విభ్రాంతి - నిజాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జీవితంకన్నా
భయపెట్టేది
ఆశ్చర్యం గొలిపేది
సంతోషపరచేది
ఏమన్నా ఉందా ఈ ప్రపంచంలో?’
అన్నాడో తెలుగు కవి. భయపెట్టటం, ఆశ్చర్యం గొలపడమే కాదు. అనుకోని సంఘటనతో విభ్రాంతికి కూడా గురి చేస్తుంది. జీవితం అనుకోని సంఘటనలతో విభ్రాంతికి గురైనప్పుడు మనకు వ్యతిరేక ఆలోచనలు వస్తాయి. జీవితం మీద విరక్తి కూడా కలుగుతుంది. మనలో చాలామందికి ఇలాంటి భావనలే వస్తాయి. చాలా కొద్దిమంది మాత్రమే ఆ షాక్ నుంచి తేరుకొని సానుకూలంగా ఆలోచిస్తారు.
విభ్రాంతికి గురి కావడం అనేది సృష్టి సహజగుణం. చిన్నదో పెద్దదో షాక్‌కి గురి కాని వాళ్లు ఈ ప్రపంచంలో ఎవరూ వుండరు. అయితే ఆ అననుకూల స్థితి నుంచి పాఠాలని కొంత మంది మాత్రమే నేర్చుకుంటారు. వాళ్లే గొప్పవాళ్లవుతారు. మనుషులవుతారు. గొప్ప వాళ్లేమీ కావాల్సిన అవసరం లేదు. కానీ మంచి మనిషిగా మారడం అందరికీ అవసరమే.
ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమెట్‌ని కనుగొన్నాడు. ఆయుధాలను తయారుచేసే ఎన్నో కంపెనీలను నెలకొల్పాడు. ప్రపంచంలో ఎవరూ ఊహించలేనంత డబ్బుని సంపాదించాడు. 1888వ సం.లో అతని సోదరుడు మరణించాడు. నోబెల్ చనిపోయాడని చాలామంది అనుకున్నారు. చాలా పత్రికల్లో నోబెల్ చనిపోయాడని వార్తలు కూడా ప్రచురితమయ్యాయి. ఒక పత్రిక అతని మరణం గురించి ఈ విధంగా పేర్కొంది.
‘గతంలో ఎప్పుడూ లేనంత త్వరగా మనుషులని చంపే వస్తువుని కనుక్కొని ధనవంతుడైన నోబెల్ నిన్న మరణించాడు’
ఈ వార్త చదివి నోబెల్ షాక్‌కి గురైనాడు. కానీ అతను చెడు భావనలని తన దగ్గరకు రానివ్వలేదు. ఆ వార్త సానుకూల దృక్పథంతో చూశాడు. 1895 సంవత్సరంలో స్వీడిష్ నార్వే క్లబ్‌కి నోబెల్ తన యావదాస్తిని ధారాదత్తం చేస్తూ వీలునామా రాశాడు. తన యావదాస్తితో ఐదు నోబెల్ బహుమతులని ఏర్పాటు చేశాడు. అందులో అతి ముఖ్యమైంది నోబెల్ శాంతి బహుమతి.
విభ్రాంతికి గురి కావడం సర్వసామాన్యం. సృష్టిలో భాగం. సానుకూల దృక్పథం వుంటే అది మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనల్ని ఆలోచింపజేస్తుంది. మన వ్యక్తిత్వం వికాసం చెందుతుంది.
నోబెల్ లాంటి వ్యక్తులే కాదు మామూలు వ్యక్తులు కూడా ముందుకు నడుస్తారు. ఓ మామూలు మహిళ గురించి చెబుతాను. ఆమె బి.ఏ. చదువుతుండగా ఓ వ్యక్తితో పరిచయం అయి వివాహానికి దారి తీసింది. ఓ ఆరునెలల పాటు సంసారం చేసి ఆమెను వదిలిపెట్టాడు. చివరికి విడాకులకు వెళ్లారు. ప్రేమించిన వ్యక్తే మోసం చేయడం ఆమెను తీవ్రమైన షాక్‌కి గురైంది. విడాకులు మంజూరయ్యే నాటికి ఆమెకు ఓ కొడుకు. ఏం చెయ్యాలో తోచలేదు. కోర్టు చుట్టూ తిరిగిన తరువాత ఆమెకు ‘లా’ చదవాలన్న కోరిక కలగింది. ‘లా’ చదివింది. న్యాయవాదిగా మారింది. కొంతకాలం జూనియర్‌గా ఆ తరువాత స్వయంగా ప్రాక్టీస్ చేసింది. ఏడు సంవత్సరాల తరువాత జిల్లా జడ్జి పరీక్ష రాసి జిల్లా జడ్జిగా ఎంపికైంది. ఆమె న్యాయమూర్తి అవుతానని జీవితంలో ఎప్పుడూ కల గనలేదు. ఏ కుటుంబం న్యాయస్థానం చుట్టూ తిరిగిందో అలాంటి కుటుంబ న్యాయస్థానానికే ఆమె న్యాయమూర్తిగా ఎంపికైంది. ఉన్నత న్యాయస్థానానికి న్యాయమూర్తి అయ్యే అవకాశం కూడా ఆమెకు ఉంది. బి.ఎ. కూడా పూర్తి చేయని స్ర్తి జీవితంలో షాక్‌కి గురై తేరుకొని ఉన్నత శిఖరాలకి చేరింది. దానికి కారణం ఆమె సానుకూల దృక్పథం.
జీవితంలో అందరికీ షాక్‌లకి గురయ్యే సంఘటనలు ఎదురవుతాయి. కానీ వాటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు అందరికీ వున్నా ఎదుర్కొనే ప్రయత్నం చేయరు. ఓడిపోయినట్టుగా భావించి జీవితంలో రాజీ పడతారు. సానుకూల దృక్పథంతో ఆలోచించి బంతిలాగా ఎగిరే ప్రయత్నం చేయరు.
విభ్రాంతి అనేది మన మెదడుని ఉత్సాహపరిచేలా మలుచుకోవాలి. షాక్ అనేది మనకు తెలియని మన శక్తిని బయటకు తీస్తుంది. సృజనాత్మకంగా ఆలోచిస్తే మంచి నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. పట్టాలు తప్పిన బండిని పట్టాల మీదికి తెచ్చి నడిపిస్తుంది.
అయితే సానుకూల దృక్పథం వున్నప్పుడే షాక్ అనేది సానుకూలంగా మన జీవితాలని మలుస్తుంది. షాక్‌ని పాఠాలు నేర్చుకోవడం కోసం వినియోగించుకోవాలి కానీ కోపం కోసం వినియోగించకూడదు.జీవితంలో షాక్‌లు లేని వాళ్లు ఎవరూ లేరు. సానుకూల దృక్పథంతో ఎదుర్కొంటూనే నేలను తాకిన బంతిలా పైకి ఎగరగలం.