అక్షర

అసహనంపై నిరసన గళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎదురుమతం’- కవితా సంపుటి
-షేక్ కరీముల్లా
వెల- 50 రూ.లు
ప్రతులకు: షేక్ మషరున్,
21-55, పెద్ద మసీదు బజారు,
వినుకొండ- 522647 (గుంటూరు జిల్లా)
ఆంధ్రప్రదేశ్
మరియు అన్ని ప్రముఖ విక్రయ కేంద్రాలు.

షేక్ కరీముల్లా రెండు దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్నాడు. అభ్యుదయ కవిగా మొదలైన ఆయన కవితాప్రస్తానం, ఆ తర్వాత దిశ మార్చి ‘ఇస్లాం వాదం’ పేరున కొనసాగింది. ఇప్పుడు ‘ప్రగతిశీల ముస్లిం సాహిత్యోద్యమం’ పేర కవిత్వం రాస్తున్నాడు. ఈ పరంపరలోనిదే ‘ఎదురుమతం’ కవితా సంపుటి. దీన్ని నవ్యాంధ్ర తొలి ముస్లిం కవితా సంపుటిగా పేర్కొన్నాడు కరీముల్లా.
సమాజంలో ఒక వర్గం పట్ల వివక్ష, అసమానతలు ఎదురవుతున్నాయని భావించిన కొందరు తెలుగు ముస్లిం కవులు సొంత బాణీ వినిపించడంతో ఆధునిక తెలుగు సాహిత్యంలో, ‘ముస్లిం-ఇస్లాం’ వాద కవిత్వం ప్రారంభమైంది. ఖాదిర్ మొహియుద్దీన్ పుట్టుమచ్చతో ప్రారంభమైన ఈ కవితా ధోరణి క్రమంగా బలపడింది. ‘సాయిబు’ కవితా సంపుటితో ఇస్లాం వాదానికి శ్రీకారం చుట్టాడు కరీముల్లా. సమాజంలో ముసల్మానుల పట్ల అసమానత, వివక్ష ఎక్కువైందని, ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదపు చర్య జరిగినా ముసల్మానులందరినీ అనుమానపు చూపులతో చూస్తున్నారన్నది వీరి ఆవేదన.
ఈ దేశంలో పుట్టిన ముసల్మానులకు ఇక్కడి మట్టివాసనే అంటుతుందని, ఇప్పుడు కొత్తగా తమ దేశభక్తిని నిరూపించుకోవలసిన అవసరం లేదన్నది ఈ కవుల వాదన.
ప్రస్తుత కవితా సంపుటి ‘ఎదురుమతం’ కూడా ఈ కోవకు చెందినదే. మెజారిటీ మతం అనుసరించే పద్ధతులకు ఇస్లాం ఆచరణ భిన్నంగా వుండటంతో వ్యవహారంలో ఇస్లాంను ఎదురుమతమనడం పరిపాటైంది. ఈ వైఖరిని ఖండిస్తూ తానెలా ఎదురుమతం వాడినవుతానంటూ! కరీముల్లా ప్రశ్నిస్తాడు.
ఈ సంపుటిలో మొత్తం 39 కవితా ఖండికలున్నాయి. ఇందుకు ‘ఎదురుమతం’ శర్షికతో రాసిన కవిత కవి మనసును పట్టిస్తుంది.
‘‘అవ్వల్ కల్మా చదివి/ అందరం ఒక్కటై అన్నందుకు/ అందరి దేవుడు ఒక్కడే అన్నందుకు/ మనిషిగా మారి జడివానై కురిసినందుకు మనువు చెరను వీడి/ మాయ మర్మాలు మరిచినందుకు/ ‘నేను ఎదురుమతం వాడినే’నంటూ దెప్పిపొడుస్తాడు కవి.
‘నిఖార్సయిన భారతీయుడ్నై/ చెమటచుక్కల నెలవంకనై/ జాతీయ జెండాకు పూచిన అత్తరు పువ్వునైనందుకు/నీకెప్పుడూ నేనెదురుమతం వాడినే’... అంటాడు.
