నెల్లూరు

మనసు మంచిదైతే..! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సాయిలక్క తెమలిరా... ఇప్పటికే సూరీడు తన పెతాపం చూపిస్తున్నాడు. తొరగా వెళ్లబారకపోతే మేస్తిరి పనిలోకి రానీడు’’ గుడిసె బయటనుండి కేకేసింది రాములమ్మ.
‘‘వస్తాన్నానే మీ బావకి గంజార్చి అస్తా’’
‘‘ఏం ..బావ ఈ దినం పనికెళ్లడా’’?
‘‘ఆ... ఓ పూటెల్తే తాగేసి రొండుపూట్లు ఇంట్లోనే తొంగుల్లా..
ఈ మొగోళ్లతో ఏగలేక సస్తాన్నాంగదే.. ఇక పా’’... రోడ్డు వెంబడి నడుస్తూ మాట్లాడుతున్నారు వాళ్లు.
‘‘అందుకనే గదక్కా నేను మనువుజోలికే పోలేదు’’
‘‘నీ మావ ఈరిగాడున్నాడు కదే ఒక్క పాడు అలవాటు కూడా లేదు వాడికేం బంగారం చేసేసుకోవే’’
పో.. అక్క ఈ మట్టి పనులు చేసేటోనే్న నే చేసుకోనే..
స్టయిలిగా మోటారుసైకిల్‌పై జుయిమంటూ పోయేటోనే్న చేసుకుంటా’’.
‘‘సర్లే యె ఈయవ్వారాలేకేం గానీ ఏమన్నా తిన్నవా? నేను గంజి తాగేసొచ్చా’’....
‘‘తినలేదక్కా దారిలో ఏదైనా తినెల్దాంలేనని... అద్దో ఆ బండికాడ దోసెలేస్తున్నారే ఆడ త్వరగా తినేసి బేగి వెళ్లిబోదాం’’
దోసెలబండి కాడకొచ్చారిద్దరు
‘‘తలా మూడేసి దోసలేయక్క’’ ఆర్డరేసింది రాములమ్మ.
‘‘నాకొద్దే... నే గంజిన్నం కడుపులో వేసేశానే..నువ్వు తిను అంది సాయిలమ్మ.
రాములు చేతిలో దోసెల ప్లేటు ఉంచింది అమ్మె ఆవిడ
దోసె నోట్లో పెట్టుకుంటూ స్కూటర్ శబ్దం వినిపించి పైకి చూసి, నోరట్టే ఎళ్లబెట్టి, స్కూటర్‌లో వచ్చిన అబ్బాయిని చూస్తిండిపోయింది రాములు.
‘‘ ఏమే రాములు... ఆట్టే సూత్తన్నావ్! నువు సెప్పినట్టే ఉండాడు గదే! సూట్టానికి బలేగున్నాడు.. మనువాడేస్తావా’’! వీవు గిళ్లుతూ అనింది సాయిలమ్మ.
‘‘ ఊరుకోక్క మరీను.. ఇట్టాంటోళ్లు కూడా బండికాడకొచ్చి టిఫినీలు సేత్తారా’’? అంది రాములు.
‘‘ ఏమోనే మనకేం తెలుసు ఈడ బాగుంటాదేమో’’.... తినేసి చేతులు కడుక్కొని, పైట కొంగులోంచి వంద కాగితము తీసి దోసెలామికిచ్చి చిల్లర తీసుకొని రవికలో ఉంచుకుంది రాములు’’
‘‘ ఇక రాయే బేగిపోదాం’’ అంది సాయిలమ్మ.
‘‘ఉండక్క నీళ్లు తాగొస్తానంటూ’’ వంగి గ్లాసులో నీళ్లు తిప్పుకొని గటగట తాగేసి, ఒరకంట స్కూటర్ అబ్బాయిని చూస్తూ బయలుదేరింది రాములు.
అపుడు అబ్బాయి నీళ్ల క్యాన్ కాడ వంగి వీళ్లకేసి చూసాడు క్రింద నుండి ఏదో తీసుకున్నట్లు కనిపించింది.
‘‘ ఏంటే తెగ సూత్తన్నావ్ అంత లైకింగ్ అయినట్టున్నాడు, ఈడనే ఆగిపోతావా ఏంది రా..రా’’.. చేయిపట్టుకు లాక్కెళ్లింది సాయిలమ్మ.
అపార్ట్‌మెంటు పనికి కుదిరారిద్దరు. వీళ్లతో పాటు ఓ నలభై మంది పనిచేస్తున్నారక్కడ. పోగానే తట్టలెత్తుకొని పనిలోకి దిగారు. కాసేపటికి రాములకి డౌట్ వచ్చి రైక తడిమి చూస్తే పెట్టిన చిల్లర కనిపీలేదక్కడ.
‘‘సాయిలక్క’’ పెద్దగా కేకేసింది రాములు.
‘‘ ఏంటే రాములు ఏటైందంటూ’’ బిరబిరవచ్చింది సాయిలమ్మ.
రాములు ఏడుపుమొకం పెట్టుకొని ‘‘రైకలో ఉంచి చిల్లర కనిపించడం లేదక్కా’’ అంది
‘‘అయ్యో బాగా ఎతకవే ఏడకిపోద్ది’’.
ఇద్దరు వాళ్లు పనిచేసే కాడంతా వెతికారు దొరకలేదు.
ఏదో గుర్తొచ్చి.. ‘‘అక్కా టిఫిన్ కాడ చిల్లర తీసుకొని రైకలో ఉంచి నీళ్ల కోసం వంగినపుడు పడిపోయి వుంటుంది’’ అంది రాములు.
అవునే ఇటు రాగానే ఆ స్కూటర్ పిల్లగాడు వంగి మనకేసి సూసాడు. పడిపోయింది ఆడు తీసుకొనుంటాడు.
‘‘అవునక్క వాడు మనకేసి దొంగసూపు సూత్తున్నాడు వాడే కొట్టేసుంటాడు. దినమంతా కట్టపడి సెమటోర్చి సంపాదించిందక్కా దొంగోడి పాలైండి’’ బాధగా అంది రాములు.
మడిసందంగా ఉంటే సాలా.. మనసంతా మసిపూసుకొని... అదే నీమామ ఈరిగాడ్ని సూసావా రత్తమ్మ పోగొట్టుకున్న డబ్బులు ఈరిగాడికి దొరికితే తిరిగిచ్చేసాడు, మట్టోడు వద్దన్నావ్ గదే మనిషి కాదే ముఖ్యం మనసు మంచిదై ఉండాలా అంది సాయిలమ్మ.
అంగీకారంగా తలూపుతూ పనిలోకి దిగింది రాము.

