జాతీయ వార్తలు

రోశయ్య స్థానంలో ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఆగస్టు 31: తమిళనాడుకు కొత్త గవర్నర్ ఎవరు కానున్నారు? కొణిజేటి రోశయ్య అయిదేళ్ల పదవీకాలం బుధవారం ముగియటంతో కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగించింది. అయితే రోశయ్యను మరో అయిదేళ్లపాటు కొనసాగించాలనే జయలలిత భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు రోశయ్యనే తమిళనాడు గవర్నర్‌గా కొనసాగించాలని జయ కేంద్రాన్ని కోరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే బిజెపి మాత్రం కర్ణాటకకు చెందిన డిహెచ్ శంకరమూర్తిని తమిళనాడు గవర్నర్‌గా నియమించేందుకు యత్నిస్తోందని సమాచారం. కావేరీ నదీజలాల విషయంలో కర్ణాటకతో ఇప్పటికే విభేదాలున్నందున జయలలిత శంకరమూర్తి నియామకాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తికాలం అధికారంలో ఉన్న కొద్దిమంది కాంగ్రెస్ గవర్నర్‌లలో రోశయ్య ఒకరు. ఏపి, తెలంగాణ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, జమ్ము కశ్మీర్ గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా, ఉత్తరాఖండ్ గవర్నర్ కెకె పాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌లు కాంగ్రెస్ హయాంలో నియమితులైనవారే. రోశయ్య కాంగ్రెస్ పార్టీలో కురువృద్ధ నాయకుడు. దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో పార్టీపరంగా, ప్రభుత్వపరంగా అనేక పదవులను అధిష్ఠించారు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మృతి అనంతరం కొద్ది నెలల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తరువాత తమిళనాడు గవర్నర్‌గా నియమితులయ్యారు. బుధవారంతో ఆయన పదవీకాలం పూర్తి కావటంతో మహారాష్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావుకు అదనపు బాధ్యతలు కేంద్రం అప్పగించింది. అయితే పూర్తిస్థాయి గవర్నర్‌గా ఎవరిని నియమిస్తారన్నది సందిగ్ధమే. గత 40 ఏళ్లుగా తమిళనాడులో అధికారం చెలాయిస్తున్న రెండు ద్రవిడ పార్టీలు (డిఎంకె, అన్నాడిఎంకె) తమకు అనుకూలంగా ఉండేవారికోసమే ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు ఎవరిని గవర్నర్‌గా నియమిస్తుందన్నది వేచిచూడాలి. మరోవైపు గుజరాత్ గవర్నర్‌గా ఉన్న ఓంప్రకాశ్ కోహ్లీ మధ్యప్రదేశ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న రాంనరేష్ యాదవ్ పదవీకాలం సెప్టెంబర్ 7తో ముగుస్తుంది.