జాతీయ వార్తలు

సరోగసీ బిల్లుకు కేబినెట్ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: అద్దెగర్భం వ్యాపారమయం కాకుండా నిరోధించే బిల్లుకు కేంద్ర మంత్రిమండలి బుధవారం ఆమోదం తెలిపింది. కేవలం చట్టపరంగా భార్యాభర్తలైన భారతీయులకు మాత్రమే అద్దెగర్భం ద్వారా సంతానాన్ని పొందేలా ఈ బిల్లును రూపొందించారు. సరోగసీ నియంత్రణ బిల్లు-2016ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అద్దెగర్భం విధానాన్ని వ్యాపారమయం చేసి అనైతిక చర్యలను నిరోధించటం కోసం ఈ బిల్లును తీసుకువస్తున్నారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి రూ.10లక్షల వరకు జరిమానా, పదేళ్ల జైలు శిక్ష విధించే విధంగా నిబంధనలు రూపొందించారు. ఈ బిల్లు అద్దెగర్భం వ్యాపారమయం చేయటాన్ని పూర్తిగా నిషేధిస్తుంది. విదేశీయులు, ప్రవాస భారతీయులు, విదేశాల్లో ఉండే భారతీయ పౌరులు, సహజీవనం చేస్తున్న దంపతులు, సింగిల్ పేరెంట్లు, హోమో సెక్సువల్‌లు అద్దె గర్భం ద్వారా పిల్లల్ని పొందటం నిషేధమవుతుందని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కేబినెట్ సమావేశం అనంతరం తెలిపారు. ఒకసారి ఈ బిల్లు చట్టంగా మారితే, భారతీయ దంపతులు కనీసం అయిదేళ్లు కాపురం చేసిన తరువాత కానీ, అద్దెగర్భం ద్వారా సంతానం పొందటానికి వీలుండదని సుష్మ స్పష్టం చేశారు. అది కూడా వారి సమీప బంధువుల ద్వారా మాత్రమే పొందాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. నిస్వార్థ, పరోపకార విధానం ప్రకారం అంగీకరించిన పద్ధతిలోనే అద్దెగర్భాన్ని అనుమతిస్తారు. ఈ పద్ధతి ద్వారా సంతానం పొందాలనుకునే మహిళ వయసు 23 నుంచి 50 ఏళ్ల మధ్యన ఉండాలని, ఆమె భర్త వయస్సు 26 నుంచి 55 సంవత్సరాల మధ్యలో ఉండాలని సుష్మ వివరించారు. అద్దెగర్భం ద్వారా జన్మించిన శిశువుకు సాధారణంగా జన్మించే శిశువుకు ఆస్తిపై ఉండే అన్ని హక్కులూ సంక్రమిస్తాయని సుష్మ పేర్కొన్నారు. దేశంలో 2వేల సరోగసీ క్లినిక్‌లు ఉన్నాయని వీటన్నింటినీ క్రమబద్ధీకరిస్తామని ఆమె తెలిపారు. అంతే కాకుండా దీనికి సంబంధించి జాతీయ సరోగసీ బోర్డును కూడా ఏర్పాటు చేస్తామని ఆమె వివరించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెడతామని ఆమె చెప్పారు. వారి సమీప బంధువుల ద్వారానే సరోగసీ పొందాల్సి ఉంటుందని ఆమె వివరించారు. ఈ బిల్లు ప్రకారం అవివాహిత జంటలు, సింగిల్ పేరెంట్స్, సహజీవనం చేస్తున్నవారు, హోమో సెక్సువల్స్ సరోగసీ విధానంలో పిల్లలను కనడానికి వీలుండదు. వాణిజ్యపరంగా సరోగసీకి భారత్ కేంద్రంగా మారిన పరిస్థితుల్లో దానిని దుర్వినియోగం కాకుండా చూసేందుకు ప్రభుత్వం ఈ బిల్లు తెస్తోంది.