- అవ్వారు శ్రీధర్‌బాబు
నెల్లూరు.
చరవాణి : 8500130770

వర్షపు జాడలు

స్పందించిన హృదయాలకు
అభివందనం
ఉభయకుశలోపరి తదుపరి,
ఉవ్వెత్తున ఎగిసిన తుఫానుకు ఊరెలా ఉందని అడిగారు
వానా వానా వందనం - వర్షమా వర్షమా ఇంత హర్షాతిరేకమా!
ఇంత అత్యభినయమా!
‘అతి సర్వత్రావర్జయేత్’ అని అడిగితే
ముణ్ణెల్లుగా కురవని ఆనందం - ముడ్రోజుల్లో కుమ్మరించాలా?
ముందొచ్చే మూణ్ణెల్లూ
మురిపించవచ్చుగా...

కలిపించి కొంతమందికి మోదం - కలిగించావు ఎంతోమందికి ఖేదం
కళకళ లాడించావేమో గాని
జలాశయాలను
కష్టార్జితాలను ముంచేసి ముద్దచేసి
జలకళే గాదు విలయతాండవం
కూడా చేసి
కడగండ్లు మిగిల్చావు కష్టజీవులకు -
విలవిల్లాడించావు వ్యవసాయదారుల్ని
సామాన్యులనుంచి సంపన్నుల దాకా
బడుగులు భాగ్యవంతులనే తేడా లేక
బాదేశావు
బిక్కుబిక్కుమంటూ సగం మునిగిన
యిళ్లపైకప్పులపై బీదా బిక్కి
నదులను తలపించే జలాశయాలు
జాతీయ రహదార్లను సైతం వదలక - రోడ్ల మీద బోట్లు నడిపించావు
పొంగి పొరలే నీ ప్రవాహాన్ని చూస్తూ గంగాహారతివ్వాలనిపించేలా చేశావు!

