్‌మాల్
* రూ.కోట్లలో నగదు గల్లంతు?
* ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి వద్ద రూ.6 లక్షలు రికవరీ
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, జనవరి 28: నెల్లూరు ఖజానా శాఖ కార్యాలయంలో ప్రజలకు, ఉద్యోగులకు చెందాల్సిన సొమ్మును తన కుటుంబ సభ్యుల ఖాతాలోకి ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మళ్లించుకున్న సంఘటన కలకలం రేపింది. ఈ విషయాన్ని పసిగట్టిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టగా ఈ తరహా గోల్‌మాల్ వ్యవహారాలు 2014 నుంచి ఈ కార్యాలయంలో జరుగుతున్నట్లు వారి దృష్టికి వచ్చినట్లు సమాచారం. అయితే అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించనప్పటికి కోట్లలో కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. సేకరించిన సమాచారం మేరకు.. నెల్లూరు ట్రెజరీ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసే సుబ్బయ్య చాలాకాలంగా కార్యాలయంలో ప్రతి పని విషయంలోనూ అధికారులకు చేతిలో కర్రలా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఈక్రమంలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు, అగ్నిప్రమాద నష్టపరిహారాలు, ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వారి ఖాతాలకు చెల్లించకుండా తన కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించడం మొదలుపెట్టాడు. ఈవిధంగా సుమారు రూ.18 లక్షల మేర తన భార్య, ఇతర కుటుంబ సభ్యుల ఖాతాలో జమ చేశాడు. లబ్ధిదారులు వచ్చిన ప్రతిసారి ఏదోఒక కొర్రీపెట్టి వారిని వెనక్కి పంపేవాడు. మరోవైపు వారందరికీ చెల్లింపులు జరిగిపోయినట్లు ట్రెజరీ ఉన్నతాధికారులు భావిస్తుండడంతో ఇతని వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది. అయితే పరిహారం చెక్కులన్ని ఒకే ఖాతాలో జమవుతుండడం అధికారుల్లో అనుమానానికి బీజం వేసింది. దీంతో ఈనెల 25న గుంటూరు ట్రెజరీ డిడి సురేంద్రబాబు ఇక్కడకు విచారణాధికారిగా వచ్చి గోల్‌మాల్ జరిగినట్లు నిర్ధారించడంతో పాటు సుబ్బయ్య వద్ద నుంచి రూ.7 లక్షలు రికవరీ చేశారు. అతని భార్య, బావమరిది బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు.
రూ.కోట్లలో జరిగినట్లు అనుమానం?
అయితే ఖాజానా కార్యాలయంలో కేవలం ఎస్‌టిఓ అంతకన్నా పై స్థాయి అధికారులకు మాత్రమే ఖజానా ఆన్‌లైన్ ఖాతాకు సంబంధించి పాస్‌వర్డ్ తెలిసి ఉంటుంది. ఒక సాధారణ పొరుగుసేవల ఉద్యోగికి ఆ పాస్‌వర్డ్ ఎలా తెలిసిందనే విషయంపై అధికారులు విచారణ ప్రారంభించారు. తీగ లాగితే డొంకంత కదిలినట్లు గతంలో జిల్లాలో పనిచేసిన కొందరు అధికారుల సహకారంతోనే ఈ తంతు జరిగిందని, గోల్‌మాల్ అయిన సొమ్ము రూ.కోట్లలో ఉంటుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రకాశం జిల్లా డిడి లక్ష్మి విచారణ అధికారిగా నెల్లూరు ట్రెజరీ కార్యాలయానికి శనివారం వచ్చి పలు కీలక రికార్డులను తన వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. విషయం బైటకు పొక్కితే ఇప్పటికే అవినీతి శాఖగా పేరొందిన ఖజానా శాఖకు మరింత అప్రతిష్ట వచ్చే అవకాశం ఉన్నందున గుట్టుచప్పుడు కాకుండా విచారణ జరపడంతో సుబ్బయ్య వద్ద నుంచి మిగతా సొమ్ము రికవరీ చేసేందుకు అతనిపై అధికారులు ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. అతడు కూడా సోమవారం మిగతా సొమ్ము కట్టేందుకు గడువు కోరినట్లు సమాచారం. అయితే సుబ్బయ్య చేసిన తరహాలో మరెందరు ఉద్యోగులు కార్యాలయంలో ఎంతమేర ప్రభుత్వ సొమ్మును కాజేశారో తెలుసుకునేందుకు రాష్టస్థ్రాయి అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరపాల్సి ఉంది.

