జాతీయ వార్తలు

మళ్లీ జాట్ల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జూన్ 5: రిజర్వేషన్లను డిమాండ్ చేస్తూ జాట్ సామాజికవర్గ నాయకులు హర్యానాలో మళ్లీ ఉద్యమానికి ఉద్యుక్తులయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణకు భారీ మొత్తంలో రాష్ట్ర పోలీసు బలగాలతోపాటు 5 వేల మందికి పైగా పారామిలటరీ సిబ్బందిని మోహరించినప్పటికీ ఏమాత్రం ఖాతరు చేయని జాట్ నాయకులు రోహ్తక్ జిల్లాలో తమ ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్న జస్సియా గ్రామంలో ఆదివారం హవనాన్ని నిర్వహించి తాజాగా ఆందోళన ప్రారంభించారు. రిజర్వేషన్ల సాధన కోసం ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాలని ఎఐజెఎఎస్‌ఎస్ (అఖిల భారత జాట్ అరక్షణ్ సంఘర్ష్ సమితి) ఇచ్చిన పిలుపు మేరకు వీరంతా జస్సియా గ్రామానికి వెలుపల రోహ్తక్- పానిపట్ రహదారి వెంబడి గుడారాలు వేసుకుని కూర్చున్నారు. మరోవైపు జాట్లకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎఐజెఎఎస్‌ఎస్ రాష్ట్రంలోని 21 జిల్లాలకు గాను 15 జిల్లాల్లో ధర్నాలు నిర్వహిస్తోంది. శాంతియుతంగా ఈ ధర్నాలను నిర్వహించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఎఐజెఎఎస్‌ఎస్ హిసార్ శాఖ అధ్యక్షుడు రామ్‌భగత్ మాలిక్‌తోపాటు మరికొందరు ఇతర జాట్ నాయకులు స్పష్టం చేశారు. కాగా, జాట్లకు రిజర్వేషన్లు కల్పించడంతోపాటు గతంలో తమ సామాజిక వర్గానికి చెందిన ఉద్యమకారులపై పోలీసులు నమోదు చేసిన ‘తప్పుడు’ కేసులను ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని జస్సియా గ్రామానికి చెందిన జాట్ నాయకుడు ఒకరు తెలిపారు. జాట్లు మళ్లీ ఉద్యమానికి దిగడంతో రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు సిఆర్‌పిఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఐటిబిపి, బిఎస్‌ఎఫ్ దళాలకు చెందిన 55 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు. వీరంతా రాష్ట్ర పోలీసులతో కలసి రోహ్తక్, సోనీపట్, భివానీ, హిసార్, జింద్, కైతాల్, ఝజ్జర్ తదితర సమస్యాత్మక పట్టణాల్లో ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించడంతోపాటు రాష్ట్రంలోని జాతీయ రహదారులు, రైల్వే ట్రాకుల వెంబడి గస్తీ తిరుగుతున్నారు.

chitram..
రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ సోనీపట్‌లో ధర్నా చేస్తున్న జాట్ కులస్థులు