వందేళ్లుగా రాని వర్ష ఉద్ధృతికి
చిన్నాభిన్నమైన చెన్నై
తళతళలాడే సెల్యులాయిడ్ కోలివుడ్ కాంతి విహీనమై
విలవిలలాడి వెలవెలపోయింది
తిండిగాదు ముందు తాగే నీరుకు అర్రులు చాచేటట్లు చేశావు
రద్దయిన రవాణా సౌకర్యాలు, మాట్లాడని ఫోన్లు, పనిచేయని ఎటియంలు,
పోయిన ప్రాణాలు ఆక్సిజన్ అందక
ఐసీయూల్లో
అందుబాటులోలేని ఆహారం, అంధకారంలో నగరం - ఆఖరున అంటురోగాలు

స్వయంకృతాపరాధ ఘోర విపత్తులో
ప్రకృతి, మానవాధిపత్య పోరులో -
పాటించని పర్యావరణ సమతుల్యం
అధిక సంతానం, ఆకాశహర్మ్యాలు,
చెట్లు నరికివేత
పాషాణ వనాలయిన హరితనగరాలు
కర్మాగార పొగగొట్టాల వెలువడిన వాయికాలుష్యం - రసాయన వ్యర్థ ప్రవాహాలు
రక్షణ కవచ ఓజోన్ పొర వినాశకారక ఆయుధాలతో
ప్రకృతి హృదయాన్ని గాయపరచిన - పర్యవసానం ప్రకృతి ప్రకోపం

ప్రతీకారానంతర ప్రకాశవంత
ముఖారవిందం నీదైతే
చుట్టూ వున్న చీకటిని తిట్టుకుంటూ
సరిపెట్టుకోక
ఆపత్సమయాన ఆర్తులనాదుకున్న
ఆపన్న హస్తాలకు
అభినందనం..
అభివందనం.

- వేదం సూర్యప్రకాశం, నెల్లూరు
చరవాణి : 9866142006

ప్రకృతి ప్రకోపం
పెను విషాదాల భూకంపాలు
ప్రళయ భీకర తుపానులు
విలయ విధ్వంసక సునామీలు
ఉగ్ర నదుల వరద బీభత్సాలను
జ్ఞాపకాల పొదల్లో..్భద్రంగా
దాచుకుంటున్నాం..కానీ

వానలు.. మామూలు వానలు
చిన్నారుల కేరితంతల వానలు
ఒక హోరు గాలి.. ఒక ఉరుము..
మెరుపు లేని
మామూలు వానలు.. కుండపోత వానలు
నింపాదిగా..నిటారుగా..నిలబడి
వారాలపాటు కురిసిన వానలు
వాన పాముల్లాంటి వానల నడుమ
చినుకు పడితే...చెన్నపట్నం
చిగురుటాకులా...వణికిపోయిందంటే
ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు

నేలతల్లిని ముద్దాడి
సాగరాన్ని వడివడిగా చేరుకోవాలనే
నీటి చుక్కల ప్రవాహ ఆరాటాన్ని
నిలువెత్తు కాంక్రీటు కట్టడాలతో నిరోధిస్తే
నట్టింట్లోకి పడి సముద్రం నడిచిరాక
ఏం చేస్తుందీ?

ఎక్కడ పడితే అక్కడ గాయాలు చేసి
నెత్తురులా జలాల్ని పీల్చి వేస్తుంటే
పుడమితల్లి ఒక్కసారి ఒళ్లు
విదుల్చుకోకుండా ఎలా ఉంటుంది?

కొమ్మలి-రెమ్మల్ని, పువ్వుల్ని-కాయల్ని
తను ఎండినా మాను రూపంలో కాయాన్ని
సర్వస్వం మానవాళికి ధారపోస్తున్న
ప్రాణదాతలు వౌన వృక్షాలను
విచక్షణారహితంగా
నరికివేస్తుంటే
ప్రకృతి ప్రకోపానికి ప్రపంచం బలికాకుండా ఎలా ఉంటుంది?

