జాతీయ వార్తలు

మొక్కవోని ధైర్యం.. స్థయిర్యం షర్మిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 26: పదహారేళ్లపాటు ఎడతెగని పోరాటం ఆమెది. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ఏళ్ల తరబడి నిరాహార దీక్ష చేస్తున్న ఇరోమ్ షర్మిల ఇనే్నళ్లూ బలవంతంగా ఎక్కిస్తున్న ద్రవ పదార్థాలతోనే మనుగడ సాగిస్తూ వచ్చారు. ఆమెపై ఆత్మహత్య యత్నం కేసుపెట్టిన ప్రభుత్వం జుడీషియల్ కస్టడీలోనే ఉంచింది. 2000లో ఇంఫాల్ సమీపంలోని ఓ గ్రామంలో సాయుధ దళాల చేతిలో పది మంది అమాయకులు బలైన నాటినుంచి ఈ ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దుచేయాలన్న డిమాండ్‌తో ఆమె చేపట్టిన నిరాహార దీక్ష ప్రపంచంలోనే కనివినీ ఎరుగనిది. ఎంతగా వత్తిడి వచ్చినా ఆమె నిరాహారదీక్ష నుంచి బెసగలేదు. అంతిమ లక్ష్యం సాధించేవరకూ ఈ నిరసన కొనసాగిస్తానని ప్రకటించిన షర్మిల ఆత్మస్థయిర్యం ఏ దశలోనూ తగ్గలేదు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ముసుగులో అనేకమంది అమాయకులను బలిపెడుతున్నారంటూ ఆమె చేసిన ఆరోపణలు ఇప్పటివరకూ కూడా ప్రభుత్వాల మనసుకరిగించలేదు. ఒక్క మణిపూర్‌లోనే కాకుండా కాశ్మీర్, పలు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఈ చట్టం అమలులో ఉంది. దాదాపు 16 సంవత్సరాలపాటు ద్రవ పదార్థాలపైనే అదీ బలవంతంగా ఎక్కిస్తున్న వాటిపైనే ఆధారపడి జీవించడం అన్నది షర్మిల నిర్ధేశించుకున్న లక్ష్య పటిమకు నిదర్శనం. ఇనే్నళ్లు గడిచినా ఎఎఫ్‌ఎస్‌పిఏ చట్టాన్ని ప్రభుత్వం తొలగించే అవకాశాలు ఏకోశానా కనిపించడం లేదు. ఆమె దీక్ష మొదలెట్టిన రోజునే ఎన్నో రకమైన వత్తిళ్లు వచ్చాయి. విమర్శలూ వచ్చాయి. పేద కుటుంబం నుంచి వచ్చిందని నిరవధిక నిరాహారదీక్ష చేస్తే ఎవరో డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చి ఉంటారని.. ఇలా ఒకటి కాదు ఎన్నోరకాలుగా ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయి. ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఆమె పట్టుదల పెరుగునే వచ్చింది తప్ప వెనక్కి తగ్గలేదు. షర్మిల మాదిరిగానే కొందరు మహిళలు కూడా నిరాహారదీక్ష చేపట్టినా వారు ఏదో ఒక దశలో ప్రభుత్వానికి అనుకూలంగా మారిపోయారు. వారికి అవార్డులను కూడా ప్రభుత్వం కల్పించింది. కానీ షర్మిల మాత్రం నిర్ధేశించుకున్న మార్గం నుంచి వెనుదిరగలేదు. శారీరకంగా, మానసికంగా శుష్కించుకుపోయే పరిస్థితులు తలెత్తినా ఆత్మస్థయిర్యాన్ని కోల్పోలేదు. అమాయకుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఇనే్నళ్లూ ఆమె సాగించిన నిరాహారదీక్ష అనుకున్న ఫలితాలను సాధించిందా లేక లక్ష్యానికి ఆమడ దూరంలోనే ఆమె ఉద్యమాన్ని విరమిస్తున్నారా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఐరన్ లేడీ అన్నమాటకు నిజమైన అర్థాన్ని ఇచ్చే వ్యక్తిత్వం, అకుంఠిత పట్టుదల షర్మిల సొంతం అనిచెప్పడానికి ఇనే్నళ్ల దీక్షే నిదర్శనం. ఇదేదో తన స్వార్థంకోసం కాకుండా అమాయకుల వేదన, ఆవేదనకు అద్దం పడుతూ ఈ నిరవధిక దీక్షను చేపట్టడమే ఆమెలో ఎప్పటికప్పడు కొత్త శక్తిని, ధైర్యాన్ని ఆశను అందించాయని భావించాలి.