కృష్ణం వందే జగద్గురుం
* నగరంలో వైభవంగా శ్రీ జగన్నాథ రథయాత్ర
* కృష్ణ నామస్మరణలో భక్తజనం
నెల్లూరు, జనవరి 28: ‘రథేచ వామనం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే’... రథం మీద ఆరూఢులైన జగన్నాథుని దర్శించుకున్న వారికి మళ్లీ జన్మ ఉండదని, మోక్షగాములవుతారని, ఒకవేళ వారు మరో జనే్మ కోరుకుంటే అది సిద్ధిస్తుందని దీనర్థం. తన భక్తుల వద్దకు తానుగా శ్రీ జగన్నాథుడు విచ్చేసి వారికి మోక్షజ్ఞానం ప్రసాదించాడు. ‘హరేకృష్ణ హరేరామ’ స్మరణతో నెల్లూరు నగర వీధుల్లో శనివారం సాయంత్రం నెల్లూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో 6వ శ్రీ జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. స్థానిక హరనాథపురం కూడలిలో సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఈ యాత్ర నగరంలోని విఆర్‌సి కూడలి, పెద్దబజార్, చిన్నబజార్, ట్రంక్‌రోడ్, ఆర్టీసీ బస్టాండ్‌ల మీదుగా కస్తూర్బా గార్డెన్స్ వరకు సాగింది. రథయాత్ర ఆద్యంతం ఎంతో వేడుకగా, కనులపండువగా కొనసాగింది. రథయాత్రను ఆహ్వానిస్తూ యాత్ర సాగే మార్గాల్లో మహిళలు రోడ్లపై రంగవల్లులు తీర్చిదిద్దారు. కోలాటాలు, పండరి భజన, అశ్వాలు ముందు వరుసలో కదిలాయి. వారిని అనుసరిస్తూ కృష్ణ్భక్తులు కృష్ణగీతాల డిజెకు అనుబంధంగా కృష్ణతత్వంలో మైమరచి నృత్యం చేస్తూ తన్మయత్వంలో మునిగిపోయారు. మరికొందరు స్వామివారి ప్రసాదాలు, ప్రతిమలు పంచుతూ సాగారు. చివరన శ్రీ జగన్నాథ రథాన్ని లాగుతూ భక్తులు ముందుకు కదిలారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి రథయాత్ర మొదలు, చివరి వరకు రథాన్ని లాగడం విశేషం. అనంతరం రథయాత్ర ముగింపు స్థలమైన కస్తూర్బా గార్డెన్స్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇస్కాన్ స్వాముల సందేశాలు, జగన్నాథ్, బలదేవ్, సుభద్రల శృంగార దర్శనాన్ని చూసి భక్తులు తరించారు. 66 రకాల వంటకాతో చప్పన్ భోగి నివేదన, హారతి కీర్తన జరిగింది. అనంతరం భక్తులకు భోజన ప్రసాదాలను అందించారు. శ్రీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా ఎటువంటి ట్రాఫిక్ అంతరాయాలు లేకుండా నగర డిఎస్పీ జివి రాముడు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

వేడుకగా శ్రీ వేంకటేశ్వరుని కల్యాణం
నెల్లూరు, జనవరి 28: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణ వేంకటేశ్వరుడిగా మారి వధువులు భూదేవి, శ్రీదేవిలను వివాహమాడిన వేడుకకు స్థానిక దర్గామిట్టలోని టిటిడి కల్యాణ మండపం వేదికగా మారింది. శనివారం స్వామివారి జన్మనక్షత్రమైన శ్రవణానక్షత్ర పర్వదినాన శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. తొలుత స్వామివార్లకు తిరుమంజన కార్యక్రమం 108 కొబ్బరికాయలతో నిర్వహించారు. గోపూజ కార్యక్రమానంతరం అలంకారభూషితుడైన శ్రీవేంకటేశ్వరుడు అమ్మవార్లను వేదార్చకుల వేదమంత్రాల ఘోషల నడుమ, మంగళవాయిద్యాల మేళవింపులో అశేష భక్తవాహిని సమక్షంలో పరిణయమాడారు. ఈ సమయంలో భక్తుల గోవిందనామస్మరణలో కల్యాణ వేదిక మార్మోగింది. ప్రధానార్చకులు వేదగిరి ఫణిశర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కల్యాణ వేడుకను టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ జిల్లా కో ఆర్డినేటర్ ఎం.శ్రీహరి, ధర్మప్రచార మండలి అధ్యక్ష, ఉపాధ్యక్షులు సివి సుబ్రహ్మణ్యం, శేఖర్‌రెడ్డి ఆద్యంతం పర్యవేక్షించారు. కల్యాణ ఘట్టం అనంతరం విచ్చేసిన భక్తులకు స్వామివారి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది.