- కుర్రా ప్రసాద్‌బాబు, ఒంగోలు
చరవాణి : 9440 660 988

స్పందన

సందేశాత్మక మెరుపు
గత వారం మెరుపలో ప్రచురించిన కవితలన్నీ సందేశాత్మకంగా సాగాయి. ప్రతి కవితా దేనికాదే పోటీ పడింది. ముఖ్యంగా కలలు..కన్నీళ్లు కవిత చదువుతుంటే మనసు ద్రవించింది. అలాగే ఏ రాజ్యాలు ఉదయిస్తాయో కవిత కూడా సమాజంలో జరిగే మారణకాండకు అద్దంపట్టింది. రచయితలు శివకుమార్, రవిశేఖర్ ఇద్దరూ గొప్ప కవితలను మనకు అందించారు. ధన్యవాదములు.
- కోటి ప్రభ, సూళ్లూరుపేట
- వై.్భస్కరరావు, రచయిత, మదనపల్లె.

దెప్పిపొడుపైనా జరుగుతున్న తంతే!
మెరుపులో ప్రచురితమైన ఇస్తినమ్మా వాయనం కథ చాలా బాగుంది. ముఖ్యంగా నేటి రచయితలకు ఇదో మొట్టిక్కాయ. ప్రస్తుతం జరుగుతున్న తంతు కూడా ఇదే. రచయితలు ఎక్కువమంది తమ కలానికి పదునుపెట్టకుండా తమను ఎలుగెత్తి చాటుకోవడానికే ప్రయాసపడుతున్నారు. ముఖ్యంగా సన్మానాలు, సత్కారాలకు ఆరాటపడుతున్న వారు ఎక్కువే. ఈ కథ ఇస్తినమ్మా వాయనం కూడా ఈ తరహా రచయితలకు చెంపపెట్టులాంటిది. ముఖ్యంగా రచయితలు సమాజానికి మార్గదర్శకులుగా ఉండాలనే భావన కలిగింది. ఈ కథ ఒకరకమైన దెప్పిపొడుపైనా ప్రస్తుతం ఎక్కువభాగం ఇదే వ్యవహారం సాగుతుంది అనే విషయాన్ని ఏ రచయిత అయినా అంగీకరించక తప్పదు.
- శ్యాంసుందర్, కవి, అల్లూరు
- నెమిలేటి రమ, తిరుపతి

మేల్కొలిపిన వృక్షాలపై కవితలు
మెరుపులో వృక్షాలపై ప్రచురించిన రెండూ కవితలూ బాగున్నాయి. అయితే వృక్ష విలాపం కవితలో చెట్లు పడే బాధను వర్ణించిన సూపర్. చెట్లు మానవళికి ఏరకంగా ఉపయోగపడుతున్నాయో కవితలో చూపిస్తూ వృక్షాల ఆవశ్యకతను అంతర్లీనంగా వర్ణించిన తీరు బాగుంది. చాకలకొండ శారద గారికి ఇలాంటి కొత్తేమి కాదు.
అలాగే చరిత్ర సృష్టిద్దాం కవిత కూడా బాగుంది. రచయితలు శారద, వెంకటరమణ గార్లకు ధన్యవాదములు.
- కోదండపాణి, లాయరుపేట, ఒంగోలు
- రవళి పెద్దిగొండ, కావలి

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

మనోగీతికలు

జాగృతులు
ఫలాలనిచ్చే చెట్టును
దాహం తీర్చిన చెలమను చూసాను
ఇచ్ఛాపూర్వక ఉదారత
అంటే ఏంటో తెలిసింది

గుప్పెడు మెతుకుల కోసం
గుంపుగా వాలిన కాకులను చూసాను
సమైక్యతలోని
మనోబలం విలువేంటో తెలిసింది

విహరించే విహంగాన్ని చూసాను
స్వేచ్ఛలోని సౌఖ్యం ఎంతగా
అంబరాన్ని చుంబిస్తుందో తెలిసింది

దగ్గరకొచ్చి
గోముగ తడిమే లేగను చూసాను
ఆప్యాయతలోని ఆర్థ్రతలో
ఎంతటి చెమరింపు వుందో
తెలిసింది

పట్టులోని
తేనెటీగల కోలాహలాన్ని చూసాను
సమరస భావాల సంగమ సాఫల్యత
ఎంత మధురంగా వుంటుందో
తెలిసింది

