నెల్లూరు

సంజీవని మాయ (కథ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంకరయ్య చెన్నపట్నంలో చేయి తిరిగిన గొప్ప పేరు పొందిన ఆయుర్వేద వైద్యుడు. ఆరోజు ఆయన తన శిష్యులతో పొగబండెక్కి నెల్లూరుకు వచ్చాడు. ఆ రాత్రి అక్కడే గడిపి, మరుసటి రోజు ఉదయానే్న గుర్రపు బండ్లు కట్టించుకొని ఉదయగిరికి బయలుదేరాడు. మొదటి గుర్రపుబండిలో ఆయన తన సామానుతో కూర్చుంటే, రెండవ గుర్రపు బండిలో అతని ముగ్గురు శిష్యూలూ తమ సరంజామాతో బాటు వైద్యగ్రంధాలూ ఎక్కించారు. మధ్యాహ్నం దారిలో సంగం గ్రామ సమీపంలోని బాట ప్రక్కనున్న సత్రంలో భోజనం చేసి, ఓ గంట విశ్రాంతి తీసుకుని మళ్లీ బయలుదేరారు.
సాయంత్రానికి ఉదయగిరిలోని తన దూరపు బంధువు, మిత్రుడు అయిన బసవయ్య ఇంటికి చేరాడు. ముందుగానే జాబు వ్రాసి ఉండడంతో బసవయ్య కూడా ఇంటి దగ్గరే ఉండి శంకరయ్యను ఆహ్వానించాడు. ఆ మధ్యాహ్నం మిత్రుడు ఇంట్లో భోంచేసిన శంకరయ్య బృందం కొంతసేపు విశ్రాంతి తీసుకుంది. తరువాత శంకరయ్య, బసవయ్య ఒక గుర్రపుబండిలో, శంకరయ్య శిష్యగణం మరో గుర్రపు బండిలో దగ్గరలోని దుర్గం వైపు ప్రయాణం సాగించారు.
ఉదయగిరిని ఆనుకునే ఉన్న ఆ అడవిలోకి ప్రవేశించిన వైద్యుడు శంకరయ్య, అక్కడి వృక్షసంపదకు ఆశ్చర్యపోయాడు. అక్కడక్కడా బండిని ఆపి ఔషధ మొక్కలను పరిశీలించాడు. శిష్యులతో చర్చించాడు. తను పరిశీలించిన చోటల్లా శిష్యులచేత గుర్తులు పెట్టించాడు. నిజానికి శంకరయ్య చెన్నపట్నంలో ఉన్నా అతను అసలుసిసలైన తెలుగువాడు. అతని శిష్యుల్లో ఒకడు మాత్రమే అరవవాడు. అయినా తెలుగు స్వచ్ఛంగా మాట్లాడతాడు. చెన్నపట్నంలో అరవవాళ్లు ఎంతమంది ఉన్నారో, అంతకంటే ఎక్కువ తెలుగువాళ్లున్నారు. బరంపురం నుంచి కన్యాకుమారీ వరకు ఉన్న మద్రాసు రాష్ట్రానికి చెన్నపట్నం రాజధాని.
శంకరయ్య దగ్గర వైద్యానికి సంబంధించిన అనేక తాళపత్ర గ్రంథాలున్నాయి. ఆ తాళపత్రాల గ్రంథాల ద్వారా ఆయన తెలుసుకున్నదేమంటే ఉదయగిరి దుర్గంలోని అడవుల్లో మృతసంజీవనీ చెట్లున్నాయని, ఈ ఆకులు తగిలితే ఎంత వ్యాధయినా నయమవుతుందని, ఎంత గాయమైనా మానిపోతుందని, అర్ధాంతరంగా మరణించిన మనిషికి ఈ ఆకురసం పిండి నోట్లో వేస్తే తిరిగి బతుకుతాడని, వెంటనే లేచి కూర్చుంటాడని, ఈ చెట్ల మొక్కలు సంపాదించి తన పెరట్లో పెంచి అకాల మరణాలను అరికట్టాలని వైద్యుడు శంకరయ్య కోరిక. అందుకే చెన్నపట్నం నుంచి