స్వైన్‌ప్లూ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి:కలెక్టర్
నెల్లూరు కలెక్టరేట్, జనవరి 28: స్వైన్‌ప్లూ వ్యాధి, వైరస్ వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని దర్గామిట్టలో ఉన్న తన క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆయన వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో నలుగురు ఈ వ్యాధి బారిన పడ్డారని అందులో ఇద్దరు డిశ్చార్జి కాగా మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గ్రామ, మండల, జిల్లాస్థాయి వరకు నిశితంగా పరిశీలించి రోజువారీ నివేదికలు సమర్పించాలన్నారు. స్వైన్‌ప్లూ ప్రభావిత ప్రాంతాలలో పందులను తరిమేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 33వేల పొదుపు సంఘాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు, ఎఎన్‌ఎంలు ప్రజలకు అవగాహన కల్పించేందుకు పెద్దఎత్తున ప్రచారం నిర్వహించాలన్నారు. గతేడాది ఆ వ్యాధి సోకిన ప్రాంతాల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ఈనెల 29 నుండి నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో ఈ వ్యాధిపట్ల అవగాహన కల్పించాలన్నారు. 40వేల నివారణ మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయని వ్యాధి ముప్పు ప్రాంతాలలో బాధితులకు అందజేయాలన్నారు. జలుబు, గొంతునొప్పి, దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పులు వ్యాధి లక్షణాలుగా గుర్తించాలన్నారు. బాధితుల కోసం 9618232115 ఫోన్ నెంబరు ఏర్పాటు చేశామని, వైద్య సహాయం అవసరమైనవారు సంప్రదించవచ్చని కలెక్టర్ తెలిపారు.

కేంద్ర సహాయంపై బహిరంగ చర్చకు సిద్ధం
* బిజెపి నేత కర్నాటి సవాల్
నెల్లూరు, జనవరి 28: గత రెండున్నరేళ్లలో రాష్ట్భ్రావృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అందించిన సహకారంపై తాము జనసేన, వైకాపాలతో పాటు ఏ ఇతర పార్టీలతోనైనా బహిరంగ చర్చకు సిద్ధమని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి సవాల్ విసిరారు. శనివారం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ నేత వెంకయ్యనాయుడు పట్ల పవన్‌కల్యాణ్ వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని హితవు పలికారు. తాము కూడా వ్యక్తిగత విమర్శలకు దిగాల్సి ఉంటుందని హెచ్చరించారు. కాల్షీట్, కాల్షీట్‌కు మధ్య పాలిటిక్స్, షాట్ షాట్‌కు నడుమ ట్వీట్‌లతో పవన్‌కల్యాణ్ కాలం వెళ్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాసేవ చేసేందుకు పూర్తి సమయం రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడాలని ఆయన సూచించారు. తనను అభిమానించే యువత మోజును చూస్తూ అదే ప్రపంచంగా ఆయన బతికేస్తున్నారని అన్నారు. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అవసరాలు తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని, వార్తల్లో నిలిచేందుకు ఏదో ఒకటి మాట్లాడడం పవన్‌కల్యాణ్ మానుకోవాలని హితవు పలికారు. ఎన్నికల్లో తమకు మద్దతు తెలిపినంత మాత్రాన ఆయన తనను తాను మేధావిగా ఊహించుకోకూడదన్నారు. కొత్తగా ఉత్తరాది, దక్షిణాది అంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారని అన్నారు. ప్రత్యేక హోదా కోరుకోవడంలో తప్పు లేదని, ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు అందరికి ఉందని, అయితే వ్యక్తిగత విమర్శల జోలికి వస్తే తాము కూడా అదే తరహాలో ప్రవర్తించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు పెళ్లకూరు సురేంద్రరెడ్డి మాట్లాడుతూ పవన్‌కల్యాణ్ అపరిపక్వత లేకుండా చేసిన ఆరోపణలు, విమర్శలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయనెక్కడి కెళ్లారని, రాజ్యసభలో ఆయన అన్న చిరంజీవి పాత్ర ఏమిటో అందరికీ తెలుసునని గుర్తు చేశారు. మంత్రివర్గంలో ఉండి కూడా రాష్ట్రానికి చిరంజీవి ఏమీ చేయలేకపోయాడన్నారు. కామన్‌మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరుతో ఏర్పాటు చేసిన సంస్థ ఇపుడు ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో బిజెపి నాయకులు దువ్వూరు రాధాకృష్ణారెడ్డి, మండ్ల ఈశ్వరయ్య, సమాధి శ్రీనివాసులు, వెంపులూరు భాస్కర్‌గౌడ్, బండారు శ్రీనివాసులు, కాయల మధు తదితరులు పాల్గొన్నారు.