కుదురైన తీరుతో
నింపాదిగా నెమరేసే గోవును చూసాను
సాత్వికతలో
ఎంతటి ప్రశాంతత వుందో
అర్ధమయింది

అర్ధించే
ఓ అభాగ్యుడి కళ్లలోకి చూసాను
దైన్యతలోని నిస్సహాయత
ఎంత ఒంటరిదో తెలిసింది

నిజాలపై నిలబడ్డ విమర్శలను
చదివాను
సహేతుకతలోని ఓ అజ్ఞాత
బలమేదో
ధైర్యం రూపంలో గోచరించింది

అనుభవాల క్రోడీకరణ జరగాలి
అనుభూతుల విశే్లషణ కొనసాగాలి
సంఘటనలు సాధారణమే
కాని తృణప్రాయాలు కావు.
గుర్తెరిగితే అవి గోచరించే విలువల నేపధ్యాలు
దృశ్యాలు సామాన్యమైనవే
కాని మరునిమిషంలో మరచిపోయే
దుర్భల చిత్రాలు కావు.
శ్వాసిస్తే హృదయంలో పదిలపడే
విలువల జాగృతులు
అనుసరణలుగా అవి అలవాటయితే
అనువంశికంగా తరలిపోయే
సహజస్వాభావికలు.

విలువలను గుర్తెరగడమంటే
పదబంధాలతో కట్టేసి
నోటితో పిలుచుకొనే పేర్లుకావవి
మూలాలను తెలుసుకొని
మసలుకొనే జీవిత ఔన్నత్యాలు

తరచి చూస్తే మంచి చెడులు రెండే
దేనికి దూరమైనా మరో దానికి
దగ్గరైనట్లే
స్వార్ధాల సూత్రీకరణలో
మనిషి దూరాదూరాలను
లెక్కించుకొంటున్నాడు
గమ్యం తెలియని ఈ ప్రస్థానం ఆగేదీ కాదు
తెలియనంత వరకు
మనిషి పరిపూర్ణుడూ కాలేడు.

- కె.రవీంద్రబాబు, పాకాల
చరవాణి : 9052778988

కళ్లు
మెరుపులు మెరవాలంటే
ఆకసంలో మబ్బులు భేటీ కావాలి
వాన కురవాలంటే
సంద్రం అల్లకల్లోలమవ్వాలి
సముద్రపు ఆటుపోట్లు
నిరంతరం వున్నట్లే
సమాజపు కట్టుబాట్లూ సహజమే
గాఢనిద్రలో కనే కలలకు ప్రాణం వుంటే
అవి సునామిలై కూర్చుంటాయ్
కానీ కళ్లను చూడు ఎంత హాయిగా వుంటాయో!
అవి చూసే చూపులు చూడు
ఎంత నిబ్బరంగా వుంటాయో!
అలా అని వాటిని ఎలా నమ్మగలం?
ఒక అల ఓ తుఫానుని
మరో అల ఓ అలజడిని సృష్టించినట్టే
ఓ చూపు ఆత్మీయతని పంచితే
మరోచూపు ఆత్మాహుతుల్ని ప్రేరేపిస్తుంది
అందుకే అంటాను...
చూసే దాన్ని బట్టే ప్రపంచమని
నా కళ్లతో చూడు సమాజాన్ని
మానవత్వం పరిమళించే
మహా ప్రపంచం కనిపిస్తుంది
మరో కళ్లతో చూడు
అదే ప్రపంచం శూన్యంలా కనిపిస్తుంది
చూసే కళ్లకు సూర్యుడు సైతం
చిన్నగా కనిపిస్తాడు
అదే కళ్లకు చంద్రుడు కూడా
పెద్దగా కనిపిస్తాడు
అందుకే కళ్లను కుళ్లుతో
కాకుండా కళ్లతోనే చూద్దాం.

- సిరిమామిళ్ల కోటేశ్వరరావు, నెల్లూరు
చరవాణి : 9618127819

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 ౄళూఖఔఖశూబ్ఘశజ్ద్ఘూఇ్ద్య్యౄజ.శళఆ

email: merupunlr@andhrabhoomi.net

- అవ్వారు శ్రీధర్‌బాబు