జాతీయ వార్తలు

సాయంతోనే సరా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలా? లేక ప్రత్యేక ఆర్థిక సాయం చేయాలా అన్న దానిపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఏపికి ఇవ్వాల్సిన ప్రత్యేక ఆర్థిక సహాయ ప్యాకేజీ సిద్ధమవుతోందంటూ పార్లమెంట్ ఆవరణలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం విలేఖరులకు నర్మగర్భంగా చెప్పారు. అయితే, ప్యాకేజీ ఇవ్వటం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే చిక్కులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఆర్థిక సాయం మాత్రమే ప్రకటించే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అందుకే ఆయన బుధవారం పార్లమెంటు ఆవరణలో తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ, ప్రత్యేక ప్యాకేజీలో ఆర్థిక సహాయంతోపాటు ఒకటి, రెండు రాయితీలు కూడా ప్రకటించే అవకాశం ఉన్నదని తెలిపారు. ప్యాకేజీపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ‘కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాలకు సంబంధించిన తొంభై శాతం ఖర్చును కేంద్రమే భరిస్తోంది. మరికొన్ని పథకాలకు సంబంధించిన ఖర్చులో కేంద్రం డెబ్భై శాతం భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం మిగతా ముప్ఫై శాతం ఖర్చును భరిస్తోంది. ఏపికి ప్రకటించే ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఇప్పుడు 70శాతం ఖర్చును భరిస్తున్న కోర్ పథకాలకు కూడా తొంభై శాతం ఖర్చును కేంద్రమే భరిస్తుంది’ అని అరుణ్‌జైట్లీ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటికే రెండు పన్ను రాయితీలు కల్పించామని, ఇప్పుడు మరో పన్ను రాయితీ కల్పించే విషయం పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏదోఒకటి చేయవలసి ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏపికి ప్రకటించవలసిన ప్యాకేజీపై అరుణ్‌జైట్లీతో సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి సుజనా చౌదరి చర్చలు జరుపుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఏపికి ప్యాకేజీకి తుది రూపం ఇవ్వాలనుకున్నారు. అయితే వెంకయ్యనాయుడుకు స్వల్ప అస్వస్థత చేయటంతో చర్చల ప్రక్రియ ఆగింది. ఆయన కోలుకోగానే ముగ్గురు నేతలు సమావేశమై ప్యాకేజీకి తుదిరూపం ఇస్తారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాపై ఇటీవల నిర్వహించిన బంద్ విజయవంతం కావటంతో తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కొంత ఆందోళనలో ఉంది. ఏపికి వీలున్నంత త్వరగా ప్రత్యేక ప్యాకేజీని సాధించడం ద్వారా తమ ప్రతిష్ఠను కాపాడుకోవాలని తాపత్రయ పడుతోంది. అందుకే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తెస్తోంది.
ప్రత్యేక ఆర్థిక సహాయం దేనికి?
కేంద్ర ప్రభుత్వం ఏపికి ప్రత్యేక ఆర్థిక సహాయం ఇస్తుంది తప్ప ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించకపోవటానికి ప్రభుత్వ వర్గాల నుంచి బలమైన కారణాలే వినిపిస్తున్నాయి. ఒకవేళ ఏపికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తే, మరుక్షణం నుంచీ బిహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా తదితర రాష్ట్రాలు తమకు కూడా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అందుకే ప్రత్యేక ప్యాకేజీ స్థానంలో ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందజేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ప్రత్యేక ఆర్థిక సహాయం చేసే పక్షంలో దీని గురించి ప్రత్యేకంగా ప్రకటించవలసిన అవసరం కూడా ఉండదని బిజెపి నాయకులు చెబుతున్నారు.ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ఐదు సంవత్సరాల పాటు విడుదల చేస్తే సరిపోతుందని వారంటున్నారు. ప్రతి సంవత్సరం రెండు వేల కోట్ల ఆర్థిక సహాయం చేసినా ఐదు సంవత్సరాలకు ఇది పది వేల కోట్ల రూపాయలకు మించదని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక ఆర్థిక సహాయం కింద వివిధ పథకాలకు సంబంధించి అదనంగా ముప్ఫై శాతం నిధులను ఏపికి అందజేస్తే సరిపోతుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తరువాతనే అందజేస్తారని బిజెపి సీనియర్ నాయకుడొకరు తెలిపారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ప్రకటిస్తే ఇతర పార్టీలు ఉభయ సభల్లో గొడవ చేసే అవకాశం ఉందని బిజెపి నాయకులు అంటున్నారు. ఇవేవీ జరగకుండా చూసుకోవాలంటే వర్షాకాల సమావేశాలు ముగిసిన తరువాత ఏపికి ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందజేసే సరిపోతుందని వారంటున్నారు.