ప్రయాణమై ఇక్కడికొచ్చాడు. అక్కడ దారిలో చెట్లను, మొక్కలను పరీక్ష చేస్తూ మిత్రుడితో దానియొక్క ఔషధగుణాల గురించి చెబుతూ, తాను హిమాలయాలకు కూడా వెళ్లానని, అక్కడ కూడా ఇంత విలువైన మొక్కలు చూళ్లేదని, ఇక్కడ అపారమైన ఈ ఔషధ మొక్కల మధ్య మృత సంజీవని మొక్కలున్నట్లు తాళపత్ర గ్రంథాల్లో వ్రాసి ఉందని, వాటిని ఎలాగైనా సంపాదించాలని, ఇంతకాలం తాను ఇక్కడకు రాకుండా పెద్ద తప్పు చేసానని మిత్రుడి ముందు వాపోయాడు. ఇక ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఉదయగిరికి వచ్చి ఔషధాలు సేకరించుకొని వెళ్తానన్నాడు.
వాళ్లు దుర్గమున్న కొండను సమీపించి, దానికి అనుకొనే ఉన్న మరోచిన్న కొండమీద ఉన్న దుర్గంపల్లెలో దిగారు. అక్కడి వరకు బండిబాట ఉంది. ప్రజలు చాలా బీదరికంలో ఉన్నారు. అనేక వ్యాధులతో బాధపడుతున్నారు. శంకరయ్య వైద్యుడని తెలిసి దుర్గంపల్లె ప్రజల అతనికి పదేపదే దండాలు పెట్టారు. తమ జబ్బులు ఏకరువు పెట్టారు. ఆ పల్లె ప్రజల మధ్యనున్న నలభై ఏళ్ల కనకయ్య అయితే ఏకంగా వైద్యుడు కాళ్లమీద పడ్డాడు. తన ఉబ్బసం జబ్బు నయం చేస్తానని చెబితే తప్ప కాళ్లొదలనన్నాడు. శంకరయ్య మాట ఇచ్చిన తరువాత గాని లేచి నిలబడలేదు.
వైద్యుడు శంకరయ్యతో బాటు అతని సహాయకులు అడవంతా రెండురోజుల పాటు తిరిగి కొండ ఎక్కే దారిలో విశాలమైన ఒక బండమీద తమ మకాంకు స్థలం ఎన్నుకున్నారు. ప్రక్కరోజు ఉదయమే ఉదయగిరి నుంచి తమ సామానంతా తెచ్చుకున్నారు. ఆ బండ మీద గుడారాలు వేసుకున్నారు. అక్కడ దొరికే ఆకుపసర్లు రుద్ది, చెట్ల వేర్లు ఉడకబెట్టి కషాయాలు ఇచ్చి, చెట్లబెరడ్లు ఎండబెట్టి నూరి ఆ పొడులు ఇచ్చి దుర్గంపల్లి గ్రామస్థుల జబ్బులు ఒక్కొక్కటిగా నయంచేశారు.
కనకయ్యకు రోజులు బాగున్నాయి. అతని జబ్బు నయమయి పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. ఆరోజతను ఉదయానే్న చద్దన్నం తిని దుర్గంపైకి వెళ్లాడు. శిథిలమైన కోట బురుజులు దాటి కొండపైన చిక్కగా పెరిగిన అడవిలో కట్టెలు నరుకుతున్నాడు. మధ్యాహ్నానికి రెండు మోపుల కట్టెలు కొట్టాడు. ఇక భార్య వస్తే వీటిని క్రిందికి మోసుకుపోవడమే తరువాయి. ఇదే ఆఖరు కట్టె అనుకుంటూ ఇష్టముండీ ఇష్టంలేనట్లు ఆ చెట్టు మొదలు మీద ఒక దెబ్బవేశాడు.