కేవలం మతం మీదనే గాక తన సంస్కృతి, చరిత్రపై కూడా దాడి జరుగుతోందన్నది కవి ఆవేదన. ‘అప్పుడెపుడో/ కులీకుతుబ్ కట్టిన చార్మినార్/ నా జిందగీలో కర్ఫ్యూ ప్రకటిస్తుంది./ షాజహాన్ కట్టిన తాజ్‌మహల్ నా అస్తిత్వంపై ఎమర్జెన్సీ విధిస్తుంది. మనసుపంచే నా ముషాయిరా రాత్రుల్ని మాయం చేసిండ్రు/ సొగసు చూపే ఖవ్వాలీ సోయగాల్ని ఖతం చేసిండ్రు. దేశ సౌదానికి మూలస్తంభమైన/ నా శ్రమ చరిత్ర చెరచబడిందిక్కడ’అంటూ కవి తన బాధకుగల ఆరోపణల చిట్టా విప్పుతాడు. ‘నా వంకర చూపుకెప్పుడూ నా నడత ఎదురుమతం.... నేను ఎదురు మతమోడ్ని... నాది ఎదురుమతం.... అంతే! అంటూ కవి వ్యంగ్యంగా తన అస్తిత్వాన్ని చాటుతాడు.
ఇస్లాం భావజాలం, ముస్లింల జీవన పరిస్థితులు, సంస్కృతి, పండుగలు, పబ్బాల గురించి ఈ కవితల్లో కవి విస్తారంగా ప్రస్తావించాడు. తన సమాజంపై ప్రపంచీకరణ, అంతర్జాతీయ విపణి, రాజకీయ ప్రభావాల్ని గురించి విపులంగా చర్చించాడు. ‘పుట్టుక ప్రైవేటీకరించబడింది’, ‘యూరో ఉచ్చతాగుతున్న రూపాయి బిళ్ల’, ‘రాజ్యం ముసలి మంత్రగత్తె’ ‘పవిట జారవిడిచిన ప్రపంచీకరణ సుందరి’ వంటి పదప్రయోగాలు కవి చెప్పదలచుకున్న భావాలకు బలాన్ని చేకూర్చాయి.
‘నా పుట్టుకే ఒక గాయం/ ప్రియా! నిజం చెప్పాలంటే నేను పుట్టక మునుపూ ఒక గాయమే’... అంటూ నిస్పృహ, నిరాశను వ్యక్తం చేస్తూనే, ‘దేశం మూగదైపోతోంది/ ఒక పలుకునివ్వాలి/ దేశం అవిటిదై పోతోంది/ ఓ ఊతకర్ర నివ్వాలి/ దేశం దేశమంతా పచ్చి పుండయ్యింది/ ఒకింత పసరు నవ్వాలంటూ ఈ దేశ పునర్నిర్మాణంలో భాగస్వామి కావాలంటూ సానుకూల దృక్పధం వ్యక్తంచేస్తాడు.
‘అత్తరు బూబు’ పేరుతో రచించిన కవితలో ముస్లిం స్ర్తిల ఆత్మవిశ్వాసానికి ‘బూబు’ను ప్రతీకగా నిలిపాడు. ‘అత్తరు సీసాలమ్మే బూబుకు/ ఆ పర్దా ఎందుకని ప్రశ్నించిన వారికి ‘‘నువ్వు మేం కప్పుకున్న దేహతెరల్ని చూస్తున్నావు/ జారిపోయిన నీ విలువ అంగీని/ వెదుక్కోవడం లేదంటోంది’అంటూ బూబును ఒక సూఫీగా, ఒక పోరాటంగా వర్ణిస్తాడు. ఇప్పటిదాకా అత్తరు సాయిబుల గురించి రాశారే కానీ ఈ కవి అత్తరు బూబు గురించి రాయడం విశేషం.
ఇందులోని కవితల నిండా బాధిత ముస్లింల భావజాలమున్నా.... అక్కడక్కడ ‘‘వెనె్నలరాత్రుల పంచనామా అప్పుడే మొదలయ్యింది/ మరిన్ని నెలవంకల్ని కనే తీరాలి’/ నిజానికి పురిటినొప్పులు అందరికీ వుంటాయి/ మనుషుల్ని కొందరే కంటారు’’వంటి మెరుపులు కూడా వున్నాయి. అలాగే కలలన్నీ పాతవే/ పుట్టుకే కొత్తది కావాలి’/ కుర్తాపై అత్తరు వాసన/ కుక్షిలో కాలిన కమురు వాసన’’వంటి ప్రయోగాలు ఆకట్టుకుంటాయి.
ఈ సంపుటిలోని కవితలన్నీ ముస్లిం సమాజాన్ని ఉద్దేశించినవే అయినా దాని వెనుక గురవుతున్న అసహనం, వివక్ష, అసమానత, నిర్లక్ష్యాన్ని సమాజంలోని ఇతర వర్గాలు కూడా గమనించాల్సిన అవసరాన్ని కవి చెప్పకనే చెప్పాడు. సమస్యలు ముస్లిం సమాజానివే అయినా ఇతరవర్గాలు కూడా చదవతగ్గ కవితలు ఇందులో వున్నాయి.

-ఎ.రజా హుస్సేన్