జాతీయ వార్తలు

ఆరోపణలు చేస్తారు.. వివరణ వినిపించుకోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 15: లోక్‌సభలో నెలకొంటున్న ప్రతిష్టంభనను తొలగించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసేందుకు తాను సిద్ధమేనని స్పీకర్ సుమిత్రా మహాజన్ మంగళవారం లోక్‌సభలో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి రోజు ఏదో ఒక అంశాన్ని లేవదీసి ప్రధాన మంత్రి, ఎన్‌డిఏ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ పార్లమెంటును స్తంభింపజేయడంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పందిస్తూ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను సభ్యుల ముందు పెట్టారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ కాంగ్రెస్ సభ్యులు లోక్‌సభను స్తంభింపజేస్తున్నారు, ఇది మంచి విధానం కాదు, ప్రభుత్వంపై ఇష్టానుసారం ఆరోపణలు చేసి, ప్రభుత్వం ఇచ్చే వివరణను వినకుండా సభనుంచి వెళ్లిపోవటం ఏమిటని నిలదీశారు. రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను లోక్‌సభలో ప్రస్తావించటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును అరికట్టవలసిన అవసరం ఉన్నదన్నారు. సభ కొనసాగాలని పలు ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి, అందుకే వారు వాకౌట్‌లో పాల్గొనకుండా సభలో ఉండిపోతున్నారనే విషయాన్ని గ్రహించాలని ఆయన స్పీకర్‌కు సూచించారు. కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ నిర్ణయాలను కూడా గౌరవించటం లేదని ఆరోపించారు. పార్లమెంటును కొందరు సభ్యులు ఇలా దుర్వినియోగం చేయటం ఎంతవరకు సబబు, ఈ తప్పుడు విధానాన్ని అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ప్రభుత్వాన్ని కొందరు వ్యక్తులు అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వెంకయ్యనాయుడు అన్నారు.
దురాగతాలు ఎక్కడ జరిగినా ఖండించాల్సిందేనని, కాని ప్రతిదానికి ప్రభుత్వాన్ని నిందించటం సరికాదని వెంకయ్యనాయుడు అన్నారు. కల్‌బుర్గి హత్యాకు కర్నాటక ప్రభుత్వాన్ని, దబోల్కర్ సంఘటనకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, దాద్రీ సంఘటనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలంటే కుదురుతుందా? అని ఆయన ప్రశ్నించారు. లోక్‌సభను తామంతా గౌరవిస్తాం, సభ సజావుగా కొనసాగాలని అధికారపక్షంతోపాటు పలు ప్రతిపక్షాలు కూడా కోరుకుంటున్నాయని అన్నారు. ఒకటి, రెండు పార్టీలు తమ ఇష్టానుసారం ఆరోపణలు చేసి ఆ తరువాత వాకౌట్ చేయటం ప్రజాస్వామ్య విరుద్ధం, దీనిని కొనసాగనివ్వకూడదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షం అధికార పక్షాన్ని కూడా గౌరవించాలి కదా? అని సూచించారు. దీనికి స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పందిస్తూ అన్ని పార్టీల సభ్యులు అంగీకరిస్తే ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం జరిపేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. లోక్‌సభ సజావుగా కొనసాగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనేది మీరే చెప్పాలని ఆమె సభ్యులను కోరారు. సభలో గొడవ జరగటం వలన సభ్యులందరి అవకాశాలు దెబ్బతింటున్నాయనేది నిజం, ఈ సమస్యను పరిష్కరించేందుకే అందరూ సహకరించాలని సుమిత్రా మహాజన్ విజ్ఞప్తి చేశారు.

లోక్‌సభలో మాట్లాడుతున్న వెంకయ్య నాయుడు