పరధ్యానంగా ఉండడంతో ఆ దెబ్బ గురితప్పి కనకయ్య కాలు మీద పడింది. పదునైన ఆ గొడ్డలి దెబ్బకు అతని కాలు లోతుగా తెగింది. కండ చీల్చుకుపోయి, ఎముక తగిలి ఆగిపోయింది. చివ్వున నెత్తురు చిమ్మింది. గొడ్డలి రక్తంతో తడిసిపోయింది. కనకయ్య బాధతో ఒక గావుకేక పెట్టాడు. రక్తం చిమ్మకుండా పంచెవిప్పి కాలుకు గట్టిగా కట్టుకట్టాడు. అయినా రక్తం ఆగలేదు. పంచెకూడా రక్తంతో తడిసిపోయింది.
ఇంకా రక్తం పోయిదంటే తను బ్రతకడం కల్ల అనుకున్న కనకయ్య సహాయం కోసం పెద్దగా కేకలు పెట్టాడు. ఎవరూ ఆ ప్రాంతంలో లేకపోవడంతో ఇతని రోదన అరణ్యరోదనే అయింది. వెంటనే కనకయ్యకు వైద్యుడు శంకరయ్య గుర్తుకువచ్చాడు. ఆలస్యం చేయకుండా గోచిగుడ్డతోనే కోట బురుజులు దాటి కొండమీద అడ్డదిడ్డంగా నడుస్తూ చెట్లను తప్పించుకుంటూ అక్కడక్కడా క్రిందికి జారుతూ వైద్యుడు శంకరయ్య గుడారం ముందు సొమ్మసిల్లి పడిపోయాడు.
అప్పుడే కల్వంలో ఆకులతో మందు నూరుతున్నారు శిష్యులు. శంకరయ్య అనుపానాలు చెబుతున్నాడు. ఇంతలో కనకయ్య కేకలు పెట్టుకుంటూ వచ్చి గుడారం ముందు పడిపోవడంతో అంతా బయటికి వచ్చారు. అడవిలో పనిచేసుకుంటున్న మిగతా వాళ్లు కూడా వచ్చి అక్కడ గుమిగూడారు. శంకరయ్య శిష్యులు కనకయ్య ముఖాన నీళ్లు చల్లేసరికి కళ్లు తెరిచాడు కనకయ్య.
‘‘ఏం జరిగింది కనకయ్యా? ఆ అరుపులేమిటి? ఈ గోచీగుడ్డేమిటి?’’ అడిగాడు వైద్యుడు శంకరయ్య.
కనకయ్య ఈ లోకంలోకి వచ్చాడు. ‘‘అయ్యా కాలు తెగిందయ్యా. సచ్చిపోతానయ్యా. శానా రక్తం పోయిందయ్యా. ఎంటనే కట్టుకట్టయ్యా’’ అంటూ పెద్దగా ఏడ్చాడు.
‘‘కనకయ్యా, నీకేమయినా పిచ్చా ఏమిటి? కాలు తెగేదేమిటి. నేను కట్టుకట్టేదేమిటి?’’ అన్నాడు శంకరయ్య.
‘‘అదేంది సామే. అట్టంటారు’’ అంటూ కనకయ్య తెగిన కాలునొకసారి చూసుకున్నాడు. కాలుకి ఏ గాయమూ లేదు. మళ్లీ రెండు కాళ్లూ చూసుకున్నాడు. రెండు కాళ్లూ బాగానే ఉన్నాయి. అయితే కాలుకు చుట్టిన రక్తంతో తడిసిన పంచె మాత్రం గిరకల మీదికి జారి కనిపించింది.
పంచె ముడివిప్పి చేతికి తీసుకుని దానికంటిన రక్తం చూపిస్తూ ‘‘ఏందీ మాయ సామే?’’ అంటూ జరిగిందంతా వైద్యుడు శంకరయ్యతో చెప్పాడు కనకయ్య.
శంకరయ్యకు నోటమాట రాలేదు. మోకాళ్ల మీద కూర్చొని కనకయ్య కాళ్లు రెండు అతి జాగ్రత్తగా పరిశీలించాడు. గాయం కాదుగదా. మచ్చకూడా లేదు.
వెంటనే శంకరయ్యకు అసలు విషయం బోధపడింది. అతడి ముఖంలో ఆనందంతో కూడిన చిరునవ్వు మెరిసింది. లేచి నిలబడి కనకయ్య రెండు చేతులూ పట్టుకుని, ‘‘నువ్వు దేవుడివి కనకయ్యా. నువ్వు వచ్చిన దారిలో మృత సంజీవని చెట్టుందయ్యా. దాని ఆకులు తగిలే నీ గాయం మానింది. ఆ చెట్టు ఎక్కడుందో చూపించు’’ అన్నాడు.
