రాష్ట్రీయం

‘హోదా’ ఉద్యమానికి పవన్ సారథ్యం మేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 13: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉద్యమానికి సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సారథ్యం వహిస్తే మేలన్న అభిప్రాయాన్ని కాంగ్రెస్ నేత, సామాజికవేత్త బొలిశెట్టి సత్యనారాయణ వ్యక్తం చేశారు. ఎంపీలను నిలదీయాలని, వారు రాజీనామా చేస్తారో? ఉద్యమానికి సహకరిస్తారో? చూడాలన్నారు. విశాఖలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మట్లాడుతూ దాదాపు రెండున్నర సంవత్సరాలుగా హోదాపై నెలకొన్న అనేక మలుపులకు చివరకు తెరపడిందన్నారు. కేంద్ర ప్యాకేజీని ముఖ్యమంత్రి స్వాగతించడంతో ఈ అంశానికి తెరపడినట్లేనన్నారు. హోదా వస్తే పన్ను రాయితీలు ఉంటాయని, పరిశ్రమలు, గ్రాంట్‌లు వస్తాయని గుర్తు చేశారు. ప్యాకేజీని అంగీకరించడం చంద్రబాబు బలహీనత అని విమర్శించారు. రాష్ట్రం దివాళా తీసిన పరిస్థితిలో ప్యాకేజీ లేకపోతే ప్రభుత్వాన్ని నడపలేరన్న భావనతో అంగీకరించి ఉండవచ్చన్నారు. రాష్ట్రానికి హోదా ఇవ్వాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఈ నెల 4న హెచ్చరించారని గుర్తు చేశారు. రాష్ట్రానికి హోదా ఇవ్వాలని వైకాపా, కొన్ని ఇతర పార్టీలు ఆందోళన చేస్తున్నాయని తెలిపారు. వైకాపా చేపడుతున్న ఉద్యమంపై ప్రజల్లో నమ్మకం లేదన్నారు. హోదా అన్న యువతకు సంబంధించిన అంశమని, ఉపాధి అవకాశాలను ప్రభావితం చేస్తుందన్నారు. ఇది తెలంగాణ ఉద్యమం కంటే కీలకమైనదన్నారు. రాష్ట్రానికి హోదా అన్నది ఇప్పటికే మంజూరు చేశారని, బిజెపి ప్రభుత్వం దానిని అమలు చేయడం లేదని స్పష్టం చేశారు. హోదాకు సంబంధించి ప్రధానికి పవన్ కల్యాణ్ హెచ్చరికలు జారీ చేయడంతో ఉద్యమంపై ఆయన చిత్తశుద్ధి తెలుస్తోందన్నారు. హోదా ఆంధ్రుల హక్కు అని, ఈ హక్కును సాధించేందుకు, రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేసేందుకు పవన్ నేతృత్వం అవసరమన్నారు. ఒక్క పిలుపుతో లక్షలాది మంది యువకులు కాకినాడ తరలిరావడం గమనించాల్సి ఉందన్నారు. ఎటువంటి కేసులు లేని పవన్ సారధ్యంలో ఉద్యమం ముందుకెళ్లే అవకాశం ఉందన్నారు. జగన్‌పై ఉన్న కేసుల వల్ల ఆ పార్టీ ఉద్యమంపై అనుమానాలు ఉన్నాయని, కాంగ్రెస్ పరిస్థితి తెలిసిందేనన్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి మేలు జరిగేలా చట్టంలో పొందుపరిచినప్పటికీ, ప్రజలకు వివరించలేకపోయిందన్నారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమం సాగాలన్నారు. బిజెపిపై తిరగబడిన పవన్, త్వరలో టిడిపిపై కూడా తిరగబడే అవకాశం లేకపోలేదన్నారు. ఎంపీలు రాజీనామా చేసి హోదా కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.