జాతీయ వార్తలు

విశ్వాసమే పునాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: భారత్, పాకిస్తాన్ మధ్య తాజాగా మొదలైన శాంతి చర్చలు పరస్పర విశ్వాస ప్రాతిపదికగానే ముందుకు సాగుతాయని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సోమవారం లోక్‌సభలో ప్రకటించారు. పాకిస్తాన్‌తో మళ్లీ చర్చలు ప్రారంభించాలన్న నిర్ణయాన్ని అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే తీసుకోవడం జరిగిందని ఆమె వెల్లడించారు. గతంలో మాదిరిగా కాకుండా ఎలాంటి అవరోధాలకు తావులేని విధంగా ఇరు దేశాల చర్చలను ముందుకు తీసుకెళ్లాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. ఉగ్రవాద శక్తులు అడుగడుగునా అడ్డుపడుతున్నా వాటిని ఖాతరు చేయకుండా ఆ సవాళ్లను అధిగమించి మరీ ఈ చర్చలు ముందుకు సాగగలవన్న ధీమాను ఆమె వ్యక్తం చేశారు. ఇటీవల పాకిస్తాన్‌లో తాను జరిపిన పర్యటన, అలాగే ఆ దేశ ప్రధాన మంత్రి, జాతీయ భద్రతా సలహాదారుతో జరిపిన చర్చల వివరాలను సభకు నివేదించారు. రెండు దేశాల మధ్య పెరిగిపోతున్న విశ్వాస రాహిత్యాన్ని తొలగించాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్న సుష్మా స్వరాజ్ తాము చేపట్టిన ‘సమగ్ర చర్చల ప్రక్రియ’ను గట్టిగా సమర్థించుకున్నారు. దక్షిణాసియా ప్రాంతంలో సుస్థిర శాంతి భద్రతలకు భారత్, పాక్‌ల మధ్య సన్నిహిత సంబంధాలు ఎంతో అవసరమని అన్నారు. ఇప్పటివరకు విదేశాంగ కార్యదర్శుల స్థాయిలోనే రెండు దేశాల మధ్య చర్చలు జరిగేవని, ఇప్పుడు వీటి స్థాయిని పెంచి జాతీయ భద్రతా సలహాదారుల మధ్యే ఈ చర్చలు జరిగేలా వ్యవస్థాగతమైన ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండానే అన్యదేశ జోక్యానికి ఆస్కారం లేకుండానే ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు బ్యాంకాక్‌లో సమావేశమైన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. అంతకుముందు ఉఫా సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే బ్యాంకాక్ సమావేశం ఏర్పాటయిందన్నారు. పాకిస్తాన్‌తో చర్చలను చేపట్టేందుకు తమ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు పార్లమెంటు మద్దతు ఎంతో అవసరమని తెలిపారు. రాజ్యసభలోనూ తన పర్యటనపై ప్రకటన చేసిన సుష్మా స్వరాజ్, సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఉభయ సభల్లో కూడా సుష్మా స్వరాజ్ పాకిస్తాన్ పర్యటనకు సంబంధించి సభ్యులు అనేక రకమైన అంశాలను ప్రస్తావించారు. గతానుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటే పాకిస్తాన్‌ను ఎంతమాత్రం విశ్వసించలేని పరిస్థితి నెలకొందని, ఈ నేపథ్యంలో తాజా చర్చలు ఎంతమేరకు సఫలమవుతాయని ప్రశ్నించారు. వివిధ పార్టీలకు చెందిన 13మంది సభ్యులు ఈ అంశంపై మాట్లాడారు.

చిత్రం... లోక్‌సభలో మాట్లాడుతున్న సుష్మా స్వరాజ్