‘‘అది ఏడుందో నాకేటి తెలుసు సామే. నా బాధలో నేనుంటిని. ఇన్ని ఇసయాలు తోస్తాయా’’ అన్నాడు కనకయ్య తల గీరుకుంటూ.
‘‘పోనీ నువ్వొచ్చిన దారి చెప్పు’’ అన్నారు శంకరయ్య శిష్యులు.
‘‘అది కూడా చెప్పలేను సాములూ. దిక్కుతోచక ఒక దారంటూ లేకుండా అడ్డదిడ్డాలబడి పరిగెత్తినా, కొన్నిసోట్ల తొందరగా నీ దగ్గర కొద్దామని, కొండ మీద నించి కిందకి జారినా. అయితే నేను కట్టెలు కొట్టిన సోటు మాత్రం సూపిత్తా’’ అన్నాడు కనకయ్య.
‘‘సరే ముందదయినా చూపించు. అక్కడకు వెళ్లిన తరువాత నువ్వొచ్చిన దారి కనిపెడదాం’’ ఆతృతగా అన్నారు శంకరయ్య శిష్యులు.
కనకయ్య మామూలుగా అందరు వెళ్లే కాలిదారిన దుర్గం మీదకి తీసుకువెళ్లాడు. బురుజులు దాటిని తరువాత తను కట్టెలు కొట్టిన స్థలం చూపించాడు. అతను కాలిమీద గొడ్డలివేటు పడ్డ చెట్టు దగ్గరకు వెళ్లేసరికి, అక్కడ పైటనోట్లో పెట్టుకుని ఏడుస్తున్న కనకయ్య భార్య కనిపించింది. ఆమె చేతిలో రక్తంలో తడిసిన గొడ్డలి ఉంది.
కనకయ్య ఏడుస్తున్న భార్యను ఓదార్చాడు. వైద్యుడు శంకరయ్య రక్తంతో తడిచిన గొడ్డలిని పరీక్షగా చూశాడు. క్రింద మట్టిలో పడి గడ్డగట్టిన రక్తాన్ని చూశాడు. అక్కడ నుంచి కనకయ్య చెప్పిన దారివెంట అందరూ నడిచారు. దారి పొడవునా రక్తపు చుక్కలు పడి ఎండిపోయి ఉన్నాయి.
బురుజు దాటి వచ్చిన తరువాత ఒక చోట ఆగిన కనకయ్య, ‘‘అయ్యా. ఇక్కడిదాకా గుర్తుందయ్యా. ఆనక ఈ కొండమీద నుంచి కిందకి జారినాను. అక్కడక్కడ కాలు ఈడ్చుకొని నడస్తా, వాటంగా ఉన్నచోట జారతా కిందకి వచ్చానయ్యా. ఒక దారని రాలేదయ్యా’’ గీచుకుపోయిన చేతులు చూపిస్తూ అన్నాడు కనకయ్య.
అక్కడి నుంచి చూస్తే కొండ అడుగు సుమారు ఒక మైలు దూరమున్నట్లుంది. ఆ అడవిచెట్ల మధ్య ఇతనొచ్చిన అడ్డదిడ్డాల దారి కనుక్కోవడం చాలా కష్టం. అప్పటికీ కనకయ్యకు అనుమానమున్న చోటంతా వెతికారు. తాళపత్రాల గ్రంథాల ప్రకారం దాని రూపురేఖలు శంకరయ్యకు తెలుసు. ఎంత వెతికినా సంజీవని చెట్టు కనిపించలేదు.
రెండు నెలలు ఉండాలనుకున్న శంకరయ్య ఆరునెలలున్నాడు. కాని అతను అనుకున్న సంజీవని చెట్టు దొరకలేదు. ఇలా ప్రతి సంవత్సరమూ తన శిష్యులతో వస్తూనే ఉన్నాడు శంకరయ్య. కాని ఎంత వెతికినా సంజీవని చెట్టు మాత్రం దొరకడం లేదు.