నేడు పల్స్‌పోలియో
పకడ్బందీగా ఏర్పాట్లు
డిఎంహెచ్‌ఓ వరసుందరం వెల్లడి
నెల్లూరుసిటీ, జనవరి 28: జిల్లాను పోలియో రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతిఒక్కరు కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వరసుందరం తెలిపారు. శనివారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో మొత్తం 3 లక్షల 29 వేల 678 మంది ఐదేళ్ల లోపు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. అందులో రూరల్ ప్రాంతంలో 2,35,592 మంది, అర్బన్‌లో 94,086 మందికి పోలియో చుక్కలు వేస్తున్నట్లు చెప్పారు. హైరిస్క్ ప్రాంతాలలో 25,516 మందిని గుర్తించామన్నారు. జిల్లాలో మొత్తం 12 కేంద్రాలలో పోలియో చుక్కల మందులను సిద్ధంగా ఉంచామన్నారు. గతంలో పోలియో చుక్కలు వేసుకున్న పిల్లలకు కూడా వేయించాలని చెప్పారు. తొలి రోజున పోలియో కేంద్రాల వద్ద పిల్లలకు వేస్తామన్నారు. 30,31 తేదీలలో ఇంటింటికి వెళ్ళి వేయనున్నట్లు చెప్పారు. కొన్ని అనివార్య కారణాలవల్ల పోలియో కేంద్రాల వద్దకు రాని వారిని గుర్తించి ఇంటింటికి వెళ్ళి వేస్తారని చెప్పారు. జిల్లాలో మొత్తం 3,050 పోలియో కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మొత్తం 12,200 మంది సిబ్బందిని పోలియో చుక్కలను వేయడానికి ఏర్పాటు చేశామన్నారు. బస్టేషన్, రైల్వేస్టేషన్ ప్రాంతాలలో కూడా ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో డిఎల్‌ఓ రమాదేవి, డిఐఓ జయసింహ, క్షయనివారణ అధికారి సురేష్‌కుమార్, మలేరియా అధికారి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలి:కలెక్టర్
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, జనవరి 28: పోలియో రహిత సమాజాన్ని నిర్మించుకోవాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్ అర్ ముత్యాలరాజు అన్నారు. స్థానిక ఎబిఎం కళాశాలలో శనివారం ఆయన పల్స్ పోలియో ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం దేశవ్యాప్తంగా జరిగే పల్స్‌పోలియో కార్యక్రమంలో జిల్లాలోని 0-5లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతం కావడానికి తల్లిదండ్రుల సహకారం తప్పనిసరని అన్నారు. జిల్లాలో పోలియో వ్యాధికి ఏ ఒక్క చిన్నారి బలికాకూడదని అందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వైద్య శాఖాధికారులను ఆదేశించారు. ఈ ర్యాలీలో జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ సి వరసుందరం, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హరిత, పల్స్ పోలియో స్పెషల్ ఆఫీసర్ ఎడివి లక్ష్మి, మాస్ మీడియో ఆఫీసర్ సుధామణి, వైద్యులు ఆర్‌ఎంపి, పిఎంపి అసోసియేషన్ల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ప్రీ స్కూళ్లుగా 218 అంగన్‌వాడీ కేంద్రాలు
కలెక్టర్ ముత్యాలరాజు వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, జనవరి 28: జిల్లాలోని 218 అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ స్కూల్, యుకెజి కేంద్రాలుగా మార్పుచేసి పటిష్ఠంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు తెలిపారు. శనివారం ఆయన నగరంలోని పలు అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. ముందుగా జాకీర్‌హుస్సేన్ నగర్‌లోని మిగతా అంగన్‌వాడీలను అభివృద్ధి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇక్కడ అంగన్‌వాడి కేంద్రం మోడల్ కేంద్రంగా తీసుకుని జిల్లాలోని మిగతా అంగన్‌వాడీలను అభివృద్ధి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పిల్లల హాజరుశాతం పెరగాలని, ఆరోగ్యపరంగా బలహీనంగా ఉన్న విద్యార్థులను గుర్తించి పౌష్టికాహారం అందించాలని ఆయన సూచించారు. అనంతరం కలెక్టర్ ఎన్‌టిఆర్ నగర్ రాయపు హరిజనవాడలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డి హరిత, సంబంధిత అధికారులు ఉన్నారు.