- పోట్లూరి సుబ్రహ్మణ్యం,
9491128052

స్పందన

రసభరితంగా సాగిన
ఈరోజు నాది!
పేరుకు తగ్గ రచయిత గుర్రాల రమణయ్య గారు. ఆయన కలం నుంచి జాలువారిన ఈరోజు నాది కథ ఆధ్యంతం రేసుగుర్రంలా సాగింది. ఒక వ్యక్తి చేతిలో మోసపోయిన యువతి అతనికి ఎలా బుద్ధిచెప్పిందో వివరించిన తీరు బాగుంది. కథలో కాస్త శృంగార వర్ణణలు ఎక్కువైనా ఈ కథకు అవసరమే అనిపించింది. ఆమెకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఈరోజు నాది అనే టైటిల్‌కు న్యాయం చేసింది. మొత్తంగా కథ సూపర్.
- రావి అనంతబాబు, నెల్లూరు
- అంజయ్య, ఒంగోలు

కవితలు ఆకట్టుకున్నాయి
గత వారం మెరుపులో ప్రచురించిత కవితలన్నీ బాగున్నాయి. సామాన్యుడి గోడు, పచ్చని హత్య, పసిపాదాలకు పారాణి వద్దు, డబుల్ ధమాకా ప్రతి కవితా దేనికదే పోటీపడింది. మెరుపు రచయితలకు నా అభినందనలు.
- వనజ, కుక్కలగుంట, నెల్లూరు

రీసౌండ్ చేసిన డబల్ ధమాకా
ఒక మహిళా ఉద్యోగి పడే పాట్లను కళ్లకు కట్టిన డబల్ ధమాకా కవిత రాసిన రచయిత్రి గోవిందరాజు సుభద్రాదేవి గారికి హ్యాట్సాప్. వారమంతా పనిచేసే మాలాంటి వాళ్లకి ఒక్క ఆదివారమే విశ్రాంతి. ఇక ఆ రోజు కూడా మా పాట్లు అన్నీ ఇన్నీ కావు. మా బాధలను కనీసం ఎలుగెత్తి చాటిన సుభద్ర గారికి ధన్యవాదములు. బహుశా సుభద్రాదేవి గారు కూడా ఓ ఉద్యోగి అయివుంటారామో.
- దాయం కామాక్షి, ఆర్టీసీ డిపో, నెల్లూరు
- పచ్చల సులోచన, సిరామిక్ కాలేజి, గూడూరు

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

మనోగీతికలు

గోడలు మాట్లాడతాయి
గురజాడ వారి గృహాన్ని చూచి
విజయనగరంలో విస్తుపోయాను!
అది సంపన్నుల సౌధం కాదు
సంప్రదాయతను సంతరించుకున్న
సామాన్యస్థాయిలో అసామాన్యుని గృహం
గురజాడ స్మారక భవనం.

విరచిత గ్రంథాల బీరువాల వెనుక
గోడలు మాట్లాడసాగాయి
గోడలు తెలిపిన గురజాడ వారి గురుజాడ
గోడలు పలికిన గురజాడ పాటలకే పాట
దేశమును ప్రేమించుమన్నా అని
కవిత కోకిల పలుకులను విని
దేశమందభిమానములు మొలకెత్తాలని
పదునాలుగు ఖండికల
పదుగురి హృదయాలను ప్రేరేపించిన
ప్రథమ తెలుగు దేశభక్తి గేయం

ఆ గోడకున్న అలమారలో
అగుపించాడు గిరీశం
ఆయనతో మాట్లాడటమే
ఒక ఎడ్యుకేషన్
మహాకావ్య విస్తార తొలి తెలుగు సాంఘిక నాటకం
‘మహా పసందైన షడ్రుచుల భోజనం’
కన్యాశుల్కం,
నెపోలియన్ ఆఫ్ యాంటినాచ్ కథ అడ్డం
తిరిగే దాక
గోడలు మాట్లాడాయి!

మహనీయులు నడయాడిన మహిమాన్విత
ప్రదేశాల,స్మారక భవనాల, చారిత్రక కట్టడాల, కోట గోడల సందర్శనానందానుభూతి
అనిపిస్తుంది
గోడలు మాట్లాడుతాయని!!

- వేదం సూర్యప్రకాశం
చరవాణి : 9866142006

అడుగుజాడ
ప్రతి తెలుగు ముంగిట్లో
ముసురుకున్న మూఢ నమ్మకాలను
పారద్రోలడానికి
విజ్ఞానపు వెలుగు కిరణాల కల్లాపి చల్లిన
అక్షర భాస్కరుడు అతడు
తన కలం హలంతో
కులాల అసమానతలను చదును చేసి
దురాచారాల కలుపు మొక్కలను ఏరివేసి
మానవత్వపు పంట పండించిన
అక్షర కృషీవలుడు అతడు..
శతాబ్దకాలంగా
తెలుగునాట రంగస్థలం మీద
సంస్కరణల మంత్ర జలాన్ని చల్లిన
అక్షర తపస్వీ అతడు
వట్టి మాటలు కట్టిపెట్టవోయ్..
గట్టి మేలు తలపెట్టవోయ్..
అతని గుండె చప్పుడు
సమాజ హితం
దేశమంటే మట్టి కాదోయ్..
దేశమంటే మనుషులోయ్..
అతడు నిలువెత్తు దేశభక్తి గీతం
అతని కనురెప్పల కొమ్మలపై
వ్రాలిన నవ సమాజపు స్వప్నాలు
తెలుగు కథా చరిత్రలో
అతను తొలి చేవ్రాలు
తెలుగు తల్లికి అలంకరించెను
అతని అక్షరాల ముత్యాల సరాలు
అతను అభ్యుదల భావ అడుగుజాడ
గురజాడ...
- మోపూరు పెంచల నరసింహం
చరవాణి : 93463 93501

నాగలి చిన్నబోయింది
‘‘నాగలి వున్న ఊరిలో
ఆకలి వుండదట’’
- ఇది ఆనాటి మాట

గర్వంగా తలెత్తుకుని బ్రతికింది
ఎన్నో కుటుంబాల ఆకలి తీర్చి నేస్తమయ్యింది
రైతుల చేతుల్లో ఒదిగిపోయి హుషారుగా
గంతులేసింది
‘విజయదశమి’ వస్తే అందరి పూజలందుకుంది
కానీ నేడు..
ఆ రైతుల కళ్లల్లో దైన్యం
ఆనాడు పాడిపంటలతో నిండిన లోగిలి
నేడు శూన్యం
రైతులందరూ కోల్పోతున్నారు ఆత్మస్థయిర్యం
ఎలా కలిగించాలో తెలియలేదు
తిరిగి వారిలో ధైర్యం...తమ నేస్తాలు
చీమల్లా రాలిపోతున్నారనే వార్తలే నిత్యం
పురుగుల కోసం తెచ్చిన మందులు
వారే మింగుతున్న దృశ్యం చూడలేక పోయింది..
అందుకే నాగలి చిన్నబోయింది.
- దామెర్ల గీత, నెల్లూరు, 9912391196

వానా వానా వల్లప్పా!
దిమ్మదిరిగింది తిమ్మప్పా!
మిరప వేరుశనగ వరిపైరు లెల్ల
ముంపు నీటదేలి మురిగిపోయె
చేతికందిన మినుము చేనులోన మునిగె
చెమ్మ తగిలె రాలె నిమ్మపూత
పొంగె చెరువులు తెగె రింగుబండ్లు
చెప్పనలవిగాని చింతలెన్నో
నమ్ముకున్న నేల నట్టేట ముంచగా
అన్నదాత బతకులారిపోయె
గండిపడ్డ చెరువు కనులగాంచిన రైతు
గుండె చెరువుగాను కుమిలిపోయె
కూలి పనులు లేక కుంగిపోయెను పేద
అల్లకల్లోలమాయె నెల్లూరు సీమ
అయితే అధికవృష్టి లేకుంటా అనావృష్టి

నీళ్ల కౌగిళ్లలో ఊళ్లు
నీళ్ల మీద తెప్పలుగా ఇళ్లు
సర్రున పారే నీరు జలరంపమై
కొయ్యను కోసినట్లు ఎక్కడికక్కడ
రహదారులను ముక్కలు జేస్తే
రాకపోకలు నిలిచిపోయి
నడిరోడ్ల మీద అగచాట్ల బతుకులు

ఏ ఊరికా ఊరు ఏకాకియైపోతే
ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా
తలాతోకాలేని సీరియళ్లతో ఎప్పుడూ
తల పగలగొట్టే టీవీలు
ముంపు సమయంలోన
మూగనోము పట్టాయి

అంతులేని జలరాశి చుట్టు ఉన్నా
గొంతు తడుపుకోను గుక్కెడు నీళ్లు లేవె
అయిన వారెట్టుండిరో
అడిగి తెలుసుకోవాలన్నా
ఫోనులో చార్జింగు
పూర్తిగా అయిపోయె
కరెంటు లేకపోతే
క్షణమైనా గడవని
కరెంటు బానిస బతుకులను
కళ్లకు కట్టిందీ కసాయి వాన

- చిరమన వెంకట రమణయ్య,
గూడూరు
చరవాణి : 9441380336

email: merupunlr@andhrabhoomi.net

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net

- పోట్లూరి సుబ్రహ్మణ్యం, 9491128052