3న సిఎం చంద్రబాబు రాక?
* ఏర్పాట్లపై జెసి పరిశీలన
వెంకటాచలం, జనవరి 28: వెంకటాచలం మండలానికి వచ్చేనెల 3వ తేదిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటించే అవకాశాలున్నాయి. ఈనేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మండలంలోని కాకుటూరు వద్ద నూతనంగా నిర్మించిన విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ భవనాన్ని, గొలగమూడి వెంకయ్యస్వామి ఆశ్రమ ఆవరణలో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపం, ఇతర అభివృద్ధి పనులను చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. దీంతో శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మండలంలోని గొలగమూడికి వచ్చి అక్కడ ప్రారంభోత్సవం చేసే భవనాలపై ఆశ్రమ ఇవో బాలసుబ్రహ్మణ్యంతో చర్చించారు. అనంతరం అక్కడ నుండి కాకుటూరుకు వచ్చి విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఆవరణను పరిశీలించారు. బహిరంగ సభకు వేదిక ఏర్పాటు, రోడ్డుమార్గం, హెలిపాడ్ తదితర వాటి కోసం జాయింట్ కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట నెల్లూరు ఆర్డీవో కాసా వెంకటేశ్వర్లు, విఎస్‌యూ రిజిస్ట్రార్ శివశంకర్, తహశీల్దార్ సుధాకర్, సర్వేయర్ సుబ్బరాయుడు తదితరులు ఉన్నారు.

సాలుచింతలులో పోలీసుల విస్తృత దాడులు
కోవూరు, జనవరి 28: సాలుచింతలు సెంటర్ సమీపంలోని పెట్రోల్ బంక్ వెనుకవైపు ఉన్న ప్లాట్లలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిని కోవూరు ఎస్సై వెంకట్రావు అదుపులోకి తీసుకున్నారు. అలాగే పోతిరెడ్డిపాళెం గ్రామ సమీపంలోని వ్యవసాయ భూముల్లో వ్యభిచారం చేస్తున్న ముగ్గురు యువకులు, ముగ్గురు యువతులను పట్టుకున్నారు. వారిని అరెస్టు చూపిన ఎస్సై వెంకట్రావు శనివారం కోర్టులో హాజరుపర్చారు. ఈసందర్భంగా సిఐ మాధవరావు మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని హెచ్చరించారు. స్టేషన్ పరిధిలోని అన్నిగ్రామాల ప్రజలు ఏదైనా పనిపై రెండు మూడు రోజుల పాటు బయటికి వెళ్లాల్సి వచ్చినపుడు పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇస్తే ఆ ఇళ్లపై నిఘా ఉంచుతామన్నారు. తద్వారా చోరీలను అరికట్టవచ్చని సిఐ అన్నారు.

మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలపై
జిల్లా కలెక్టర్‌కు ఎమ్మెల్యే కాకాణి లేఖ
ముత్తుకూరు, జనవరి 28: మండలంలోని వల్లూరు గ్రామ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఇటీవల మధ్యాహ్న భోజన పథకంలో నిర్వాహకురాలి అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుకు సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి శనివారం లేఖ రాశారు. ఈవిషయాన్ని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి స్థానిక విలేఖర్లకు ఫోన్ ద్వారా తెలియజేశారు. ఇటీవల పాఠశాలలోని మధ్యాహ్న భోజనంలో బల్లిపడి భోజన నిర్వాహకురాలికి, గ్రామస్థులకు వివాదం చెలరేగిన ఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాలపై ఎమ్మెల్యే స్పందించారు. ఈమేరకు మధ్యాహ్న భోజన పథకం ఏజన్సీ నిర్వాహకురాలిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే ప్రస్తుతం ఉన్నవారిని తొలగించి కొత్తవారిని నియమించాలన్నారు. పిల్లలకు పరిశుభ్రతతో కూడిన ఆహారాన్ని అందించే విషయంలో జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. పాఠశాల పరిసర ప్రాంతాలను కూడా అధికార యంత్రాంగం చేత తనిఖీ చేయించాలని ఎమ్మెల్యే లేఖలో పేర్కొన్నారు.